నేడు బిజెపి కీలక భేటీ

0

కమల దళతికై కసరత్తు

  • పార్టీ అధ్యక్ష ఎంపికపై చర్చించే అవకాశం
  • అమిత్‌షా వారసుడి కోసం అన్వేషణపై స్పష్టత

న్యూఢిల్లీ : భాజపా నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. గురువారం ఉదయం 11గంటలకు భాజపా కీలక సమావేశం జరగనుంది. రేపటి భేటీ తర్వాత నూతన అధ్యక్షుడి ఎంపికకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. మోదీ నేతృత్వంలో వరుసగా రెండోసారి కొత్త సర్కార్‌ కొలువుదీరడం.. మంత్రివర్గం ఏర్పాటు.. కేబినెట్‌లో అమిత్‌ షా ¬ంమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన తరుణంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలి? ఏయే అంశాలను ప్రాతిపదికలు తీసుకోవాలనే దానిపై భాజపా అధిష్ఠానం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 11గంటలకు భేటీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. పదాధికారులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. 2018 డిసెంబర్‌లోనే జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా పదవీ కాలం ముగిసింది. అప్పటికే సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు వెళ్లడం కొంత ఇబ్బందికరమని భావించిన పార్టీ అధిష్ఠానం.. అమిత్‌షాను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించింది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసి, దేశంలో భాజపా విజయ ఢంకా మోగించడం తెలిసిందే. ఈ భేటీలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రధానంగా ఎవరెవరు రేసులో ఉన్నారనే అంశంపై స్పష్టత రానుంది. దాంతో పాటు కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు ఉండబోతోంది? నామినేషన్ల పక్రియ తదితర అంశాలకు సంబంధించి షెడ్యూల్‌ను సైతం విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే పలువురు నేతల పేర్లు బయటకు వచ్చినప్పటికీ కొంతమందిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడంతో అవన్నీ పక్కకుపోయాయి. ప్రస్తుతం మంత్రి పదవి రాని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా పేరు పరిశీలనలో ఉంది.

మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్‌ పేరు సైతం ముందుకొచ్చినప్పటికీ.. ఆయనకు కేబినెట్‌లో చోటుదక్కడంతో ఆ పేరును పరిశీలనలోకి తీసుకొనే అవకాశం లేనట్టు పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. భాజపా ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌ రావుల పేర్లు విన్పిస్తున్నప్పటికీ.. వారికి అధ్యక్ష స్థాయి ఇవ్వడానికి ఇంకా మరికొంత సమయం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి పేరును ప్రకటిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది గనక ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఎంపిక పక్రియ పూర్తిచేసేందుకు అమిత్‌ షా పూనుకున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాలు ముగిసే లోపే భాజపా కొత్త అధ్యక్షుడి ఎంపిక పక్రియ పూర్తిచేయడం.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం జరిగిపోతుందని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here