Featuredస్టేట్ న్యూస్

రోడ్డెక్కిన బస్సులు!

  • విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు
  • ఆర్టీసీపై మరింత వేగంగా చర్యలు
  • వచ్చే ఆదివారమే కార్మికులతో సీఎం భేటీ
  • ప్రగతిభవన్‌ వేదికగా కేసీఆర్‌ చర్చలు
  • ఆర్టీసీ యూనియన్‌ నేతలకు షాక్‌..

హైదరాబాద్‌

సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్‌ పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల నుంచి బస్సులు బయటికి వచ్చి రోడ్డెక్కాయి. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌ లోని ముషీరాబాద్‌ డిపో నుంచి సుమారు 600 ఉద్యోగులు విధుల్లో చేరేందుకు డిపోకు చేరుకున్నారు, హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న25 డిపోల్లోని 3వేలు బస్సులు రోడ్డుపైకి వస్తున్నాయి. రాష్ట్రన్యాప్తంగా ఉన్న 97 డిపోల్లోని 49 వేల మంది సిబ్బంది విధుల్లోకి చేరారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,862 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరుకు దాదాపు 15 మంది కండక్టర్‌లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిప్ట్‌ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్‌ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ ఆర్టీసీ డీపోలవద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్మికులు ఆనందంగా విధుల్లో చేరుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని 9 డిపోల్లో మొత్తం 4,200 మంది కార్మికులు ఉత్సాహంగా విధుల్లో చేరారు. సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ విధుల్లోకి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తమను విధుల్లో చేరమని చెప్పిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే సంస్థ కోసం తక్షణం రూ. 100 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో సంతృప్తి లేనప్పటికీ.. ఉద్యోగాల్లో చేరడం, ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని చెంగిచెర్ల డిపో వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయడానికి టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు.. టీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్నారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్న పలుకరించని నేతలు ఇప్పుడు వస్తారా? అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేది ఏమిలేక డిపో ముందు సీఎం ఫోటోకు పాలాభిషేకం చేసి వెళ్లిపోయారు.

ఆర్టీసీ యూనియన్‌ నేతలకు షాక్‌..కార్యాలయాలకు తాళాలు

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకున్న సిఎం కెసిఆర్‌ ఇప్పుడు అంతే వేగంగా పావులు కదుపుతున్నారు. ఆర్టీసీ యూనియన్‌ కార్యాలయాలకు తాళాలు వేయించాలరు. అలాగే వారు కూడా ఖచ్చితంగా విధులకు హజారయ్యేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపోతే కార్మికులతో నేరుగా చర్చించేందుకు సిద్దం అయ్యారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌లో వచ్చే ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం కానున్నారు. 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రతిడిపో నుంచి ఐదుగురు కార్మికుల చొప్పున సమావేశానికి ఆహ్వానించ నున్నారు. కార్మికులను ప్రగతిభవన్‌కు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశానికి రవాణాశాఖ మంత్రి అజయ్‌ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలకు ఆహ్వానం పంపారు. ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలి. అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతిభవన్‌కు తీసుకురావాలి. ప్రగతిభవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాం. భోజనం అనంతరం కార్మికులతో మాట్లాడుతానని’ కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ భేటీతో ఆర్టీసీ పట్ల తనకున్న లక్ష్యాలను వివరించనున్నారు. వారు కార్మిక సంఘాల జోలకి వెల్ళకుండా దిశా నిర్దేశం చేయనున్నారు.

కార్మికనేతలకు విధుల నుంచి మినహాయింపు రద్దు

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు విధుల నుంచి మినహాయింపును ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. రాష్ట్ర స్థాయిలో టీఎంయూకు చెందిన 26 మంది, ఎంప్లాయిస్‌ యూనియన్‌కు చెందిన ముగ్గురు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు చెందిన ఒకరికి విధుల నుంచి మినహాయింపు ఉండేది. కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం పని చేసేందుకు వీలుగా కార్మిక సంఘాల నేతలకు విధుల నుంచి మినహాయింపును ఇచ్చేవారు. వీరు విధులకు హాజరు కాకపోయినా ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించేది. జిల్లా, డిపో స్థాయిలోనూ కార్మిక సంఘాల నాయకులకు విధుల నుంచి మినహాయింపు ఉండేది. తాజా పరిణామాల దృష్ట్యా.. కార్మిక సంఘాల నాయకులకు విధుల నుంచి మినహాయింపు ఉండదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో బస్‌ భవన్‌లోని గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. విజిలెన్స్‌ డైరెక్టర్‌ రామచందర్‌రావు ఆదేశాల మేరకు తాళాలు వేసినట్లు బస్‌ భవన్‌ భద్రతా సిబ్బంది వెల్లడించింది. కార్మిక సంఘాలను క్షమించబోమన్న కేసీఆర్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ కార్యాలయాన్ని బస్‌భవన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్‌ విజిలెన్స్‌ రామ్‌చందర్‌రావు, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ కిరణ్‌ ఆదేశాల మేరకు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఏంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో టీఎంయూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డికి షాక్‌ తగిలిన్టటైంది. ఇక రానున్న కాలంలో యూనియన్లకు గడ్డు పరిస్థితులే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. రిలీఫ్‌ డ్యూటీ అంటే.. కార్మికుల ఇబ్బందుల పరిష్కారం కోసం పనిచేసేందుకుగానూ కార్మిక నేతలకు డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది. విధులకు హాజరు కానున్నా పూర్తిస్థాయి జీతం చెల్లించేది. జిల్లాలో జోనల్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీలకు ఫుల్‌ డే రిలీఫ్‌, హాఫ్‌ డే రిలీఫ్‌లు వారానికి మూడురోజులు వర్తింపజేసేది. వీరితోపాటు రీజినల్‌ సెక్రటరీలకు, డిపో కార్యదర్శిలకు వారానికి ఒక రోజు వేతనం చెల్లించేవారు. వీటిని రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో ఇకమీదట కార్మిక నేతలెవరికీ రిలీఫ్‌ డ్యూటీలు ఉండవు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close