Featuredస్టేట్ న్యూస్

హరీష్‌రావుకు మొండిచెయ్యే…

  • మంత్రులకే పార్లమెంట్‌ బాధ్యతలు…
  • పర్యవేక్షించనున్న టీఆర్‌ఎస్‌ అధినేత…

పదిహేడు సీట్లకు పదిహేడు పార్లమెంట్‌ స్థానాలు గెలవాలి.. ఎవరన్నా ఏమన్నా చెయ్యండి.. గెలుపు మాత్రం మనకే దక్కాలి.. పూర్తి స్థానంలో మన ఆధీనంలో ఉంటేనే మనం కేంద్రంలో చక్రం తిప్పవచ్చు.. లేకుంటే కష్టంగా మారుతోంది అంటూ నూతన మంత్రులకు సంకేతాలు జారిచేస్తున్నారు తెరాస అధినేత.. పార్టీ ఆవిర్భావం నుంచే కాకుండా ఉద్యమం నుంచి వెన్నంటే ఉంటున్న హారీష్‌రావుకు మొండిచెయ్యే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్నపార్లమెంట్‌ ఎన్నికల్లో హరీష్‌రావుకు కొన్ని లోక్‌సభ స్థానాలలో ఇంచార్జ్‌గా నియమిస్తున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకున్నారు. తీరా పార్టీలో జరిగిన పరిణామాలు చూస్తుంటే మాత్రం హరీష్‌రావును మొత్తానికే కావాలనే పక్కనపెడుతున్నట్లు అర్దమవుతోంది. నూతన మంత్రులకు బాధ్యతలు అప్పగించి హైదరాబాద్‌ నుంచే తెరాస అధినేత కెసిఆర్‌ పర్యవేక్షిస్తూ ప్రచారానికి తానే వెళ్లనున్నాడని సమాచారం. మొదటి నుంచి పార్టీని, మామనే నమ్ముకున్న హరీష్‌రావు పార్టీ భవిష్యత్తు రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. తెరాస పార్టీ కోసం, కెసిఆర్‌ కోసం ఇరవైనాలుగు గంటలు కష్టపడి పనిచేసే హరీష్‌రావును ఎందుకు పక్కనపెడుతున్నారనేది ఎవ్వరికి అర్థంకాకుండా పోతుంది. కావాలనే పక్కనపెడుతూ పార్టీనుంచి సాగనంపే ఆలోచన తెరాస అధినేతకు ఉందా అనేది నేడు ప్రధాన చర్చానీయాంశంగా మారిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏటు వైపు మళ్లుతాయో, ఏం జరగనుందో అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు తెరాస అభిమానులు

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరంటూ ఆచితూచి అడుగేస్తోంది తెరాస. పదహేడు సీట్లకు పదిహేడు సీట్లు ఏలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న తెరాస అధినాయకత్వం మంత్రులకే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కెసిఆర్‌ తర్వాత రెండవ నాయకుడుగా ఉన్న హరీష్‌రావుకు మంత్రివర్గ కూర్పులో మొండిచెయ్యి చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో హరీష్‌రావుకు బాధ్యతలు అప్పచెప్పాలని తెరాస అధిష్టానం మొదట్లో భావించిదని పార్టీ సీనియర్‌ నాయకులు చెప్పినా ఇప్పుడు మంత్రులకే బాధ్యతలు అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది. హరీష్‌రావుకు పార్లమెంట్‌ బాధ్యతల మాట వట్టిదేనని తేలిపోయింది. పార్టీ నుంచి పూర్తిగా పొమ్మనలేక పొగబెడుతున్నారనే తెరాస పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో తెరాస పార్టీ నాయకులకు ఇప్పటికి అర్థంకాని విషయం ఒక్కటే.. పార్టీకి నమ్మినబంటుగా ఉంటున్న హరీష్‌రావును ఎందుకు దూరం పెడుతున్నారనేది అందరి నోట వినిపిస్తూ ఉంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లకమందు నుంచే పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు పక్కన పెడుతూ అన్ని తానై కెసిఆర్‌ చేస్తూ ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాక రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. కాని అందులో ఏ ఒక్క విషయంలోనూ హరీష్‌రావుకు చెప్పకుండా కెసిఆర్‌, కెటిఆర్‌ నడిపిస్తున్నారని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలిసిపోతుంది. కెసిఆర్‌ పోటీ చేసిన గజ్వేలు నియోజకవర్గం ప్రతిపక్ష నాయకుడైనా ఒంటేరు అంటే హరీష్‌రావుకు అస్సలు గిట్టదని తెలిసిన విషయమే. మామను గెలిపించడానికి హరీష్‌రావు అక్కడే తిష్టవేసి మాటల తూటాలతో కెసిఆర్‌ను గెలిపించారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస ఆనతి కాలంలోనే ఒంటేరును గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్‌రావుకు మాట మాత్రం చెప్పకుండా చేశారనే పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయింది. రాబోయే రోజుల్లో కెసిఆర్‌ కేంద్రానికి వెళుతారని అప్పుడు ఆయనతో పాటు హరీష్‌రావును కూడా తీసుకెళ్తారనే సమాచారం ఉండేది. హరీష్‌రావు కేంద్రం వెళ్లాక తెలంగాణలో కెటిఆర్‌ ముఖ్యమంత్రి అవుతారనే ఊహగానాలు వచ్చాయి. కెసిఆర్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు పార్లమెంట్‌లో ఆయనకు అక్కడ అండదండగా, తోడునీడగా ఆయన పనులు, వ్యవహారాలన్నీ హరీష్‌రావే చూసుకుంటారని అందుకే ఆయన్ని వెంటతీసుకెళ్లేందుకు కెసిఆర్‌ సిద్దమయ్యాడని సమాచారం. కాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. తెరాస పార్టీలో హారీష్‌ను పూర్తిగా డమ్మీని చేసే ఏర్పాటు జరుగుతున్నాయని పార్టీ నాయకులు అంటున్నారు.

