Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలురాజకీయ వార్తలు

చిన్నమ్మకు సెలవు..

సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు పూర్తి..

  • అశ్రునయనాలతో వీడ్కోలు
  • భావోద్వేగానికి గురైన ప్రముఖులు
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర

తెలంగాణ ప్రజలు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఎన్నటికీ మరిచిపోలేరు. తెలంగాణ చిన్నమ్మగా ఆమె వారికి గుర్తుండిపోతారు. తెలంగాణతో ఆమె మరుపురాని అనుబంధాన్ని పెంచుకున్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో బలమైన వాణిని వినిపించారు. ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో సుష్మ స్వరాజ్‌ అనేక మార్లు తెలంగాణ వాణిని వినిపించారు. తెలంగాణ ప్రజల గొంతును వినాలని ఆమె పార్లమెంటులో డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు పార్లమెంటులో వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో తన కృషిని గుర్తించి తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తు పెట్టుకోవాలని ఆమె పార్లమెంటు వేదికగా కోరారు. దాంతో ఆమె తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోతారు. 2017 నవంబర్‌ లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సుష్మా స్వరాజ్‌ విదేశాంగ శాఖ మంత్రిగా పాల్గొన్నారు. సంప్రదాయ ఆధునీకరణల పరిపూర్ణ మేళవింపుగా ఆమె తెలంగాణను అభివర్ణిస్తూ తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారని చెబుకున్నారు. తనకు తెలంగాణ సంస్కృతి సుపరిచితమని కూడా చెబుకున్నారు.

కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి ఆమె పార్థివ దేహాన్ని లోధిరోడ్డులోని స్మశాన వాటికకు తరలించారు. ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా స్వరాజ్‌ అంతిమ సంస్కారాలు జరిగాయి. ఈ అంతిమ సంస్కారాలకు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ, ఇతర నేతలు హాజరయ్యారు. పలువురు నేతలు కన్నిటీ పర్యంతమయ్యారు. ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతాపార్టీకి చెందిన మహిళా నేతల్లో సుష్మా స్వరాజ్‌ అగ్రగణ్యురాలు. సుష్మా స్వరాజ్‌ 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మాస్వరాజ్‌ విద్యాభ్యాసం అంబాలాలోనే సాగింది. కళాశాల విద్య వరకు అంబాలాలోనే జరిగింది. ఆ తర్వాత పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగర్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1975లో వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్‌ కౌశల్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. స్వరాజ్‌ కౌశల్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగా… మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు.

విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె రాజకీయాలవైపు ఆకర్షితురాలయ్యారు. 1970లో ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు.  తన 25వ ఏట తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1977లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.... 1982 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1977 నుంచి 79 వరకు దేవీలాల్‌ ప్రభుత్వంలో కార్మిక  ఉపాధి కల్పన శాఖల మంత్రిగా ఆమె పనిచేశారు. ఆ తర్వాత ఆమె 1984లో భారతీయ జనతాపార్టీలో చేరారు. 1987లో బీజేపీ తరపున పోటీచేసి  హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. 1990లో సుష్మా స్వరాజ్‌ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. అంతకుముందు 1980,1984,1989లలో కార్నాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1996లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసారశాఖ కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్లీ రెండోసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై.. వాజ్‌పేయి రెండో మంత్రివర్గంలో మళ్లీ అవే శాఖలకు మంత్రిగా పనిచేశారు.  మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యూనికేషన్‌ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి 1998 అక్టోబర్‌లో బీజేపీ అధిష్టానం సుష్మా స్వరాజ్‌ను రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సుష్మా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మా రికార్డు సృష్టించారు.  2004 ఏప్రిల్‌లో సుష్మా ఉత్తరఖండ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్‌ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు.

జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండుశాఖలు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంతో పాటు పార్లమెంటరీ వ్యవహారాలశాఖలకు అదనపు బాధ్యతలు చేపట్టారు.  ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 నుంచి 2019 మే వరకు మోడీ కేబినెట్‌లో ఆమె విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలరీత్యా ఆమె 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. మొత్తంగా సుష్మాస్వరాజ్‌ తన రాజకీయ జీవితంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా... ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close