ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌

0
  • చత్తీస్‌ ఘడ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకీ
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ

ఏపీ రాష్ట్ర నూతన గవర్నర్‌ గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ను నియమించారు. ఆయన్ను గవర్నర్‌ గా నియమిస్తూ మంగళవారం జులై 16వ తేదీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్లకు ఏపీకి కొత్త గవర్నర్‌ ను నియమించారు. సుమిత్రా మహాజన్‌, సుష్మాస్వరాజ్‌, బీజేపీ సీనియర్‌ నేతల పేర్లు పరిగణనలోకి వచ్చినప్పటికీ ఎవరి అంచనాలకు అందనివిధంగా బిశ్వభూషణ్‌ ను నియమించారు. ఒరిస్సాకు చెందిన బిశ్వభూషణ్‌.. ఒడిశా న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనతా దల్‌ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 25 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. రచయితగా అనేక పుస్తకాలు రాశారు. 1988 నుంచి బీజేపీలో క్రియాశీలంగా ఉన్నారు. సంఘ్‌ పరివార్‌ తో బిశ్వభూషణ్‌ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇప్పటివరకూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ గా నరసింహన్‌ పని చేశారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌ గా సుదీర్ఘంగా కొనసాగిన వ్యక్తిగా నరసింహన్‌ ఉన్నారు. విభజిత ఏపీలో రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి పూర్తిగా కొత్త గవర్నర్‌ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు పరిపాలన కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఏపీకి పూర్తిస్థాయిలో గవర్నర్‌ కావాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది. అలాగే చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర గవర్నర్‌ గా సుశ్రి అనుసూయను నియమించారు. ఇప్పటికే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ల రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యా సాగర్‌ పదవి కాలం ఈ నెల ఆఖరి నాటికి ముగియనుంది. పలు రాష్ట్రాల గవర్నర్ల పదవి కాలం ముగుస్తుండడంతో ఒక్కోరాష్ట్రానికి చెందిన గవర్నర్లను రాష్ట్రపతి కార్యాలయం కేంద్రంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. రానున్న రోజుల్లో ఎనిమిది రాష్ట్రాల గవర్నర్ల నియామకం జరుగనుంది.

చత్తీస్‌ ఘడ్‌ గవర్నర్‌ గా అనసూయ ఊకీ

చత్తీస్‌ ఘడ్‌ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ మహిళా నేత అనసూయ ఊకిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనసూయ ఊకీ ప్రస్తుతం నేషనల్‌ ఎస్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ గా కొనసాగుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీలో కీలక నేతగా అనసూయ ఊకీ వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here