Featuredస్టేట్ న్యూస్

ఆలూ లేదు.. చూలూ లేదు… మంత్రి పదవులపై లెక్కలు…

  • పదహారు తగ్గవంటున్న గులాబీ బాస్‌…
  • కేంద్రంలో మేమే కీలకమంటూ సంకేతాలు…

పక్కా నూటికి నూరు శాతం తెలంగాణలో పదహారుకు పదహారు సీట్లు గెలవడం ఖాయం.. కేంద్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ చక్రం తిప్పడం నిజం అంటున్నారు గులాబీ బాస్‌.. తెలంగాణలో జరిగిన పదిహేడు లోక్‌సభ స్థానాల్లో ఒకటి మినహా పదహారు స్థానాల్లో గులాజీ జెండా ఎగురుతుందని చెపుతున్నారు కెసిఆర్‌.. పోలింగ్‌ దృష్ట్యా చూసినా, ప్రచారం దృష్టా లెక్కలేసినా కారు పార్టీ పదిలోపు స్థానాల్లోనే తమ ప్రాతినిథ్యం చూపుతుందని సర్వేలన్నీ ఘోషించినా కూడా కెసిఆర్‌ మాత్రం పదహారుకు ఒక్కటి కూడా తగ్గదంటున్నారు.. అదేలాగో తెలియక పార్టీ నాయకులు, బరిలో ఉన్న అభ్యర్థులు సతమతమవుతున్నారు. అసెంబ్లీ మాదిరిగా, తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలుపు అంత ఈజీగా లేదని ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తుంటే అర్థమవుతోంది.. కాని అధినేత మాటల్లో మాత్రం వణుకు, బెణుకు లేకుండా పక్కా పదహారు గెలుస్తాం, కేంద్రంలో మూడు, నాలుగు మంత్రి పదవులు దక్కించుకుంటామంటూ చెపుతున్నారు. అన్ని సీట్లు ఏలా వస్తాయో, ఏలా గెలుస్తాయో అధినేతకే తెలియాలంటున్నారు పార్టీ సీనియర్‌ నాయకులు. పోటిచేసిన అభ్యర్థులకే కొన్ని స్థానాలపై నమ్మకం లేదని చెపుతుంటే అధినేత మాత్రం అన్ని స్థానాల్లో గెలుస్తామని చెప్పడం వెనుక అంతర్యం మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌….

కేంద్రంలో హంగ్‌ వస్తుంది.. ఏ పార్టీకి పూర్తి మెజారిటి రాదు. అప్పుడే దేశంలోని ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయి. అందులో తెరాస నుంచి పదహారు స్థానాల్లో విజయం సాధిస్తే మనం అప్పుడు కేంద్రంలో కీలకంగా మారిపోతాము. అప్పుడు అన్ని పార్టీలకు మన సీట్లే కీలకం కానున్నాయని మనం చెప్పినట్టే అందరూ వింటారని తెరాస అధినేత కెసిఆర్‌ తన సన్నిహితులతో చెపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలోని పదహారు సీట్లపై సాధించేందుకే ఇన్నిరోజులు కష్టపడ్డామంటున్నారు. ప్రతిపక్షాలు తాము సగం సీట్లు సాధిస్తామని చెపుతున్నారు కాని వారికి చెరోక సీటు రావడం కూడా గగనమే అంటున్నారు. లోలోపల మన తెరాస పార్టీ నాయకులు, అభ్యర్థులు గ్రౌండ్‌ లెవల్‌ వర్క్‌బాగా చేశారని తెరాస గెలుపు మాత్రం ఖాయమంటున్నారు. నిజంగా తెరాస పార్టీ పదహారు స్థానాల్లో విజయం సాధించి గెలుపు సాధిస్తుందా అంటే పార్టీ నాయకులే సరియైన సమాధానం చెప్పడం లేదు. టిఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించినా కొన్ని స్థానాల్లో పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినట్లే తెలుస్తోంది. అసెంబ్లీ మాదిరిగా అంత ఈజీగా ఓట్లు పడలేదని తెలుస్తుందీ కాని అధినేత మాత్రం ఓటర్లు కారుకు లైన్‌ కట్టి ఓట్లు వేసినట్లు అన్నిస్ధానాల్లో మనమే విజయపతాకం ఎగరవేసినట్లు మాట్లాడడంపై ఎవరికి ఏమి తోచడం లేదనే భావన కలుగుతున్నట్లు అనిపిస్తోంది. ఐనా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో విజయబావుటా ఎగురవేసి కేంద్రంలో తమ ప్రతాపం చూపుతుందంటున్నారు అధినేత కెసిఆర్‌. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయి. గత అసెంబ్లీలా కాకుండా గుణపాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్‌,బిజెపి తమ మనుగడను కాపాడుకునేందుకు కెసిఆర్‌ అంచనాలకు మించి విశ్వప్రయత్నాలు చేసింది. తెరాస క్లీన్‌స్వీప్‌ చేయకుండా బిజెపి, కాంగ్రెస్‌ జాతీయనాయకులతో సహా విస్తృత ప్రచారం నిర్వహించారు. గులాబీ కారు పదహారుకు పదహారు సీట్లు సాధిస్తామనుకున్న దాని ఆలోచనలకు గంటికొట్టెలా ఎక్కడికక్కడే అడ్డుకట్టవేసినట్లు తెలుస్తోంది. కారు పార్టీ పదహారు సాధిస్తానని పైకి మాత్రమే చెపుతున్నా, లోపల మాత్రం అంతా టెన్షన్‌ టెన్షన్‌తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కెసిఆర్‌ స్వంత కూతురు కవిత స్థానంలోనే గెలుపు అంత ఈజీగా లేదని తెలుస్తూనే ఉంది. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, చెవేళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ గెలుపు గగనమని తెలుస్తూనే ఉన్నా కాని అక్కడ కూడా విజయం సాధించి అన్ని స్థానాలను కైవసం చేసుకుందామని అధినేత చెప్పడంపై అందరిని విస్మయానికి గురిచేస్తోంది. పదహారు సీట్లు సాధించి కేంద్రంలో ప్రధాన పాత్ర వహించి మూడు నాలుగు మంత్రి పదవులును ఏలాగనా సాధించాలనే ఆలోచనతోనే కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారాన్ని పంచాల్సిందే…

