Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

సీసాలు మోగాలే.. ఆదాయం రావాలే…

కొత్త మండలాలకు వైన్‌ షాపులు…

  • కసరత్తు చేస్తున్న అధికారులు…
  • మరీ చేరువకానున్న మద్యం షాపులు..
  • ఇప్పటికే ఆలస్యమయిందని ఆవేదన..

తాగాలే.. ఎగరాలే.. ఎంతంటే అంత మద్యం ఇప్పుడు అన్ని గ్రామాల్లోకి అందుబాటులోకి రాబోతుంది. మద్యం కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరమే లేదు.. మన ఇంటిముందుకే, మన తండా, మన వీధిలోనే విచ్చలవిడిగా మద్యం దొరకనుంది.. ప్రభుత్వం కొరగానే కొత్త మండలాలను పెంచిందనీ ప్రజలు ఆనందపడుతున్నారు.. వేలాది తండాలను పంచాయితీలుగా మార్చివేసిందని సంబరపడుతున్నారు.. కాని పెంచిన ప్రతి మండలానికి ఒక్కటో, రెండో కొత్తగా మద్యం షాపులు రానున్నాయి.. ప్రతి తండాలో పదుల సంఖ్యలో బెల్ట్‌షాపులు వెలవనున్నాయి.. ప్రజలు ఎంత తాగితే ప్రభుత్వానికి అంత ఆదాయం.. మద్యాన్ని ఎంత అమ్మిస్తే ఎక్సైజ్‌ అధికారులకు అన్ని రివార్డులు.. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసినా, అత్యాచారాలు, అకృత్యాలు ఎన్ని పెరిగినా వారికేమి సంబంధమే లేదు.. ప్రతి పల్లెను మద్యం మత్తులో ముంచేందుకు, తాగుబోతులను మరింత పెంచేందుకు ప్రభుత్వం కొత్త మండలాలలో కొత్త షాపులను నియమించబోతుంది. ఇప్పటికే కొంత మండలాలు, కొత్త పంచాయితీలు వెలిసి సంవత్సరం దాటిపోయిందని, ఆదాయం పోతుందని ఆ శాఖ అధికారులు తెగ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.. రెన్యూవల్‌ చేసే ఆలోచన లేదని మళ్లీ టెండర్ల ద్వారా అందరిని పిలిచి, లాటరీ ద్వారా ఎంపికచేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఎందుకంటే ఒక్కరోజు టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోట్లలో ఉంటుంది. ప్రజలను మద్యంలో ముంచేందుకు, మరింత మందిని తాగుబోతులను తయారు చేసేందుకే ప్రభుత్వం, సంబంధిత శాఖ సిద్దంగా ఉందని తెలిసిపోతుంది. అందుకే ప్రతి గ్రామంలో మద్యం సీసాలు మోగాలే, మన కోరినంత ఆదాయం రావాలే అనే ఆలోచనతోనే ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. మద్యం వల్ల ఎన్ని ఆనర్థాలు జరిగినా ప్రభుత్వం తనకేమి సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తుందని ఆరోపణలు వెలువడుతున్నా, మద్యంపై వచ్చే ఆదాయమే ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించడం గర్హనీయం..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గ్రామాలలో మద్యం ఏరులై పారేందుకు అంతా సిద్దమవుతోంది.. కొత్త టెండర్లను పిలవాలంటే ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ప్రజలు కొరుకున్నంతనే కొత్త మండలాలను ఏర్పాటు చేశాం. తండాలను పంచాయితీలుగా మార్చివేశాం.. మద్యాన్ని కూడా పల్లెలకు మరింతగా దగ్గరికి చేస్తూ అనుకున్నంత ఆదాయాన్ని రాబట్టే దిశగా భారీగా కొత్త మండలాలో మద్యం షాపులు పెరగనున్నాయి. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకు పైగా మండలాలు పెరిగాయి. పెెరిగిన మండలాలలో కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు పాలన, పథకాలేమో కాని మద్యం మాత్రం ప్రతి పల్లెకు అందుబాటులో ఉంచేలా చేస్తుంది. ఇంతకు ముందు పది, పదిహేను గ్రామాలకు ఒక్క మండలం ఉండేది. గ్రామాలకు, మండలాలకు వ్యత్యాసం బాగా ఉందని ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. శివారులో ఉన్నా తండాలను కూడా గ్రామపంచాయితీలుగా మార్చివేసింది. ఒక్క మండల కేంద్రంలోనే అందుబాటులో ఉండే మద్యం షాపులు, ఇప్పుడు ప్రజలకు మరింతగా దగ్గర కానున్నాయి.

