అంబేడ్కర్‌ విగ్రహం కూల్చివేతను.. జాతీయస్థాయిలో లేవనెత్తుతాం

0
  • కాంగ్రెస్‌ నేతలను తప్పుడు కేసులతో వేదిస్తున్నారు
  • జడ్పీ, ఎంపీపీ పదవులకు నేరుగా ఎన్నికలు పెడితే బాగుండేది
  • ఇంకో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తాం
  • టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం కూల్చివేతను జాతీయస్థాయిలో లేవనెత్తుతామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ధర్నా చేయడానికి ప్రయత్నించిన మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. అంబేడ్కర్‌ ని అవమానించింది కాకుండా ధర్నా చేయబోతే అరెస్ట్‌ చేస్తారా అని ఉత్తమ్‌ నిప్పులు చెరిగారు. మంద కృష్ణ నిర్బంధంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. ఆయనకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. చేవెళ్ల లోక్‌ సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇంటికి సివిల్‌ డ్రెస్‌ లో పోలీసులు వచ్చి దురుసుగా ప్రవర్తించారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోందని విమర్శించారు. అక్రమంగా కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వెంట ఉంటుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిది కాదని సూచించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమని మౌనంగా ఉన్నామని, ఇలాంటి కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని టీపీసీసీ చీఫ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్‌, ఎంపిపి పదవులకు నేరుగా ఎన్నికలు పెడితే బాగుంటుందని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో తాము సెలెక్ట్‌ ఎలెక్ట్‌ పద్దతిని పెడుతున్నామని, దీనిద్వారా గ్రామస్థాయిలో అభ్యర్థిని జనమే నిర్ణయించుకుంటారని అన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ పద్దతిలో జరుగుతాయని, ఇంకో రెండు రోజుల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని, కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారితే కేసులు పెట్టుకునేలా బాండ్‌ పేపర్‌ రాయించి ఇచ్చే అంశంపై కూడా చర్చ చేస్తున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here