కేంద్రంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వానికి మన మద్దతు తప్పనిసరిగా కావాల్సిందేనని అప్పుడు ఏలాగైనా అధికారాన్ని పంచుకోవాల్సిందేనని అందుకు తగ్గట్టుగా పావులు కదిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సిద్దమైనట్లు తెలుస్తోంది. పదహారు మంది ఎంపీలతో కేంద్రంలో కనీసం మంత్రి పదవులును సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని తన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎలాగూ తెరాసకు రాజ్యసభలో సరిపడ బలం ఉంది. అది ముందు ముందు మరింత పెరగనూవచ్చు. కాబట్టి కేంద్రంలో చక్రం తిప్పేందుకు మరింతగా అవకాశం ఏర్పడుతుందని, దానితోపాటు నాలుగు మంత్రి పదవులను తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని కెసిఆర్‌ అంటున్నట్లు సమాచారం. గత ఐదేళ్లలో అవకాశం కాస్తో కూస్తో ఉన్నా కెసిఆర్‌ కేంద్రంలో అధికారాన్ని పంచుకునేందుకు వెళ్లలేదు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మోడీ ప్రభుత్వంలో కెసిఆర్‌ చేరలేదు. ఈ సారి మాత్రం కేంద్రంలో కూడా అధికార పక్షంలో భాగస్వామి అయ్యేందుకు కెసిఆర్‌ రెడీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఏలాగైనా కేంద్రంలో హంగ్‌ తరహా పరిస్థితి వస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారని అప్పుడే మనమే ప్రధానం కావచ్చని అందుకే ఎవరి జాగ్రత్తలో వారు ఉంటే మంచిది కదా అనే ఆలోచన వ్యక్తం చేస్తున్నట్లు చెపుతున్నారు. కెసిఆర్‌ ఏది చేసినా పథకం ప్రకారం ఆలోచించి చేస్తారని అంటారు కాని అసలు తెలంగాణలో పదహారుకు పదహారు గెలవమనే సమాచారం కెసిఆర్‌ దగ్గర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాని కేంద్రంలో రాబోయే ప్రభుత్వానికి తమ వాణిని వినిపించేందుకే అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణలో కెసిఆర్‌ తట్టుకోవడం కష్టమనే సమాచారం ఉంది. అందుకే అవసరాన్ని బట్టి ఎవరితోనైనా కలిసేందుకు తాము సిద్దమని, తెలంగాణలో పదహారు సీట్టు గెలిస్తామని జాతీయ నాయకులకు తెలియజేసేందుకే ఆ పదం వాడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపితో టిఆర్‌ఎస్‌ మిత్ర సంబంధాలు ఉన్నాయని లోలోపల తెలుస్తున్నా కాని ఇటీవల జరిగిన ప్రచారంలో రెండూ పార్టీలో హోరాహోరీగా మాటల తూటాలతో ఒకరిని ఒకరు దూషించుకున్నారని అర్థమైపోతుంది. జాతీయ పార్టీ బిజెపి, కాంగ్రెస్‌లు రెండూ పూర్తి మెజారిటీ సాధించడం కష్టమని కొన్ని సర్వేల ప్రకారం తెలుస్తోంది. అందులో ఏ పార్టీ అధికారంలోకి రావాలనే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరని తెలిసిపోతుంది. అందుకే అవకాశాన్ని బట్టి ఎవరికో ఒకరికి జై కొట్టాలనే ఆలోచనలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆంధ్రాలో వైకాపా పార్టీ, తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ రెండూ ఒకే పొత్తుకిందకు చేరుతాయని, కేంద్రంలో ఇద్దరూ కలిసి బిజెపికి మద్దతు ప్రకటిస్తారని తెలిసినా అప్పటి పరిస్థితులను బట్టి ఎవరూ ఎటు పోతారనేదే అర్థం కాని విషయం. ఎందుకంటే రాజకీయంలో ఇప్పుడున్న శత్రువులు రేపు మిత్రులు కావచ్చు. ఇప్పటి మిత్రులు రేపటి శత్రువులుగా మారవచ్చు. అందుకే అవసరాన్ని బట్టి మారే రాజకీయం మే ఇరవైమూడున ఎవరిని ఏ గూటికి చేర్చుతుందో తెలియదు. ఎందుకైనా మంచిదే ఎవరి ప్రయత్నంలో వారు ఉంటే మంచిదని గులాబీ అధినేత కెసిఆర్‌ ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లు అర్థమైపోతుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close