కొత్త మండలాల్లో కొత్త వైన్‌ షాపులు..

తెలంగాణలో కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటైనా సంగతి తెలిసిందే.. ఈ కొత్త జిల్లాలు కొత్త డివిజన్లు మండలాలతో పాలన ఎంత సులభమైందో, ప్రజలకు ఎంత మేలు జరిగిందో తెలియదు కాని మందు బాబులకు మాత్రం కొత్త పండుగ రాబోతుంది. మందుబాబులకు అందుబాటులో కొత్తగా మరిన్ని మద్యం షాపులు రానున్నాయి. తెలంగాణలో అక్టోబర్‌ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన అబ్కారీ విధానంలో అదనపు దుకాణాలకు సంబంధించిన అంశాన్ని చేర్చబోతున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనా నేపథ్యంలో వాటికి తగ్గట్లుగా దుకాణాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ కనీసం ఒక మద్యం దుకాణం ఉండేలా చూడాలనే విధానాన్ని ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తున్నారు. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 125 మండలాలు ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు సగం మండలాల్లో మద్యం దుకాణాలు లేవు. ఇప్పుడు మద్యం షాపులు లేని మండలాల్లో కొత్తగా ఏర్పాటుకు అవకాశం ఉంది. నూతన వైన్‌ షాపులను ఏర్పాటు చేసే మండలాల్లో అక్కడి డిమాండ్‌ను బట్టి షాపులను కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకు గాను 2017లో రూపొందించిన ఆబ్కారీ విధానం గడువు సెప్టెంబర్‌ నెలతో ముగిసిపోనుంది. అక్టోబర్‌ ఒకటవ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇది కూడా రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయడంలో అధికారులు బిజిబిజీగా మారిపోయారు.

భారీగా పెరగనున్న మద్యం షాపులు..

తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం మద్యం షాపులు భారీగా పెరగనున్నాయి. కొత్త జిల్లాలకు తోడుగు చాలా ప్రాంతాల్లో కొత్త మండలాలు ఏర్పడడంతో ప్రతి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పును వైన్‌ షాపులను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రస్తుతం 2216 వైన్‌ దుకాణాలు, 670 వరకూ బార్లు ఉన్నాయి. వీటి సంఖ్య ఇప్పుడు భారీగా పెరగునుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్యానికి ఇబ్బందులు పడకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకనుంది. వాటికి తోడు ప్రతి తండాలో ఇబ్బడిముబ్బడిగా బెల్ట్‌షాపులు కూడా పెరగనున్నాయి. బంగారు తెలంగాణలో పేదల బతుకులు మారాయో లేదో తెలియదు కాని ప్రజలకు నిత్యం తాగిస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని మాత్రం రాబట్టుకుంటోంది.. మద్యం వల్ల ఎన్ని ఆనర్థాలు జరిగినా తమకేమి సంబంధంలేనట్లుగా ఉంటూ ప్రజల సమస్యలను మాత్రం విస్మరిస్తుంది ప్రభుత్వం. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నా, మద్యం మత్తులో అఘాయిత్యాలు పెరుగుతున్నా వాటిని మాత్రం నియంత్రించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదు..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close