కమలానికి అభ్యర్థులు కరువు..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపి బలపడాలి.. అన్ని రాష్ట్రాల్లో కమలమే వికసించాలి.. అందు కనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాలి.. ఆరునూరైనా తెలంగాణలో మ్యాజిక్‌ ఫిగర్‌ ఫలితాలను సాధించి చక్రం తిప్పాలని బిజెపి వ్యూహం పన్నుతుంది. తెలంగాణలో కెసిఆర్‌ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ ఘంటా భజాయించి చెపుతున్న కమల పార్టీకి ముందస్తు ఎన్నికల వేళ దయనీయ పరిస్థితి ఎదురవుతోంది. మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో మాత్రం పార్టీ బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పినా, తీరా రంగం మీదికి వచ్చేసరికి మాత్రం మరీ ఆధ్వాన్నంగా కనబడుతోంది. తెలంగాణలోని అన్ని పార్టీల్లోకి బిజెపి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారుకావడం ఇప్పుడా పార్టీని కలవరపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా మొదటి జాబితాలో 38మంది, రెండవ జాబితాలో 28 మంది అభ్యర్థులకు స్థానాలు కేటాయించారు. ఈ స్థానాలకే అభ్యర్థులను కేటాయించడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు విడతలుగా కేటాయించిన సీట్లలో పట్టుమని పది సీట్లపై మాత్రమే వారికి ఆశలున్నట్లు తెలుస్తుంది. మిగతా వారంతా నామికే వాస్తే అన్న ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు బరిలో నిలిచేందుకు ప్రస్తుతం అభ్యర్థులే లేరని తెలుస్తోంది. బిజెపి తరపున నాయకులే కానరాని ఈ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, టిఆర్‌ఎస్‌ తర్వాత కాంగ్రెస్‌ను మించి ప్రత్యామ్నాయంగా నిలుస్తామని చెపుతున్నారు.

అసమ్మతిలపై బిజెపి చూపు.. అన్ని పార్టీలలో సీట్ల పంపకం పూర్తయ్యాక అందులో అవకాశాలు రాని వారిని తమవైపుకు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. ఇతర పార్టీ నుంచి వలస నాయకులు వస్తే తప్ప ఆ పార్టీ మిగతా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉంది. బిజెపికి మొదటి నుంచి సమైక్య రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు సొంత బలం, బలగం లేదు. రాష్ట్రాలు విడిపోయాక కమలం బలం పెరిగిందీ లేదు. రాష్ట్రమంతా పోటీచేసే శక్తి లేదు. పార్టీని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లే క్యాడర్‌ లేదు. ఈ ఎన్నికల్లో కోదండరాం టిజెఎస్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పోటీచేయాలని ప్రణాళికలు వేశారు. కాని కోదండరాం బలమైన కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపి బిజెపికి మొండిచేయి చూపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ రద్దు కాగానే అభ్యర్థులను ప్రకటించింది. అందులో అసమ్మతి జ్వాలలు రేగుతూనే ఉన్నాయి. దానితో పాటు మహకూటమి సీట్ల ప్రకటన వెలువడగానే అవకాశం దక్కని అభ్యర్థులకు గాలం వేసేందుకు సిద్దంగా ఉంది. వాటి పైననే బోలేడు ఆశలు పెట్టుకుంది బిజెపి. మహకూటమిలో నాలుగు పార్టీలు ఉండడంతో అనుకున్న వారందరికి అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. అప్పుడు ఆ కూటమిలో అసంతృప్తి, అసమ్మతి బయటపడడం ఖాయం. చాలా మంది టిక్కెట్టు రాని వారిని చేరదీసి వారితో బేరసారాలు జరపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

