Featuredరాజకీయ వార్తలు

మున్సిపోల్‌కు బ్రేక

  • తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నిలుపుదల
  • ఉత్తమ్‌ పిటిషన్‌పై విచారణ..నేటికి వాయిదా

హైదరాబాద్‌

తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు బ్రేక్‌ వేసింది. దీనిపై విచారణ జరపిన హైకోర్టు మంగళవారం వరకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని ఆదేశించింది. ఎన్నికల నియమావళిని సమర్పించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ షెడ్యూల్‌ ప్రకారం 7న నోటిఫికేషన్‌ విడుదలకావాల్సింది. విచారణ అనంతరం హైకోర్టు విచారణ నేటికి వాయిదా వేసింది. దీంతో తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు బ్రేక్‌ పడింది. వార్డుల రిజర్వేషన్‌, నోటిఫికేషన్‌ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికల నియామవళిని తమకు అందజేయాలని హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మంగళవారం విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వాయిదావేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. మున్సిపల్‌ ఎన్నికలపై మంగళవారం కూడా హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. విచారణలో పాత మున్సిపల్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల సంఘం షెడ్యూల్‌ తదితర అంశాలను పరిగణించి నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు తమ తీర్పు తెలియజేసే అవకాశం ఉంది. గత నెల 23వ తేదీన తెలంగాణ మున్సిపల్‌ షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. వార్డుల రిజర్వేషన్లను 6వ తేదీన, 7వ తేదీన నోటిఫికేషన్‌ ఇస్తామని పేర్కొన్నది. కానీ వార్డుల రిజర్వేషన్‌, నోటిఫికేషన్‌కు వారం రోజుల గడువు ఉండాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తరఫున ప్రకాశ్‌ రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల రిజర్వేషన్‌ ఖరారు చేసిన 24 గంటల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తే రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు అభ్యర్థులకు నష్టం కలుగుతుందని వివరించారు. ఎన్నికల సంఘం తరఫున మోహన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీచేసింది. మున్సిపల్‌ ఎన్నికల నియామవళిని అందజేయాలని కూడా పేర్కొన్నది. షెడ్యూల్‌ విడుదలతో ఇప్పటికే తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్‌ నోటిఫకేషన్‌ ఆదివారం జారీ అయ్యింది. మేయర్‌, ఛైర్‌ పర్సన్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మున్సిపల్‌ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదలకానున్న నేపథ్యంలో హైకోర్టు షాక్‌ ఇచ్చింది. నోటిఫికేషన్‌ పై ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు .. తదుపరి విచారణను నేటికి వాయిదే వేసింది. దీంతో నోటిఫికేషన్‌ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై రేపు ఎలాంటి తీర్పు వస్తుందోనన్న సస్పెన్స్‌ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్‌ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే ఈ నెల 8 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించడం సందేహాం తలెత్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్‌ వెలువడినప్పటీ నుంచి నామినేషన్‌ వేయడానికి మధ్య సమయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల కోసం వార్డుల రిజర్వేషన్ల పక్రియ పూర్తయింది. 120 పురపాలక సంఘాలు , 10 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వార్డులను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసింది. బీసీలకు 29.40 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 5.83 శాతం , ఎస్సీలకు 14.15 శాతం దక్కాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close