Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

భాగ్యనగరంపైనే అందరి కన్ను..

ఆదాయానికి కొదవలేని రాజధాని..

బయటికి తెలియని వ్యాపారెలెన్నో..

భారీగా బహుళా అంతస్థుల భవనాలు..

పాగా వేసేందుకు ఎవరి వ్యూహాలు వారివే..

కేంద్రపాలిత ప్రాంతంగా మారవచ్చన్న విశ్లేషకులు..

ఇక్కడ లేని దందా లేదు.. జరగని వ్యాపారం లేదు.. బయటికి రాకుండా జరిగే చీకటి మాఫియాకు కొదువ లేదు.. ఎవరైనా, ఎక్కడినుంచైనా రావచ్చు.. ఎవరికి నచ్చినా వ్యాపారం వేరు చేసుకుంటూ ఆనందంగా బతకొచ్చు.. పనిచేసి బతుకుదామనుకునే వారికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఇక్కడ కొదువేలేదు.. సాఫ్ట్‌వేర్‌కు నిలయంగా, రోజురోజుకు అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా ఎవరికి అందనంత ఎత్తులో ఎదిగిపోతున్న హైదరాబాద్‌ మహానగరంపై ఇప్పుడు అందరి కన్నుపడింది. తెలంగాణ నాయత్వమే కాకుండా పక్కరాష్ట్రాల నాయకులు కూడా భాగ్యనగరం అంటే అమితమైనా ప్రేమ కురిపిస్తున్నారు. ఇక్కడ అన్ని ప్రాంతాల నాయకులకు బయటికి తెలియని వ్యాపార దందాలు నడుస్తూ ఉంటాయి. అవకాశం ఎదురుచూస్తున్న వారందరికి బిజెపి చెక్‌ పెట్టే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కన్ను ఇప్పుడు భాగ్యనగరం మీద పడింది. చాపకింద నీరులా తెలంగాణలో పార్టీని విస్తరింపచేసి అధికారాన్ని దక్కించుకోవాలని అతి వేగంగా వ్యూహాలు పన్నుతోంది. అధికారం దక్కని యెడల దేశానికి రెండో రాజధానిగా చేసి హైదరాబాద్‌ను తన చేతిలోకి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హౖెెదరాబాద్‌పై ఆశ పడుతున్నా వారికి అవకాశం దక్కకుండా చాపకింద నీరులా పావులు కదుపుతున్నా వారందరికి అడ్డుకట్ట వేసేలా మరో ప్రయత్నం కూడా జరగవచ్చని ప్రచారం ఉంది.. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న మహానగరం హైదరాబాదేనని విషయం అందరికి తెలిసిన విషయమే. తెలంగాణలో కాషాయం పార్టీకి అనువైనా వాతావరణాన్ని కల్పించకుండా కెసిఆర్‌ అడ్డు తగులుతే మాత్రం బిజెపి ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేసి తమ ఆధీనంలో తెచ్చుకోవడమే తప్ప మరో మార్గం లేదనే ఆలోచనతో ఉన్నట్లు ఊహగానాలు వినపడుతున్నాయి.. కాని అది ఎంతవరకు నిజమో, అది తెలంగాణలో సాధ్యమవుతుందో లేదో అనేది వేచిచూడాల్సిందే..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

హైదరాబాద్‌ అందరికి కావాలి.. రోజురోజుకు ఆధునిక హంగులతో రూపు దిద్దుకుంటున్న భాగ్యనగరంపై అందరి కండ్లు పడుతున్నాయి. డిల్లీలో కేంద్రం నుంచే కాకుండా పక్క తెలుగు రాష్ట్రం నాయకులు కూడా హైదరాబాద్‌ను వదులు కోవాలంటే ఎవరికి మనసొప్పడం లేదు. అందుకే హైదరాబాద్‌ అంటే అందరికి ఏనలేని మక్కువ ఏర్పడింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆగ్రనాయకులే కాకుండా పక్కనున్న తెలుగు రాష్ట్రంలోని నాయకగణం హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. వాటన్నింటిని వదులుకోవడం ఎవ్వరికి అంత ఈజీ కాదనే విషయం అందరికి తెలిసిందే.. అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్కదానికే స్వంతం కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు పావులు కదుపుతూనే ఉన్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న కంపెనీలు, పలు పరిశ్రమలతో దినదినంగా హైదరాబాద్‌ అభివృద్ది చెందుతూనే ఉంది.

భాగ్యనగరంలో బహుళా అంతస్థుల భవనాలు..

ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఒకటైనా అమెజాన్‌ సంస్థకు చెందిన భారీ భవనం ఒకటి హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇంచుమించుగా 9.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం హైదరాబాద్‌ నగరానికే ఒక మణిహారంగా అభివర్ణిస్తారు. ఇలాంటి ఎన్నో భవనాలు, పరిశ్రమలకు ఇప్పుడు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం కానుంది. హైదరాబాద్‌లో భారీ భవనం మరోకటి రాబోతుందని చెపుతున్నారు. చైనాకు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ భారీ ప్రాజెక్టుకు తెర తీసినట్లుగా చెపుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో పది అంతస్థులు, ఇరవై అంతస్థులంటేనే అమ్మో అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు నలభై అంతస్థుల వరకు భవనాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఒక భారీ ఆకాశ హర్మ్యానికి అనుమతి ఇవ్వాలంటూ హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది. 4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తులో 66 బహుళ అంతస్థుల భవన నిర్మాణ అనుమతి కోసం ఒక ప్రైవేట్‌ నిర్మాణ సంస్థ ప్రణాళికను సిద్దం చేసింది. సుమారు పద్దెనిమిది వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు ఈ భవన ప్రాజెక్టు ఉంటుందని చెపుతున్నారు. ఈ భారీ టవర్‌లో షాపింగ్‌మాల్స్‌, స్టార్‌ హోటళ్లతో పాటు పెద్ద ఎత్తున కార్యాలయాల్ని ఏర్పాటు చేయనున్నారని చెపుతున్నారు. రోజురోజుకు హైదరాబాద్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఎదిగిపోతుంది. అందుకే దీనిపై అందరి కన్ను పడిందనే తెలుస్తోంది.

దేశ రెండవ రాజధాని అవుతుందా…

తెలంగాణలో అధికారం రాని యెడల బిజెపి కేంద్రంలో అధికారాన్ని ఉపయోగించుకుంటూ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయవచ్చనే మాటలు వినపడుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం కూడా ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు వేయాలని లేదంటే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో కూడా ఉంది.. ప్రజలు దానికి ఒప్పుకొని యెడల దేశ రెండో రాజధానిని చేసి అప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఇతర పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. అప్పుడు హైదరాబాద్‌పై కేంద్రం ఆజమాయిషీ ఎక్కువ ఉంటుందని అప్పుడు రాష్ట్రంలో బిజెపి పాగా వేయడం చాలా ఈజీగా చెపుతున్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి కొన్ని కీలక నిర్ణయాలు అమలు కానున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవల కశ్మీర్‌ విభజన తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రధాన కన్ను దక్షిణాదిపై పడిందని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయబోతుందని ప్రచారం జరుగుతుండగా బిజెపి హోంశాఖ సహాయమంత్రి సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి మాత్రం రెండో రాజధాని వార్తల్లో ఏలాంటి వాస్తవం లేదన్నారు. తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ రకరకాల వ్యూహాలను అనుసరిస్తూ ముందుకుపోతూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా టిఆర్‌ఎస్‌ పార్టీపై విరుచుకుపడుతూ తమ బలం పెంచుకునేందుకు సిద్దమవుతున్నారు. బిజెపి ఆగ్రనేత అమిత్‌షా ఒక్కసారి దృష్టిసారిస్తే సామ ధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తూ పాగా వేస్తూ పట్టు సాధిస్తారనే ప్రచారం ఉంది. ఇప్పుడు అమిత్‌షా కన్ను ప్రత్యేకంగా తెలంగాణపై పడింది. తెలంగాణలో అధికారంలోకి రావాలి, హైదరాబాద్‌ గడ్డమీద బిజెపి జెండా రెపరెపలాడాలన్నదే వారి ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణకు వచ్చిన సీట్లు బిజెపి ఆగ్రనేతలను కూడా ఆశ్చర్యపోయారు. తమ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందనే భావనకు కాషాయం నేతలు వచ్చారు. అందుకే వివిధ ఎత్తుగడలతో ముందుకు సాగుతూ ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నుంచి అనేక మంది నేతలను కాషాయం కండువా కప్పుతున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేక ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. వాటితో పాటు హిందుత్వ అజెండాను అమలు చేయడానికి అవకాశం ఉంది. ఇన్ని అస్త్రాలు ప్రయోగించినా అధికారం చేతిలోకి రాకపోతే రెండవ రాజధాని లేదా కేంద్ర పాలిత ప్రాంతంవైపుగా ఆలోచించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close