Featuredరాజకీయ వార్తలు

భట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

(పల్లా కొండలరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

మల్లు భట్టివిక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంతగా పరిచయం అక్కర్లేని పేరు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్ని కై హ్యాట్రిక్‌ సాధించారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ సర్వేలలో సైతం భట్టికి ప్లస్‌ మార్కులుండగా తాజాగా ఆయన గెలిచిన తీరు పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధిరలో టి.డి.పి అండ, సీపీఎం నుండి క్రాస్‌ ఓటింగ్‌, ఆర్థిక బలం, అంగబలం వున్నా సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమలరాజుపై కేవలం 3681 ఓట్ల మెజారిటీతో గెలుపొం దారు. తాజా పరిస్థితులలో ఆయన 25 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలవాల్సి వుండగా చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా స్వల్పమెజారిటీతో బయటపడ్డ తీరుని నియోజక వర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. సాంకేతికంగా ఆయన గెలిచినప్పటికీ మధిర నియోజకవర్గంపై ఆయన పట్టు కోల్పోతున్నారనిపిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలోనే గాక జిల్లాలోని కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక, కూటమితో పొత్తు విషయంలో తమను తప్పుదోవ పట్టించడం ద్వారా కాంగ్రెస్‌కు నష్టం కలిగించారని అధిష్టానం భట్టి విక్రమార్కపై గుర్రుగా వున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో గతంలో ఇచ్చినంతగా ఆయనకు ప్రాధాన్యతనీయకపోతే టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అవుతారనే ప్రచారం ఖమ్మం జిల్లాలో నడుస్తోంది. తన స్వార్థం కోసం తప్ప పార్టీ ప్రయోజనాల కోసం విశాలంగా ఆలోచించడంలేదనీ, కార్యకర్తలతో, ప్రజలతో కొన్ని సందర్భాలలో ఆయన వ్యవహారశైలిలో సైతం మార్పు రావలసిన అవసరాన్ని తాజాఫలితం ధృవీకరిస్తోంది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ పగ్గాలు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తే మధిరలో కాంగ్రెస్‌ హవా కొనసాగడం ప్రశ్నార్థక మేనన్నది పరిశీలకుల అంచనా. ఎంపీ పొంగులేటి శ్రీనివా సరెడ్డి రూపంలో తనకు పొంచి వున్న ప్రమాదాన్ని మల్లు భట్టి విక్రమార్క ఏ విధంగా ఎదుర్కుంటారు? అతి త్వరలో జరగనున్న గ్రామపంచాయితీ ఎన్నికలలో భట్టి విక్రమార్క అనుసరించబోయే వ్యూహం ఏమిటన్నది మధిర నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది.

ఈ ఎన్నికలలో రాష్ట్ర రాజకీయాలలో భట్టి విక్రమార్క కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తే భట్టినే కాంగ్రెస్‌ సీఎంగా ప్రచారం జరిగింది. ఏ.పీలో చంద్రబాబునాయుడిని స్వయంగా కలిసి టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తుని పొడిపించడంలో భట్టిదే కీలకపాత్ర. పార్టీలో టిక్కెట్లు ఇప్పించడంలోనూ భట్టి మాటే చెల్లుబాటైందంటారు. తెలుగుదేశం అధినేత ద్వారా కూటమికి ఆర్థికంగా కూటమికి నిధులు సమకూర్చడంలోనూ సక్సెస్‌ అయ్యారు. ఇంతా చేసినా భట్టిగానీ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి టీంగానీ క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనిలో, వ్యూహాలు రచించడంలో, సమీక్షించడంలో టీ.ఆర్‌.ఎస్‌ టీమ్‌ ముందు ఘోరంగా విఫలమయ్యారు. తమపార్టీలోనే గెలిచే స్థానాలలో మంచి అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ, కూటమితో సీట్ల సర్దుబాటు విషయంలోనూ వీరి వ్యవహారశైలి సక్రమంగా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు విషయాలలో తమను తప్పుదోవ పట్టించారనీ, దేశశ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో తెలంగాణలో ఘోరంగా వైఫల్యం చెందడానికి కారణమైన కాంగ్రెస్‌ నేతలలో భట్టికూడా ఒకరని అధిష్టానం గుర్రుగా ఉందని సమాచారం. ఈ మేరకు భట్టిపై చర్యలున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. భట్టి విషయంలో కాంగ్రెస్‌ నిర్ణయం ఏమిటన్నది తేలాల్సి వుంది. ఖమ్మం స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలిపితే తేలికగా గెలవడం ద్వారా జిల్లాలో పదికి పది స్థానాలు కూటమి కైవసం చేసుకున్నట్లయ్యేది. టీడీపితో పొత్తు పొడిపించడం కోసం, మధిరలో తన గెలుపు కోసం తేలికగా గెలిచే ఖమ్మం స్థానాన్ని టీడీపికి దక్కేలా చేశారని ఆ పార్టీనుండే విమర్శలు వినిపిస్తున్నాయి. వైరా స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌పై వున్న వ్యతిరేఖతలో రాములు నాయక్‌ను కాంగ్రెస్‌ నుండి పోటీకి దింపితే తేలికిగా గెలవగలిగి వున్నా ‘వైరా’ ను కాంగ్రెస్‌కు కేటాయించుకోలేకపోయారన్న కోపమూ కార్యకర్తలలో వుంది. తీరా అక్కడ కూటమి నుండి సీపీఐ ఓడిపోయి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి గెలవడం, ఎంపీ పొంగులేటి నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరడమూ జరిగింది. జిల్లాలో కాంగ్రెస్‌లో ఓ వర్గంవారికి ప్రాధాన్యత దక్కకుండా చేయడం వెనుక భట్టి పాత్రపై కూడా ఆ వర్గం మండిపడుతోంది.