జిల్లాలవారీగా మంత్రులకే బాధ్యతలు…

నెల, రెండు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు తెరాస పార్టీ అప్పుడే సిద్దమైపోయినట్లు తెలుస్తోంది. మొదటగా ఈ బాధ్యతల్ని కెసిఆర్‌ హారీష్‌కు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడుమాత్రం కెసిఆరే అన్ని దగ్గరుండీ చూసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే వారికి అవకాశం ఇవ్వాలని, పదిహేడు స్థానాలకు, పదిహేడు గెలవని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెరాస అధినేత కెసిఆర్‌ ఇప్పుడు మొత్తం అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలవారీగా పర్యవేక్షిస్తున్నారని జిల్లా నాయకులు అంటున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌ కంచుకోట నల్గండ స్థానాన్ని హరీష్‌రావుకు అప్పగించాలనే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నారనే సమాచారం బయటికి వచ్చింది. కాని ఇప్పుడు మెదక్‌, జహీరాబాద్‌, ఖమ్మం పార్లమెంట్‌ స్థానాలపై తెరాస అధినేతే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఫైనల్‌ చేయడం, వారికి సహకరించే నాయకుల్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఆ మూడు స్థానాల్ని దగ్గరుండి గెలిపించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్ని మంత్రులకు జిల్లాల వారీగా కేటాయించినట్లు తెలుస్తోంది. వరంగల్‌, మహబూబాబాదద్‌లకు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్‌కు ఈటెల రాజేందర్‌, సికింద్రాబాద్‌కు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజవర్గాలకు చామకూర మల్లారెడ్డి, భువనగిరి, నల్గండ స్థానాలకు జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి శ్రీనివాస్‌గౌడ్‌, నాగర్‌ కర్నూల్‌కు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, అదిలాబాద్‌కు ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌కు ప్రశాంత్‌రెడ్డి, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్లను లోక్‌సభ ఇంచార్జ్‌లకు నియమించారు. ఏలాగైనా ఆ స్థానాల్లో గెలుపుజెండా ఎగరవేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల్లో ఎక్కడా కూడా హరీష్‌రావు పేరు కాని ప్రస్తావన కాని రాకుండా జాగ్రత్తపడ్డారు. దీన్ని బట్టి చూస్తుంటే హారీష్‌రావు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమైపోతుందంటున్నారు పార్టీ నాయకులు. హరీష్‌రావును కావాలనే రోజురోజుకు అతని ప్రాధాన్యతను క్రమ, క్రమంగా తగ్గిస్తున్నారని లేకుంటే లోక్‌సభ నియోజకవర్గాలకు ఆయన్నే ఇంచార్జ్‌గా నియమించేవారని అంటున్నారు. పార్టీలో కెసిఆర్‌ తర్వాత తలపండిన నాయకుడుగా పేరుగాంచిన హరీష్‌రావు పరిస్థితి ఎందుకు ఇలా అవుతుందో తెలియక సతమతవుతున్నారు హరీష్‌రావు పార్టీ అభిమానులు. ఏ ప్రభావం ముందు ముందు ఏలాంటి రాజకీయాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close