బీకేర్‌ఫుల్‌.. బీఫారాలు

0

– చేతికి ఇవ్వని కాంగ్రెస్‌

– ఈసీకే నేరుగా ఇచ్చే అవకాశం

– కొందరికి గుచ్చుకోనున్న గులా’బీ ఫారాలు’

– 17 మంది గెలుపు డౌట్‌

– అందులో 6గురు ‘అవుట్‌’..?

(రమ్యా చౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాలు ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో ఇక బి ఫారాల అంద చేసే కార్యక్రమాలకు తెర లేవనున్నది.

ముందున్న కారు:

అక్టోబర్‌ 6న అసెంబ్లీ రద్ధు ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్‌ 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఎన్నికల శంఖారావం పూరించారు. అనంతరం రెండో జాబితాను ప్రకటించారు. మరో డజను స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.

కేసీఆర్‌ సిక్సర్‌:

గులాబీ నేతకు కలసొచ్చే 6, ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులలో గుబులు పుట్టిస్తోంది. తాజా సర్వే ప్రకారం తెరాసలో 17మంది అభ్యర్థులకు పరాజయం పొంచిఉంది. దీంతో కు సమీకరణాలు, ఇతరత్రా లాబీల కారణంగా ఈ 17మందిలో ఓ 6గురు అభ్యర్థులను మార్చాలని గులాబీ నేత భావిస్తున్నారు. ఈ ఆరుగురు ఎవరనేది మాత్రం వెల్లడికాలేదు. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులకు ఈనెల 11న బి ఫారాలు అందించనున్నారు.

అంబర్‌ పేట స్థానం మహిళకు:

భాజపా నేత కిషన్‌ రెడ్డి పై పోటీగా హైకోర్టు న్యాయవాది, బిసి వర్గానికి చెందిన శారదగౌడ్‌ పేరు పరిశీలనలో ఉంది. స్థానికంగా ఆమెకు మంచి సబంధాలు ఉండటంతో పాటు బిసి మహిళకు సీటు కేటాయిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుందని గులాబీదళం ఆలోచన చేస్తుంది.

‘చే’తికివ్వరు:

కాంగ్రెస్‌ పార్టీ ఈసారి బి ఫారాలను అభ్యర్థుల చేతికి ఇవ్వకుండా మరో వ్యూహం అమలుచేస్తోంది. అభ్యర్థుల పేర్లు ఢిల్లీ వార్‌ రూంలో ఖరారు కానున్నాయి. అయితే 45-55 స్థానాలు ముందు ప్రకటించే వీలుంది. అయితే మరో 20 స్థానాల అభ్యర్థుల జాబితాను కూడా జోడించాలని ప్రయత్నం జరుగుతోంది. 20 స్థానాల విషయంలో ఆదివారం అర్థరాత్రి వరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈసారి బీ ఫారాలను నేరుగా అభ్యర్థుల చేతికి ఇవ్వకుండా.. తమకు నమ్మకస్థుల ద్వారా సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందించే అవకాశం ఉంది. గతంలో బి ఫారాలు తీసుకొని ఇతర పార్టీలకు తరలిపోయిన సంఘటనలు జరిగాయి. దీని కారణంగా ఇప్పుడు అభ్యర్థి నామినేషన్‌ వేసిన తరువాత బి ఫారాలు సమర్పించడానికి చట్టంలో వీలుంది. ఈ అవకాశాన్ని ఈసారి ఏఐసీసీ వర్గాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఢిల్లీలో పడిగాపులు:

ఆశావహులు అందరూ ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి దీపావళి కూడా అక్కడే ఉండి జరుపుకున్నారు. ఏ క్షణానికి ఏం జరుగుతుందని ఏఐసీసీ ఆఫీసుల వద్ద వాకబు చేయడం కనిపించింది. ఒకవైపు చలి అధికంగా ఉండటమే కాకుండా ఏఐసీసీ ఆఫీసు పరిసరాలలో పచ్చదనం ఎక్కువ. దీని కారణంగా అక్కడ చలి విపరీతంగా ఉంది. ఆశావహులు మాత్రం అంత చలిలోనూ తమకే టికట్‌ వస్తుందని ఆశగా అక్కడే రేయింబవళ్లు కాపలాకాస్తున్నారు. ఇదిలా ఉండగా అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న కాంగ్రెస్‌ లో తమకు సీటు రాకున్నా పర్వాలేదు కాని తన పార్టీలోని ఫలానా వారికి ఇవ్వరాదనే మెయిళ్ళు ఏఐసీసీ అధికారిక సైట్‌ కు అధికంగా వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here