ప్రాంతీయ వార్తలు

శిర్డీలో కొనసాగుతున్న బంద్‌..!

  • సాయి జన్మ భూమిపై వివాదం
  • అత్యవసరంగా సమావేశమైన మహా సీఎం

మొన్నటిదాకా సాయిబాబా హిందూ దేవుడా కదా అనే ఒక చర్చ సంచలనం రేపింది. ఇప్పుడది సమసిపోయింది అనుకోగానే మరోసారి సాయిబాబా చుట్టూ మళ్ళీ వివాదాలు అలుముకుంటున్నాయి. ఈ సారి సాయిబాబాపై కాకుండా ఆయన జన్మభూమి, కర్మభూమిలపై వివాదం రాజుకుంది. సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు ఆదివారం షిరిడి పట్టణ బంద్‌ కు షిర్డీ గ్రామ వాసులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉద్ధవ్‌ సర్కార్‌ షిరిడీపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు తాము వెనక్కి తగ్గబోమని షిరిడీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు…

  • ముంబయి:

సాయిబాబా జన్మస్థానంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది. శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. కార్యకలాపాలన్నీ స్తంభించడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించడంతో వివాదం తెరపైకి వచ్చింది. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని శిర్డీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధీకులందరితో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే త్వరలోనే సమావేశం కానున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ‘పాథ్రీ కృతి సమితి’ కూడా ఆదివారం నుంచి పాథ్రీలో బంద్‌ పాటిస్తున్నట్లు వెల్లడించింది.

శిరిడీ ఆలయ దర్శనాలు కొనసాగుతాయి..!

‘సాయిబాబా జన్మభూమి’పై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆదివారం నుంచి శిరిడీ ఆలయం మూసివేయనున్నారని జాతీయా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ స్పందించింది. బంద్‌ కేవలం శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాలకే పరిమితమని స్పస్టం చేసింది. గ్రామస్థుల బంద్తో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ పిలుపుపై వారితో చర్చించబోతున్నామని ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు ఈరోజు సాయంత్రం గ్రామస్థులు సమావేశం కానున్నట్లు సమాచారం. సాయి బాబా జన్మస్థలంగా చెబుతున్న ‘పాథ్రీ’ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రూ.100కోట్లు కేటాయించడంతో కొత్త వివాదానికి తెరలేసింది. దీంతో శిరిడీ ప్రాశస్య్తం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా వివాదంపై శిరిడీ గ్రామస్థులు, బాబా ట్రస్ట్‌ వారు స్పందిస్తూ.. తమ ఆందోళన పాథ్రీ అభివృద్ధిపై కాదని.. సాయి జన్మస్థలాన్ని వివాదం చేయడమేనని చెప్పుకొచ్చారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close