Featuredస్టేట్ న్యూస్

క్యాంప్‌ రాజకీయాలు షురూ…

  • మూడు ఎమ్మెల్సీల కోసం టీఆర్‌ఎస్‌ వ్యూహం
  • పదవి ముగుస్తున్న ఎంపిటిసి,జడ్పీటీసీలకు జాక్‌పాట్‌
  • క్యాంపులకు తరలిన ప్రజాప్రతినిధులు
  • కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌
  • మంత్రుల సారథ్యంలో పక్కా ప్లాన్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నెల 31 న జరగనున్న ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు ఛాలెంజ్‌గా తీసుకోవడంతో విజయం సాధించేందుకు అప్పుడే తమ వ్యూహాలకు పదును పెట్టాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీలు పక్కదారి పట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నిక వరకు కాపాడుకునేందుకు రకరకాలుగా ప్రయాత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికను సవాల్‌గా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాగైనా చేజిక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది. ఎవరు ఎప్పుడు అధికారపార్టీ వైపు చూస్తారనే భయంతో ఉన్న విపక్ష పార్టీ నాయకులు కూడా ఏ మాత్రం తగ్గకుండా తమవారిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కాంగ్రెస్‌ స్థానిక ప్రజా ప్రతినిధులను కేరళలోని మున్నార్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. అసలే వేసవి కాలంతో పాటు ఈ నెల 31 వరకు అక్కడే ఉండాల్సి రావడంతో ప్రజాప్రతినిధులను చల్లని ప్రదేశాలకు తరలిస్తున్నారు…

హైదరాబాద్‌ :