జిల్లాలో పదింటికి 9 స్థానాలలో కూటమికే ఆధిక్యం

వున్న తరుణంలో వైరాలో గెలిచిన కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్ధిని టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళకుండా నిరోధించలేకపోయారు. దీనికి కారణం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నాడంటూ భట్టి ప్రచారం చేయించడమేనన్న ఆరోపణలు వివసడుతున్నాయి. శ్రీనివాసరెడ్డి మధిరలో పల్లె నిద్రలు చేసి మరీ భట్టిని ఓడించేందుకు తీవ్రంగా శ్రమించారు. భట్టికి ముచ్చెమటలు పట్టించారు. మూడో స్థానంలో ఉంటాడనుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భట్టిని భయపెట్టే స్థితికి చేరుకోవడం వెనుక ఎంపీ పొంగులేటి కృషి వుంది. అంతగా బలంలేని టీఆర్‌ఎస్‌ ఆ స్థాయికి తీసుకురావడంతో భవిష్యత్తులో పొంగులేటిని ఎదుర్కోవడం భట్టి వల్ల కాదనే విమర్శ వినిపిస్తోంది. రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 92.17శాతం పోలింగ్‌ జరగడానికి కారణం ఎంపీ పొంగులేటి పట్టుదలనే చెప్పాలి. దీనికి తోడు ఇక్కడ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుండి పోలింగ్‌ ముగిసేదాకా కూడా డబ్బు పంపిణీ జరగడమూ కారణమే. డిసెంబర్‌ ఐదో తేదీ దాకా భట్టికీ, బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థి కోటా రాంబాబుకీ మధ్య పోటీ వుంటుందని భావించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా వుండడం, బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థి అదే సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఇక్కడ బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థి గెలవబోతున్నాడంటూ లగడపాటి రాజగోపాల్‌ సర్వేలో సైతం చెప్పడం జరిగింది. విశ్లేషకులు సైతం భట్టికి, సీపీఎంకు మధ్యనే టఫ్‌ ఫైట్‌ వుంటుందని భావించిన తరుణంలో రెండు రోజుల ముందు ఒక్కసారిగా వాతావరణం మారింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలువబోతున్నాడంటూ ప్రచారం సాగడంతో భట్టి కంగుతిన్నారు. తానుకూడా టీఆర్‌ఎస్‌కు పోటీగా డబ్బు పంపిణీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పరిస్థితి వివరించడంతో ప్రక్కనే వున్న ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ నియోజకవర్గం నుండి వచ్చి అక్కడి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులు పోలింగ్‌ రోజు సైతం డబ్బును విచ్చలవిడిగా పంచారు. పోలింగ్‌ జరుగుతుండగా కూడా వీరు డబ్బును వెదజల్లినట్లు సమాచారం. పోలింగ్‌ 2 గంటలలో ముగుస్తుందనగా ఓటువేయనివారిని పిలిపించి వారు అడిగినంత ఒక్కొక్కరికి ఓటుకు రెండు నుండి ఐదువేల వరకూ ఇచ్చి భట్టికి ఓటు వేయాలని ప్రాధేయపడవలసి వచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక చర్యలవలనే మధిరలో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ పోలింగ్‌ నమోదైంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ గెలుపువార్తను జీర్ణించుకోలేని సీపీఎం శ్రేణులు బిఎల్‌ఎఫ్‌ కి కాకుండా భట్టికి క్రాస్‌ ఓటింగ్‌ చేయించారు. ఇక్కడ సీపీఎం స్థానిక నాయకులను సైతం పెద్ద ఎత్తున డబ్బుతో కొనుగోలు చేయడంలో ఏ.