ఆరోగ్యం

వేపాకులతో కలిగే అద్భుత లాభాలివే తెలుసా..

వేప ఆకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక రకాల రోగాలను నయం చేసేందుకు వేప ఆకులను విరివిగా వాడుతారు. సుమారుగా 4,500 సంవత్సరాల కిందటే వేపాకులను వైద్య చికిత్సలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. వేపాకులు మన శరీరంలో అధికంగా ఉన్న వాతాన్ని తొలగిస్తాయి. రక్తాన్ని శుభ్రపరుస్తాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే శక్తి వేపాకులకు ఉంది. వేప ఆకుల వల్ల మనకు ఇంకా ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు వేప ఆకులో పుష్కలంగా ఉన్నాయి. కొన్ని వేపాకులను టీ లో వేసి మరిగించి ఆ టీని తాగితే దాంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేపాకులో ఉన్న యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. విష జ్వరాలను తరిమి కొడతాయి. శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియాలు నశిస్తాయి.

2. కొన్ని వేపాకులను తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసి వాటిని ఆరబెట్టాలి. అనంతరం వాటిని నీడలో ఎండబెట్టాలి. బాగా ఎండాక వాటిని పొడి చేయాలి. ఆ పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.

3. వేప ఆకులను ఎండ బెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

4. వేప ఆకులను నమిలినా, లేదా పొడి రూపంలో తీసుకున్నా జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, మలబద్దకం ఉండవు. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే అల్సర్లు కూడా తగ్గుముఖం పడతాయి.

5. వేప ఆకులు కొన్నింటిని తీసుకుని బాగా నూరి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తే తక్షణమే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. వేప ఆకులను కొన్నింటిని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా రోజూ చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల సమస్యలుండవు.

7. వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాక వచ్చే నీటిని చల్లార్చి ఆ నీటితో కళ్లను కడుక్కుంటే కంటి దురదలు తగ్గుతాయి. కళ్ల కలక వచ్చిన వారు ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కళ్లలో మంట ఉన్నవారు కూడా ఈ చిట్కా ప్రయత్నించవచ్చు.

8. వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాక వచ్చే నీటిని స్నానం చేసే నీటిలో కలిపి అనంతరం ఆ నీటితో స్నానం చేస్తే చర్మం సంరక్షింపబడుతుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

9. వేప ఆకులను నూరి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాయాలి. అనంతరం కొంత సేపు ఆగాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే ఆ పేస్ట్‌ను గాయాలు, దెబ్బలు, పుండ్లపై రాస్తే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి.

10. వేప ఆకులను నూరి తయారు చేసే పేస్ట్‌ను జుట్టుకు రాయాలి. కొంత సేపు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు, దురద సమస్యలు ఉండవు, శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. వేపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు, హెయిర్‌ఫాల్ సమస్యలు లేకుండా చేస్తాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close