17 నుంచి అసెంబ్లీ సమావేశాలు

0

17న ఎమ్మెల్యేల ప్రమాణం …18న స్పీకర్‌ ఎన్నిక

19న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం సభ్యుడు ముంతాజ్‌ ఖాన్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ శాసనసభ జనవరి 17న కొలువుదీరనుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులతో శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈనెల 17 నుంచి 20 వరకూ నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 16న సాయంత్రం 5గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌.. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. 17న శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. 119 మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 18న శాసనసభ స్పీకర్‌,డిప్యూటి స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. 19న శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. దీనికి స ఇఎం కెసిఆర్‌ సమాధానం ఇస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగనున్నాయి.

17న ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రోటెం స్పీకర్‌ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ తర్వాత జూబ్లీహాల్‌ ప్రాంగణంలోని కౌన్సిల్‌ లాన్స్‌లో శాసనసభ సభ్యులకు లంచ్‌ ఉంటుంది.17వ తేదీన స్పీకర్‌ ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన, నామినేషన్‌ కార్యక్రమాలు కూడా వుంటాయి. 18వ తేదీన స్పీకర్‌ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్‌ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్‌ స్థానానికి తోడ్కొని పోతారు. అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్‌ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తర్వాత స్పీకర్‌ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేస్తారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది.

ప్రోటెం స్పీకర్‌గా ముంతాజ్‌

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌ గా మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ట్వీట్‌ చేశారు. ముంతాజ్‌ మహ్మద్‌ ఖాన్‌ ను ప్రొటెం స్పీకర్‌ గా ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు దక్కిన గౌరవంగా చెప్‌ఆపరు. ముంతాజ్‌ మహ్మద్‌ ఖాన్‌ శాసనసభకు వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఇటీవల శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ముంతాజ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

పంచాయితీ ఎన్నికల తరవాతే విస్తరణ?

సెప్టెంబర్‌6న అసెంబ్లీ రద్దు చేస్తూ కెసిఆర్‌ నిర్ణయం తీసుకున్న తరవాత డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు

నిర్వహించారు. 11న ఓట్ల లెక్కింపు జరగగా,ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ 88 సీట్లతో ఘనవిజయం సాధించింది. 12న టిఆర్‌ఎస్‌ శాసనసభ్యులు సమావేవమై కెసిఆర్‌ను మరోమారు తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 13న కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా, మహ్మూద్‌ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే 21 నుంచి తెలంగాణలో మూడు విడతలుగా పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెలాఖరు వరకు ఈ ప్రక్రియ సాగనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ కూడా అప్పుడే జరుగుందని భావిస్తున్నారు. శాఖలను విలీనం చేసి పటిష్టం చేసేందుకు సిఎం కెసిఆర్‌ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో వాటిపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు, పంచాయితీ ఎన్నికల తరవాతనే మంత్రివర్గ కూర్పు ఉంటుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here