బ్యాంక్‌ పంచాయతీ

0

(పరమాత్మ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో రాజకీయ హడావిడి పెరుగుతుంది. ఓ పక్క పోటీలో నిలవాలనుకుంటున్న ఆశావహులు తమకు అనుకూలంగా పావులు కదుపుతుంటే మరోపక్క ఎన్నికల ప్రక్రియను సజావుగా జరపడానికి అధికారులు సైతం సమాయత్తమవుతున్నారు. తొలి విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్లు స్వీకరణకు గుర్తించిన కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తీసుకరావడంతో అనేక కొత్త, కఠిన నియమాలు అమల్లోకి రానున్నాయి. పంచాయతీ సర్పంచితో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేసే ప్రతి అభ్యర్థి కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలోని ప్రతి నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ ఒక్క నియమాన్ని ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా ఎన్నికల కమిషన్‌ అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, అర్హతలు, అనర్హతలపై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కథనం.

ఖాతాల నుంచే ఎన్నికల ఖర్చులు

నూతన చట్టం ప్రకారం సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేసే ప్రతి అభ్యర్థి విధిగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి సదరు ఖాతాలో డబ్బులు జమ చేసి వాటి నుంచి మాత్రమే ఖర్చులకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కొత్తగా అమల్లోకి రావడంతో అభ్యర్థులకు, నాయకులకు అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం చేసిన అధికారులు బ్యాంకుల అధికారులను సైతం అప్రమత్తం చేశారు. పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు సహకరించి ఖాతాలను వెంటనే ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడానికి ముందుగానే బ్యాంకు ఖాతాను తెరిచి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను నామపత్రాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు పంచాయతీలకు ఎటువంటి పన్ను బకాయిలు ఉండరాదు. నామినేషన్‌ వేయడానికి ముందుగానే వాటిని పూర్తిగా చెల్లించి అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.

పోటీ చేసే అభ్యర్థులకు ఇవీ ముఖ్యం

I పంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అదే గ్రామానికి చెందినవారై ఉండాలి. వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు స్థానిక వార్డుకు చెందినవారు కాకపోయిన పోటీ చేయొచ్చు. కానీ పోటీ చేస్తున్న వార్డుకు సంబంధించిన ఓటరు మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్‌ పత్రాల్లో పోటీదారుడు, ప్రతిపాదకుడి ఓటరు క్రమసంఖ్యను విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

I రిజర్వేషన్‌ ఉన్న స్థానాల్లో పోటీ చేస్తున్న సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు విధిగా తమ కుల ధ్రువీకరణ పత్రాలు నమోదు చేయాలి. ఒకవేళ జనరల్‌ స్థానాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేనప్పటికి ఈ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను పొందుపరిచి ధరావత్తు రాయితీని పొందొచ్చు.

I సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీలకు ఎటువంటి పన్నులు బకాయి ఉండరాదు.

I సర్పంచి, వార్డు సభ్యుడి స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల పత్రాల పరిశీలన నాటికి తప్పకుండా 21 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

I నామినేషన్‌ పత్రాల్లో రాసిన పేరును పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా గుర్తులు కేటాయిస్తారు.

I నామినేషన్‌ పత్రాల దాఖలు పూర్తయిన తరువాత బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం పొందుపరిచి అభ్యర్థుల జాబితాను వరుస క్రమంలో రూపొందిస్తారు.

పోటీకి వీరు అనర్హులు..

I పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానికుడై ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేకపోతే పోటీకి అనర్హులు.

I కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగేవారు.

I అంగన్వాడీ కార్యకర్తలు.

I నీటి వినియోగదారుల సంఘం సభ్యులు.

I హిందూ మతచట్టం, దేవాదాయశాఖలోని సెక్షన్‌-15 ప్రకారం ఏర్పాటైన సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్నవారు.

పోటీకి వీరు అర్హులు..

I సింగరేణి, తెలంగాణ ఆర్టీసీ సంస్థల్లో కార్యదర్శి, మేనేజింగ్‌ ఏజెంటు, మేనేజరు తదితర ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేసేవారు మినహా మిగితా వారు పోటీ చేయవచ్చు.

I క్రిమినల్‌ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తే వారు పోటీకి అనర్హులు. ఒకవేళ సదరు తీర్పుపై కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు లభిస్తే పోటీ చేయొచ్చు.

I చౌకధరల దుకాణాల నిర్వాహకులు(రేషన్డీలర్లు) పోటీకి అర్హులే.

I సహకార సంఘాల సభ్యులు కూడా.

I కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి నామపత్రాలు దాఖలు చేసే నాటికి రాజీనామా ఆమోదం పొందితే పోటీకి అర్హులు.

నామినేషన్‌ రుసుము

I పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పోటీలో నిలిచే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ధరావత్తు చెల్లింపుల్లో రాయితీలను కల్పిస్తారు.

I సర్పంచి పదవికి: జనరల్‌ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాలి.

I ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మాత్రం రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

I వార్డు స్థానానికి: జనరల్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

I ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మాత్రం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here