స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీలను దక్కించు కోవడానికి అధికార టిఆర్‌ఎస్‌ అప్పుడే రంగం సిద్దం చేసింది. దీనికోసం క్యాంపు రాజకీయాలు చేపట్టింది. మరోవైపు పదవీకాలం ముగుస్తున్న ఎంపిటిసిలు,జడ్పీటీసీలకు జాక్‌పాట్‌ తగులనుంది. జూలైలో పదవీకాలం ముగిసేలోగా వీరు సమ్మర్‌ క్యాంపులకు ఓకే అన్నట్లు సమాచారం. దీంతో నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. కాంగ్రెస్‌ సర్దుకునే లోపే మెజార్టీ సభ్యులను క్యాంపులకు తరలించారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా తెరాస ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రులు జగదీశ్వర్‌ రెడ్డి,ఎర్రబెల్లి దయాకర్‌ రావులు క్యాంప్‌ రాజకీయాల బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. రంగారెడ్డికి సంబంధించి మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం. మొత్తంగా మూడు సీట్లకోసం క్యాంపులు నడువనున్నాయి. దీంతో నల్లగొండ, వరంగల్‌ స్థానిక సంస్థల ప్రతినిధు లను సమ్యర్‌ క్యాంపుల పేరుతో తరలించారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని.. జిల్లాలో తమ పార్టీకి పూర్తి పట్టుందని నిరూపించుకోవాలని తెరాస వ్యూహత్మకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అందు లో భాగంగా.. స్థానిక సంస్థల ప్రతినిధులైన ఓటర్లను క్యాంపులకు తరలించడం ప్రారంభించింది. వారిని పోలింగ్‌ రోజు నేరుగా ఓటు వేయించేందుకు తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. 2015 జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాసపై కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో తెరాస క్యాంపుల్లోని సభ్యులు కొందరు రాజగోపాల్‌రెడ్డికే ఓటేసినట్లు సమాచారం. తరువాతి పరిణామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తెరాసలో చేరారు. ప్రస్తుతం 70 శాతానిపైగా సభ్యులు తెరాసలోనే ఉన్నట్లు అధికారపార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డికి అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో ఓటర్ల రక్షణ బాధ్యతలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిలకు అప్పగించినట్లు సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు.. ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడికి తరలించాలనే విషయంపై ఎప్పటికపుడు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. క్యాంపులకు అవసరమయ్యే నిధులను నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి తెరాస తరఫున పోటీచేసిన ఓ పారిశ్రామిక వేత్త సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతోపాటు కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ సభ్యులు 835 మంది, జడ్పీటీసీలు 59.., కౌన్సిలర్లు 210 మంది ఉన్నారు. వీరిలో 24 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు. 59 మంది జడ్పీటీసీ సభ్యుల్లో భువనగిరి సభ్యుడు సుధాకర్‌ సమావేశాలకు గైర్హాజరు కావడంతో తొలగించారు. సూర్యాపేట జడ్పీటీసీ సభ్యురాలు దరావత్‌ శకుంతల మృతి చెందారు. ప్రస్తుతం కౌన్సిలర్లు 210 మంది ఉన్నారు. మొత్తంగా 1,110 మంది ఓటర్లుండాలి. అందులో 26 మంది సభ్యత్వాన్ని కోల్పోగా.. 1,084 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎక్కువ మందిని నాలుగు బృందాలుగా విభజించి.. మూడు రాష్టాల్లోన్రి ముఖ్య ప్రాంతాలకు తరలించనున్నట్లు సమాచారం. వీరిని సమన్వయం చేసే పనిని ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, సత్యవతి రాథోడ్‌లకు అప్పగించినట్లు సమాచారం. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్టాల్లోన్రి ఊటీ, కొడైకెనాల్‌, మున్నార్‌, చిక్‌మంగళూరు, మైసూర్‌, బెంగళూరులోని నందిహిల్స్‌, శివమొగ్గ తదితర వేసవి విడిది ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే గడువుంది. కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంది. అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మిని ఎంపిక చేయడంతోనే ఈ విషయం స్పష్టమైంది. గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. తమ పార్టీ నుంచి గెలుపొందిన సభ్యులను కాపాడుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే.. తెరాస క్యాంపు రాజకీయాలకు తెర లేపడంతో కాంగ్రెస్‌ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాజకీయ శిబిరాలు మొదలయ్యాయి. వీటికి తెరాస శ్రీకారం చుట్టింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నగరంలోని కార్పొరేటర్లు, పట్టణాల్లోని కౌన్సిలర్లను బుధవారం ప్రత్యేక వాహనాల్లో శిబిరాలకు తరలించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. శిబిరాలకు నేతల్ని తరలించే పనిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తలమునక లయ్యారు. వరంగల్‌ పశ్చిమ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ సైతం తన పరిధిలోని ప్రజాప్రతినిధులను గురువారం శిబిరానికి తీసుకెళుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ హన్మకొండలో విలీన గ్రామాల కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఒక్కచోటకు తీసుకున్నట్లు తెలిసింది. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని కౌన్సిలర్లను హైదరాబాద్‌లోని ఒక ¬టల్‌కు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, చాల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్‌ తదితరులు తమ ప్రాంతాల్లోని సభ్యులను శిబిరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 901 మంది ఉన్నారు. వీరిలో తెరాస కనీసం 600 మంది వరకు క్యాంపుకు తీసుకెళుతున్నట్లు వినికిడి. శిబిరాలు కొన్ని వరంగల్‌లో నిర్వహిస్తుండగా, ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్‌ లో ఏర్పాటు చేశారు. రాజధానిలో పలు విలాసవంతమైన ¬టళ్లను బుక్‌ చేశారు. అక్కడ సభ్యులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. కొందరు సభ్యులను ఇతర రాష్టాల్రకు కూడా తీసుకెళతారనే ప్రచారం జరగుతోంది. మొత్తంగా పోలింగ్‌ జరిగే వరకు సభ్యులందరినీ శిబిరాల్లోనే కొనసాగించి, కాలక్షేపానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నట్టు సమాచారం. అనంతరం నేరుగా ఓటింగ్‌కు తీసుకొస్తారని తెలుస్తోంది. సభ్యుల పదవీ కాలం ముగుస్తుండడంతో కొందరు భారీగా బేరసారాలకు దిగుతున్నట్టు వినికిడి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close