Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఏ చట్టం మేరకు పురాతన భవనాలు కూలుస్తారు?

ఎర్రమంజిల్‌ కట్టడం కూల్చివేతను ప్రశ్నించిన హైకోర్టు

అసెంబ్లీ నిర్మణంపై ఇరువర్గాల వాదన

విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌ : పురాతన భవనాలను ఏ చట్టం ప్రకారం కూలుస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పురాతన భవనాలను కూల్చివేసే అంశంపై గతంలో పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎర్రమంజిల్‌లో ప్రస్తుతం ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం వారసులు నిర్మించిన పురాతన కట్టడాలను కూల్చివేయడానికి వీల్లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆ భవనాలు చారిత్రక పరిరక్షణ కట్టడాల పరిధిలోకే వస్తాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రధానంగా వాదించారు. ఎలాంటి అవసరం లేకపోయినా కొత్తగా అసెంబ్లీ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీంతో ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం అవసరాలకు సరిపోవడం లేదని, భదత్రాపరంగానూ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిపుణుల సూచనలతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే నూతన అసెంబ్లీ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలు కావని.. చారిత్రక జాబితా నుంచి ప్రభుత్వం వాటిని తొలగించిందని అదనపు ఏజీ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జోక్యం చేసుకున్న హైకోర్టు.. ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చాక వాటిని ఏవిధంగా తొలగిస్తారని ప్రశ్నించింది. వాటిని కాపాడాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి కదా అని వ్యాఖ్యానించింది. ఏ ప్రాతిపదికన ఆ భవనాలు కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో చెప్పాలని ప్రశ్నించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. దీనిపై మళ్లీ వాదనలు వింటామని పేర్కొన్న హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close