పీ టీడీపి నేతలు కీలకపాత్ర వహించారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను సీపీఎం నాయకులు కొట్టిపారేస్తున్నా గెలుస్తాడనుకున్న బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మూడవ స్థానానికి దిగజారడం, ఆయనకు కేవలం 22896 ఓట్లు మాత్రమే రావడానికి కారణాలేమిటో తేల్చాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని సీపీఎం నేతలపై వుంది. స్యయంగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిని సైతం భట్టి విక్రమార్క కొనేసాడని ఆరోపణలు వచ్చాయి. స్థానిక టీడీపి పొత్తు, ఏపీ సీఎం ఆర్థిక సహకారం, సీపీఎం క్రాస్‌ ఓటింగ్‌ జరిపినా భట్టి విక్రమార్క స్వల్ప మెజారిటీలో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా బయటపడడాన్ని బట్టి చూస్తే గతచరిత్ర దృష్ట్యా ఇక్కడ భట్టి గెలిచినా ఓడినట్లేనన్నది విశ్లేషకుల వ్యాఖ్య. మధిరలో మొదట్నుండీ తాము గెలవలేమని సీఎం సైతం భావించడం టీఆర్‌ఎస్‌ తప్పిదంగా చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పొంగులేటి కృషికి ఇంత ఆదరణ వుంటుందని ముందే ఊహించగలిగినట్లైతే లింగాల కమల్‌రాజుకి బదులు కోటా రాంబాబునే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక చేసి, గెలిపించే బాధ్యత పొంగులేటికి అప్పజెపితే మధిరలో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిచి వుండేదని ఫలితాలు ఋజువు చేస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఎంపీ పొంగులేటికే ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగిస్తే ఆయనను ఢీకొట్టడం సాధ్యం కాదుకనుక ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి సైతం కాంగ్రెస్‌లో తనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లేదా ప్రతిపక్షనేతని చేయడం వంటి కీలక బాధ్యతలు అప్పగించకుంటే టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం వుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ను వీడడం అంత తేలికగా జరిగేది కాదనే చెప్పాలి. భట్టికి కాంగ్రెస్‌లో వున్న ప్రాముఖ్యత అటువంటిది. మధిరలో మొత్తం 2 లక్షల 2 వేల ఓట్లు వుండగా 92.17% అంటే 1,86,186 ఓట్లు పోలయ్యాయి. మల్లు భట్టి విక్రమార్కకు 80,346, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమల్‌రాజుకు 76,665, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి కోటా రాంబాబుకు 22,816, ఇతరులకు 6,281 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలు రానున్న గ్రామపంచాయితీ ఎన్నికలలో అధికార, విపక్షాల మధ్య జరిగే హోరాహోరీ పోరును తెలియజేస్తున్నాయి. ఎంపీ పొంగులేటి వ్యూహాలకు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఎలాంటి ప్రతివ్యూహాలు పన్నుతారోనన్నది కీలకంగా మారింది. గతానికి భిన్నంగా భట్టి గ్రామగ్రామాన కార్యకర్తలతో మమేకం కావలసి వున్నది. ఆయన వ్యవహారతీరులోనూ మార్పు రావలసి ఉందని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. భట్టి భవిష్యత్తు ఏమిటన్నది నిర్ణయించేది ఏమిటన్నవాటిలో ఆయన వ్యవహారశైలి సైతం ఒక కీలకమైన అంశంగా భట్టి గుర్తించాల్సి ఉంది. ఈమేరకు భట్టి తనకు తాను మారతాడా? లేక అసలు పార్టీయే మారతాడా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close