17న బంద్‌ ఎవరికోసం?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ పార్టీలో సమర్థవంతమైన బీసీ నాయకులు ఉన్నప్పటికీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సీట్లు ఇవ్వకుండా అణచి వేతకు గురిచేస్తున్నారని విమర్శించడం ఆర్‌. కృష్ణయ్యకు తగదు. అలాంటి నాయకుడు బందుకు పిలుపు ఇవ్వటం విచారకరం. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ లో ఉన్న బిసి చెంచా నాయకులు వ్యక్తిగత లబ్ధికి ఆరాటపడుతూ టికెట్ల రేసులో ఉండి టికెట్లు రాకపోతే విమర్శలు కురిపించడం, బీసీ వాదాన్ని చెంచాలకు రుద్దడం ఎంతవరకు సరైనది? అగ్రకుల దోపిడీ పార్టీలలో 70 సంవత్సరాల నుండి పవర్‌ లేని ఎమ్మెల్యే, మంత్రులుగా ఉన్న వీరు బీసీలకు ఒరగ బెట్టింది ఏమీ లేదు!. బీసీలు తరతరాలుగా ఆకలి, అవమానం, అమాయకత్వం, దోపిడీ, పీడన, ఆత్మగౌరవాన్ని, తాకట్టుపెట్టి చెంచాలుగా ఉండాలనుకునేవారు మాత్రమే దోపిడీ పార్టీలను టికెట్లు అడుగుతారు. పిడికెడు కులాల పార్టీలను 56 శాతం ఉన్న బీసీలు పవర్‌ లేని ఎమ్మెల్యే సీట్లు అడుగడం దేనికి సంకేతం? బీసీలు ముఖ్యమంత్రి పదవులకు అనర్హులు అని పరోక్షంగా చెప్పడమే!

అయ్యా..! మీకు బానిసలుగా తొత్తులుగా ఉంటామని, మాకు పవర్‌ లేని ఎమ్మెల్యే మంత్రి పదవులు ఇస్తే మా కులాలకు గొర్లు, బర్లు, చేపలు ఇప్పించు కుంటామని దేబరించడం ఎంత వరకు సమంజసం? వందకు పైగా పైగా కూటికి లేని బీసీ కులాలు ఏమైనా పర్వాలేదు అనుకునే వీరి వల్ల బీసీలకు ఏమి న్యాయం జరుగుతుంది? మూడు నాలుగు సంపన్న బీసీ కులాలకు పవర్‌ లేని ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు పడేస్తే గమ్మున ఉంటారు. బడ్జెట్లో అధిక కేటాయింపులు, నామినేటెడ్‌ పదవులు, సబ్‌ కాంట్రాక్ట్‌లు, పార్టీ పదవులు తమ వారికే ఇచ్చుకున్నా ఈ నాయకులు కిక్కురు మనరు. కూటికిలేని బిసి కులాలు వందకు పైగా ఉన్నా జనాభాలో వారు 35 శాతం ఉన్నా కనపడదా ! 112 కులాల ఆకలి పోరాటం ఆత్మగౌరవం వెనుకబాటు ఎండగట్టి అగ్రకులాల పార్టీల గెలుపునకు సహకరించే ఓట్లు వేయించే ఏజెంట్లుగా ఉంటూ బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చటం ఎంతవరకు సరైనది?. శాసన నిర్మాణంలో బడ్జెట్‌ కేటాయింపులో స్థానం లేకుండా ఈ నిరుపేదల వెనుకబాటు రూపుమాపటం సాధ్యమయ్యే పనేనా!. 112 బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే రాజ్యాధికారమే కావాలి. ఆ అంతిమ లక్ష్యం కోసం పోరాటం చేయకుండా పవర్‌లేని టికెట్ల కొరకై పోరాటం చేయడం సరైనదేనా!

అగ్రకుల పార్టీ లో బీసీ చెంచాలు టికెట్లు పొందినా పొందకపోయినా పేదలకు జరిగే నష్టమేమీ లేదు. 112 బిసి కులాలు కుల సంఘాల వారిగా బలపడి రాష్ట్రస్థాయి కుల సంఘం నాయకులుగా ఎదగాలి. రాజ్యాధికార పెత్తనంతో కూడిన సీఎం కుర్చీ రాబట్టుకోవాలి.

చెన్నోజు శ్రీనివాసులు, సామాజిక ఉద్యమకారుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here