లంచం కోసం బిక్షాటన

  0

  భూపాలపల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రతి నెల లక్షల రూపాయలు జీతాలుగా తీసుకుంటారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సేవ చేయాల్సిన అధికారులు అక్రమంగా సంపాదించాలనే ఆలోచనతో అందిన కాడికి దండుకుంటూ పేద, ముసలి, ముతక అని చూడకుండా లంచాల పేరుతో వేధిస్తున్నారు. బంగారు తెలంగాణలో రాష్ట్రంలో ఎవరైనా లంచాల కోసం పీడిస్తే నేరుగా ఫోన్‌ చేయాలని చెప్పిన ప్రభుత్వం ఆ ఫోన్‌, అందులో వచ్చే వివరాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి అవకాశం దొరికితే అలా అందినకాడికి దండుకుంటూ పేద ప్రజలను పీక్కుతింటున్నారు. పర్యవేక్షించే అధికారులు కరువైనప్పుడు కింది స్థాయి అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది, తెలంగాణ జిల్లాలో ప్రతి కార్యాలయంలో ప్రతి పనికో రేటు ఉంది. మామూళ్లు ఇస్తేనే పైళ్లు కదులుతాయి. ప్రశ్నిస్తే పది రోజుల్లో కావాల్సిన పని సంవత్సరాలు పడుతోంది.

  జయశంకర్‌ జిల్లాలో పెరుగుతున్న లంచావతారాలు

  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఉంది. అక్కడ ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. డబ్బులిస్తేనే ఫైలు కదులుతోంది. మామూలు ఇవ్వకుంటే సంవత్సరాలైనా ఫైళ్లు అలాగే ఉంటుంది. చెదలు పట్టినా దానిని పట్టించుకునే వారే ఉండరు. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ కూడా లంచం ఇస్తేనే ఇస్తున్నారంటే అక్కడి పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూపాలపల్లి మండలం అజాంనగర్‌ గ్రామానికి చెందిన మాంత బస్వయ్య, లక్ష్మి దంపతులకు చెందిన తొమ్మిది ఎకరాల పట్టా భూమిని కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులకు మామూళ్లు సమర్పించి, వారి సహకారంతో పట్టా చేసుకున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో మండల తహశీల్దార్‌ కు ఫిర్యాదు చేశారు. అన్యాయంగా మా భూమిని కాజేశారని తమ భూమిని తమకే అప్పగించాలని తహశీల్దార్‌ ను కోరారు. ఆ వృద్ద దంపతులకు న్యాయం చేయాల్సిన మండల రెవెన్యూ అధికారులు విూ భూమి, విూకు రావాలంటే తమకు లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని, లేకుంటే విూ భూమి విూకు రాదని తహశీల్దార్‌ చెప్పారని బస్వయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్దులమైన మాకు బతకడానికే ఇబ్బంది ఉంటే లక్ష రూపాయలు ఏలా ఇవ్వాలని వారు రోదించసాగారు. న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా అన్యాయం చేయడంతో మాకు చేయాలో అర్థంకాక బిక్షాటనకు దిగామన్నారు. జోల సంచి చేతపట్టుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద బిక్షాటన చేయసాగారు. తమ భూమి తమకు అప్పగించాలని అడిగిన తహశీల్దార్‌ లంచం ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో చేసేదేమి లేక వర్తక వ్యాపారుల వద్ద బిక్షాటన చేస్తున్నామన్నారు. అవినీతికి అలవాటు పడ్డ ఈ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని తమ భూమి తమకు అప్పగించాలని వారు రోదించసాగారు.

  అవినీతి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొండి

  పంబిడి శ్రీధర్‌ రావు. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ జిల్లా అధ్యక్షుడు

  ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ, ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన అధికారులు లంచాలకు మరిగి ప్రజలను పీడిస్తున్నారన్నారు. భూపాలపల్లి జిల్లా అజాంనగర్‌ గ్రామానికి చెందిన బస్వయ్య భూమిని అక్రమణదారులు కబ్జా చేసారని, తమ భూమిని తమకే ఇప్పించాలని కోరగా లక్ష రూపాయలు లంచం ఇస్తేనే పని చేస్తానని అనడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి అధికారులపై కఠినచర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని, అప్పుడే మరొకరికి బుద్ది వస్తుందన్నారు. మా సంస్థ తరపున అవినీతి రెవెన్యూ అధికారులపై పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి బాధితుడికి మద్దతుగా ఉంటామన్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here