విద్యతో వ్యాపారం…

0

వ్యాపారాలు చేస్తే అది వ్యాపారం అవుతోంది. కాని చదువు చెప్పే పాఠశాలలు చదువు కన్నా ఎక్కువగా వ్యాపారమే చేస్తున్నారు.. చదువు సంగతి తర్వాత కాని ముందు విద్యార్థులకు సంబంధించిన ప్రతి వస్తువు కొనాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.. ప్రవేట్‌ పాఠశాలల యజమాన్యాలను కాదని బయటి కొన్నారో ఇంక అంతే సంగతులు.. మన విద్యార్థులకు అక్కడ చ్కులే చూపిస్తున్నారు.. వారి ఇచ్చే వస్తువులకన్నా మనం ఎక్కువ నాణ్యత వస్తువులు కొన్నా అక్కడ పనిచేయ్యవు.. పుస్తకాలతో పాటు, యూనిఫామ్స్‌, బూట్లు, టై, చివరాఖరికి పెన్సిల్‌ కూడా అక్కడే కొనాలి.. కాదు లేదు అనే మాటలు అక్కడ ఎంత వాగినా వారికి వినిపించవు.. ఎందుంటే నేడు విద్యాసంస్థలు సరస్వతి నిలయాలు కాదు విద్యార్థులతో వ్యాపారం చేసే వ్యాపార సంస్థలుగా మారాయి. వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన యంత్రాంగం మాత్రం వారికేమి పట్టనట్టు తెలిసినా తెలియనట్టు ప్రవేట్‌ విద్యాసంస్థలపై కన్నెకూడా వేయడం లేదు.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేట్‌ విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. ఫీజులపై నియంత్రణ లేకుండా పోయింది. రకరకాల పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు కూడా పాఠశాలల్లోనే కొనాల్సిన దుస్థితి ఉంది. దీనికితోడు ఫీజులు విపరీతంగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌ విద్యకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌ కాకుండా.. ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించి పంపిణీ చేసే పుస్తకాలను అమలు చేయడం వల్ల వాటికి తల్లిదండ్రులు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో ఇక యాజమాన్యాలు చెప్పిందే సిలబస్‌గా ఇప్పటికే పుస్తకాల ముద్రణ సాగుతోంది. ఓ వైపు విద్యాసంవత్సరం ముగియడానికి గడవు దగ్గర పడుతున్న వేళ.. కొత్త విద్యాసంవత్సరానికి ప్రైవేట్‌ స్కూళ్లు అప్పుడే ప్రణాళిక సిద్దం చేస్తున్నాయి. ప్రైవేట్‌ పబ్లిషర్లు విద్యాసంస్థలతో కుమ్మక్కయి వీటిని అంటగడుతున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులే కాదు.. పుస్తకాలూ మోతెక్కిపోతున్నాయి! ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌ను తప్పకుండా అమలు చేయాలన్న నిబంధన విషయంలో మౌనంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చినట్లు తెలిసింది. ప్రైవేటు పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు కలిసి ఈ తతంగం నడిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాశాఖ నిర్దేశిత సిలబస్‌ పుస్తకాలనే వినియోగించాలి. కానీ ప్రైవేటు యాజమాన్యాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పబ్లిషర్లు ఇచ్చే కవిూషన్ల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పుస్తకాలను వినియోగిస్తున్నాయి.ఈ దశలో పుస్తకాల ముద్రణకాగితం ధర పెరగడంతో పుస్తకాల ధరలు కూడా పెరగనున్నాయని తెలుస్తోంది. ఈ రకంగా 6 నుంచి 10వ తరగతి పాఠ్య పుస్తకాల ధరలు గత ఏడాదితో పోల్చుకుంటే 13శాతం పెరగనున్నాయి. ఈప్రభావం 10 లక్షల మంది విద్యార్థులపై పడనుంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు సర్కారు ఉచితంగా సరఫరా చేసే పుస్తకాలు ధరలు 15శాతం పెరగనున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం పాఠ్యపుస్తకాల ధరలు భారీగా పెరగనున్నాయి.

దీంతో  30 లక్షల కుటుంబాలపై  భారం భారీగా పెరగనున్నదని తెలుస్తోంది.   మరింత లాభం కోసం తమ పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాయి. పైగా ప్రభుత్వ సిలబస్‌ కంటే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల స్థాయి మెరుగ్గా ఉందని చెబుతున్నాయి. గతేడాది ఇదే వాదనను తెరపైకి తెచ్చాయి. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల స్థాయికి అనుగుణంగా ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలను మెరుగుపరిస్తే అమలు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నాయి. మరి నిజంగానే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు మెరుగ్గా ఉన్నాయా? ఉంటే వాటి స్థాయికి ప్రభుత్వ పుస్తకాలను ఎందుకు అభివృద్ది  చేయడం లేదనన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆ స్థాయి విద్యను అందించేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన ఉంది. అయితే ఇందులో మెరుగైన బోధన, పుస్తకాల స్థాయి కంటే వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖకు, ప్రభుత్వానికి తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తున్న దాదాపు 30 లక్షల కుటుంబాలపై పాఠ్యపుస్తకాల భారం పడబోతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే 15 లక్షల మంది విద్యార్థుల పుస్తకాల ధరలు ప్రస్తుత విద్యా సంవత్సరం ధరల కంటే 13 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు పుస్తకాల ధరలు పెంచుకునేందుకు పబ్లిషర్లకు విద్యాశాఖ ఓకే చెప్పింది. పేపరు ధరలు పెరిగినందున పుస్తకాలు, నోట్‌బుక్స్‌  రేట్లు పెంచేందుకు అంగీకరించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేటులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే మరో 15 లక్షల మంది విద్యార్థులపై మరింత భారం పడబోతోంది. ఈ 13 శాతం భారంతోపాటు ప్రైవేటు పబ్లిషర్లు అదనంగా నిర్ణయించే ధరలను కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాకాకుండా ప్రైవేటు స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలను అమలు చేస్తే ఒక్కో పుస్తకాల సెట్‌కు సగటున రూ.220లోపు ఖర్చు కానుంది. నోట్‌బుక్‌లతో కలుపుకొని రూ.500 వరకు అవుతోంది. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను అమలు చేస్తే ఒక్కో విద్యార్థి పుస్తకాలు, నోట్‌బుక్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రాథమిక తరగతుల పుస్తకాలు, నోట్‌బుక్‌లకు రూ.3 వేలపైనే వెచ్చించాల్సి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేటు పాఠశాలలు కచ్చితంగా ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలను వినియోగించాలని విద్యాశాఖ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యా సంవత్సరం మొదలయ్యాక ఎలా ఈ ఆదేశాలను అమలు చేస్తామని యాజమాన్యాలు ప్రశ్నించాయి. పైగా ఈసారి ముందస్తుగానే పుస్తకాలను ముద్రించేందుకు చర్యలు చేపట్టింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here