ప్రయివేటు స్కూల్ బస్సు.. గేర్ స్థానంలో వెదురు కర్ర

ముంబై: ముంబైలో ఓ ప్రయివేటు పాఠశాల బస్సు డ్రైవర్ రాజ్ కుమార్ (21) కు ఎంత నిర్లక్షం అంటే వాహనాన్ని నడపడానికి గేర్ స్థానంలో వెదురు కర్రను అమర్చి ఉపయోగిస్తున్నాడు. మూడు రోజుల పాటు బస్సును నడిపాడు. అయితే
ఫిబ్రవరి 5వ తేదీన గేర్ స్థానంలో అమర్చిన వెదురు కర్ర పని చేయకపోవడంతో అదుపుతప్పిన బస్సు.. బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టింది. దీంతో కారు యజమాని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. బస్సును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించగా.. గేర్ పాడైపోయింది. దాన్ని రిపేర్ చేయించడానికి సమయం లేకపోవడంతో.. దాని స్థానంలో వెదురుకర్రను ఉపయోగించి గత మూడు రోజుల నుంచి డ్రైవింగ్ చేస్తున్నానని తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులున్నప్పటికీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.