వలస వాదులపై బిజెపి ఆశలు పెట్టుకునే అవకాశం ఆ పార్టీనే కలవరపెడుతోందని తెలుస్తోంది.బలమైన పునాదిని నిర్మించలేని కమలనాధులు.. ప్రతి రాజకీయపార్టీకి కింది స్థాయి నాయకత్వం చాలా అవసరం. ఎప్పుడు రాజధానిలో సమస్యలపై స్పందించడం కాకుండా జిల్లాలు, గ్రామాల్లో పార్టీ పునాదిని బలంగా తయారు చేయాలంటారు. ఏ పార్టీకైనా గ్రామస్థాయి నాయకత్వమే బలం. జాతీయ పార్టీగా ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్రాన్ని, వివిధ రాష్ట్రాలను పాలిస్తున్న బిజెపి ఎందుకు కిందిస్థాయిలోకి వెళ్లడం లేదో అర్థమే కావడం లేదు. సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు ప్రతి పల్లె, ప్రతి తండా తిరిగి చెరిగిపోని నాయకత్వాన్ని స్థాపించారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యాక కొన్ని ఆ గ్రామాల్లో ఆ పార్టీకే ఓటేసేవారు, ఆ పార్టీనేనమ్ముకున్న వారు ఇప్పటికి ఉన్నారు. బిజెపి ఆ స్థాయిలో వెళ్లేందుకు, పార్టీని కింది స్థాయిలో నిర్మించేందుకు అందుకు తగ్గట్లు కసరత్తులే చేస్తున్న సందర్భాలు లేవు. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల వరకే ఆ పార్టీ పరిమితమయ్యింది.అక్కడ కూడా బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో విఫలమవుతుంది. పట్టణాలపైననే దృష్టి పెట్టి, గ్రామాలను పట్టించుకోకపోవడం వల్లనే బిజెపి రాణించలేకపోతుందని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఎన్నికల ముగిశాక మళ్లీ సభలు, సమావేశాలు, పార్టీ అభివృద్దిపై సరైన ప్రణాళికలు రూపోందించడంలో విఫలమవుతున్నారు. జాతీయ నాయకత్వం ఎప్పటికి ప్రజల్లో ఉండేలా, ప్రజలను చైతన్యం పరిచే దిశగా అడుగులు వేస్తూ ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా బిజెపికి తెలంగాణపై కమలం జెండా ఎగురేసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాంట్లోనే మళ్లీ అసమ్మతులు.. బిజెపి 28మందితో రెండో జాబితా విడుదల చేయగానే అందులో కూడా అసమ్మతి జ్వాలలు బయటపడ్డాయి. శేరిలింగంపల్లి టిక్కెట్టును యోగానంద్‌కు, నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మినారాయణకు అధిష్టానం కేటాయించింది. ఈ రెండు స్ధానాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు. పార్టీని నమ్ముకుంటూ ఉన్నవారికి అవకాశం కల్పించకుండా మూడు రోజుల క్రితం బిజెపి పార్టీలో చేరిన శేరిలింగంపల్లి అభ్యర్ధికి ఏలా టిక్కెట్టు ఇస్తారని అసమ్మతి నాయకులు ప్రశ్నించారు. మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం యెండల లక్ష్మినారాయణకు కేటాయించడంపైనా నిరసనలు రేగాయి. అభ్యర్థులు లేరని బాధ ఒకవైపు ఉంటే, ఉన్న అభ్యర్థుల్లో అసమ్మతి రేగుతుంటే ఏం చెయ్యాలో అర్థంకాక బిజెపి రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. వేరే పార్టీలో స్థానం దక్కని వారిని చేర్చుకోని కమలం వికసించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు సొంతపార్టీ నేతలకే అన్యాయం జరుగుతుందని నిరసనలు మొదలయ్యాయి. కొత్త క్యాడర్‌ కోసం చూసుకుంటే ఉన్న పాత క్యాడర్‌ పోయేలా ఉందనే ఆందోళన పార్టీలో ప్రారంభమైనట్లు చెపుతున్నారు. అందుకే అచితూచి అడుగేసేలా కమలం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here