బీజేపీి బంద్‌ పాక్షికం….

0

  • విద్యార్థులారా ఆత్మహత్యలొద్దు..
  • సచివాలయం ఎదుట ధర్నా
  • పలువురి నాయకుల అరెస్ట్‌
  • నిమ్స్‌లోనే లక్ష్మణ్‌ దీక్ష

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బీజేపీ ఇచ్చిన బంద్‌ పిలుపుపాక్షింగా సాగింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ఫలితాల ప్రకటనలో వైఫల్యాలపై తెలంగాణ బంద్‌కు బీజేపీి పిలుపునివ్వగా స్పందన మామూలుగా కనిపించింది. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తోంది. పలు జిల్లాల్లో నేతలను ముందుగానే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పలు చోట్ల బస్టాండ్‌ల ఎదుట బీజేపీ కార్యకర్తల ధర్నా జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తన దీక్ష నిమ్స్‌లోనే కొనసాగిస్తున్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బస్‌ డిపోల ఎదుట బీజేపీ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. పలు చోట్ల బీజేపీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. నల్గొండలో బీజేపీ నేతలు నర్సింహారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో బీజేపీి కార్యకర్తలు,నాయకులు ర్యాలీలు తీసారు. సచివాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ భాజపా నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో భారీగా మొహరించిన పోలీసులు భాజపా నేతలను అడ్డుకోవడంతో సచివాలయం గేటు వద్ద నేతలు బైఠాయించారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్‌  బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయం వద్ద బైఠాయించిన భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్‌ రావు, ఎమ్మెల్సీ రామచందర్‌ రావు, చింతల రామచంద్రారెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ, మురళీధర్‌ రావులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన పూర్తి నివేదిక బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.. ముగ్గురు సభ్యులు సంతకాలు పెట్టిన నివేదికను దాచిపెట్టి దొంగ నివేదికను బయటపెట్టారని ఆరోపించారు. 110 పేజీల నివేదిక త్రిసభ్య కమిటీ రూపొందిస్తే.. కేవలం 10 పేజీల నివేదికను మాత్రమే బయట పెట్టడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఎవరిని రక్షించడానికి త్రిసభ్య కమిటీ నివేదికను దాచి పెడుతున్నారన్నారు. లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం లేకపోవడం వల్ల సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గ్లోబరీనా సంస్థకే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ బాధ్యతలు అప్పగించడం దారుణమైన విషయం అన్నారు. విద్యార్థుల చావుకు కారణమైన ఈ వ్యవహారంపై జుడిషియల్‌ ఎంక్వైరీ జరగాలని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాలమాడుతోందని, విద్యార్థుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌, ఐవీఆర్‌ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డి జరమెరిగిన అబద్దాల కోరు అని రుజువైందన్నారు. 796 మంది విద్యార్థుల మేమోల్లో మాత్రమే తప్పులు ఉన్నాయని మంత్రి చెబుతున్నారని.. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ మాత్రం 6,415 మంది విద్యార్థుల మార్కుల షీట్లు సరి చేశామంటోందని.. ఆర్టీఏ సమాచారంతో ఇది బయటపడిందన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ, టీడీపీల అధ్యర్యంలో సంతకాల సేకరణ.. ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై న్యాయ విచారణకు ఆదేశించాలనే డిమాండ్‌తోపాటు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని భరోసా కల్పించేందుకు కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ, టీడీపీల ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ నిర్వహించారు. దీనిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌, ఇందిరాపార్కు, కేబీఆర్‌ పార్కు వద్ద మార్నింగ్‌ వాక్‌కు వచ్చే వారి నుంచి ఈ పార్టీల నేతలు సంతకాలు సేకరించారు. అఖిలపక్షం పిలుపు మేరకు విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఓయూ ఎన్‌సీసీ చౌరస్తా దగ్గర మార్నింగ్‌ వాకర్స్‌తో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సంతకం చేసి మద్దతు తెలిపారు. విద్యార్థులు ఎవరు కూడా చనిపోవద్దని.. బతికుండి సాధించాలని.. ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు తాము పోరాడుతామని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో నేర్చుకోవాల్సింది.. సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ‘మార్కులతోనే జీవితం అంతం కాదు. జీవితంలో ప్రతి ఒక్క రూ ఏదో స్థాయిలో ఫెయిలైన వారే.. ఫెయిల్‌ కాకుం డా విజయానికి తోవ దొరకదు..’అని చెప్పారు.

మేమంతా విూవెంటే.. సంతకం చేసి సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి పక్షాన నిలిచి పోరాడేందుకు తామంతా ఉన్నామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్‌ బోర్డు కారదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ సందర్భంగా ‘వైఫల్యం విజయానికి తొలిమెట్టు.. జీవితానికి అది ముగింపు కాదు.. చావు సమస్యకు పరిష్కారం చూపదు బతికుండి సాధిద్దాం.. మేమంతా విూవెంటే ఉన్నాం’ అని విద్యార్థులకు మద్దతు పలుకుతూ పలువురు సంతకాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here