నేడు సుప్రీంలో అయోధ్య కేసు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అయోధ్య అన్నది పవిత్రమైన రాముని జన్మస్థలం. దీనికి నిజంగా ఎవరో పర్మిషన్‌ తీసుకుని గుడి కట్టాల్సిన అసవరం లేదు. మక్కాకో, జెరూసలెమో వెళ్లి గుడి కడతామంటే నవ్వుతారు. అలాగే అయోధ్య కూడా అంతే. అయోధ్య, మధుర, వారణాసి ఈ దేశ ప్రజల జీవనాడులు. సాంస్కృతిక వారసత్వాలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అన్నది హిందువుల మనోభావంగా గుర్తించాలి. అయోధ్యలోని రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కావద్దని కోరుకుంటున్న వారు తమను తాము సెక్యులర్‌గా ప్రకటించుకుంటున్నారు. మెజార్టీ ప్రజల మనోగతాలను పట్టించుకోకుండా వారు చరిత్రను మరచి మాట్లాడుతున్నారు. వీరితీరు ఈ దేశంలో అత్యధికులు ఆరాధించే రాముడిని అవమానించడమే. నాడు అయోధ్యలో రామాలయాన్ని కూల్చి రాముడిని అవమానించిన బాబర్‌ మసీదు కట్టి వివాదానికి కారకుడైతే కొందరు ఇంకా ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్న తీరు అత్యంత దారుణం కాక మరోటి కాదు.ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మదీనా, కైస్త్రవులు పవిత్రంగా భావించే జెరూసలెం, వాటికన్‌ సిటీలాగా అయోధ్య, కాశీ, మధురలు హిందువులకు పవిత్ర సంగమాలు. దీనిని గుర్తించడానికి భేషజాలు అక్కర్లేదు. అయోధ్య స్థలంపై యాజమాన్య హక్కును ధ్రువీకరించే టైటిల్‌ వివాదం కాదిది. రామజన్మభూమిలో రాముడి మందిరం మాత్రమే ఉండాలి. రాముడు పుట్టిన ప్రదేశాన్ని మార్చలేము. అలాంటి చోట్లనే ఎందుకు వివాదాలు చెలరేగాయో చరిత్ర చదివితే తెలుస్తుంది. హిందువులు సహనశీలురు కనుక ఇంతకాలం ఓపిక పట్టారని గుర్తుంచు కోవాల్సిన సమయమిది. దీనిపై ఎవరు కూడా అతిగా మాట్లాడి సమ్యను రాజేయవద్దు. సమయ్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్న వేళ గతాన్ని తవ్వ పుండును కెలకడం మంచిది కాదు. సుదీర్ఘంగా చర్చలు జరిపిన అఖిల భారతీయ అఖాడా పరిషత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ షియా వక్ఫ్‌ బోర్డులు దీనిపై సామరస్య పూర్వకంగా ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈ నెల 10న తుది విచారణ జరగనుంది. చాలామంది ఇప్పటికీ అయోధ్యను మందిర నిర్మాణ సమస్య గానే చూస్తున్నారు. అయోధ్య కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడివున్న అంశం. ఇక్కడ రామాలయం ఉండకుండా బాబ్రీ మసీదు ఎలా వచ్చిందో విమర్శకులు చరిత్ర చదివి తెలుసుకోవాలి. ఇలా అయోధ్య, వారణాసి, కాశీలల్లో మన ఆలయాలను నాటి దురాక్రమణ దారులు కూల్చి మసీదులు కట్టారు. వేలాది గుళ్లూ గోపురాలను కూల్చారు. వీటన్నికి చరిత్ర సాక్షీభూతంగా ఉంది. అయితే గతాన్ని మరచి ఓ సయోధ్య దిశగా సుప్రీం చేసిన సూచనలు కుహనా లౌకికివాదులకు స్ఫూర్తి కావాలి. ఈ దేశంలో వేలాదిగా మసీదులు ఉన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాబట్టి హిందువుల పవిత్ర మత ప్రాంతాల్లో దురాక్రమణ దారులు కట్టిన కట్టడాలను తొలగించాల్సిందే. ఇలా చేస్తేనే కోట్లాది హిందువుల గౌరవాన్నికాపాడిన వారు అవుతారు. హిందువుల మనోభావాలను గెలిచిన వారు అవుతారు. అయోధ్య మందిర నిర్మణం ఓ రెండు మూడెకరాల స్థల సమస్య అస్సలు కాదన్నది గుర్తుంచుకోవాలి. సున్నితమైన అయోధ్య మందిర వివాదానికి కోర్టు వెలుపల ఒక పరిష్కారాన్ని అన్వేషించడానికి సంబంధిత పక్షాలన్నీ చేస్తున్న ప్రయత్నాలతో ఈ దేశంలో శాంతికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. వివాదాలను కొనసాగించకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మతపరమైన విషయాలను చర్చల ద్వారానే చక్కగా పరిష్కరించు కోవచ్చని సుప్రీం ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వివాదాన్ని అర్థవంతంగా, చిత్తశుద్ధితో పరిష్కరించుకోవచ్చని తెలిపింది. ఇరువర్గాలూ కోరుకుంటే ప్రధాన మధ్యవర్తిని తామైనా నియమిస్తామని ప్రధాన న్యాయమూర్తి గతంలోనే సంసిద్దత వ్యక్తం చేసిన దరిమిలా బాబ్రీ కోసం పోరాడుతున్న వారు హిందువుల మనో భావాలను గెలవడానికి ఇంతకన్నా సమయం లేదు. చరిత్రలో కొందరు చేసిన పైశాచిక దాడులకు తాము వారసులం కామని నిరూపించు కోవాలి. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో మోదీ సర్కారు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో నాలుగింట మూడొంతుల ఆధిక్యంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడా, ఇక్కడా సానుకూల వాతావరణం ఉన్న దశలో సుప్రీంలో ఇలాంటి కీలక సమయంలో అయోధ్య సమస్య పరిష్కారం దిశగా ఒక అడుగు ముందుకు పడడం అన్నది సానుకూలంగా మలచు కోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here