Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

9నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

  • రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తున్న కేసీఆర్‌
  • గవర్నర్‌ నరసిహన్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌

తెలంగాణ శాసనసభా సమావేశాలు ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదే రోజు బ్జడెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. గతంలో ఓటాన్‌ అకౌంట్‌ మాత్రమే ప్రవేశ పెట్టిన సర్కార్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. ఇటీవలే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన బి.వినోద్‌ కుమార్‌ కూడా బడ్జెట్‌ కసరత్తులో బిజీగా ఉన్నారు. అలాగే రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో ఈ సమావేశాల్లోనే దీనిపై చర్చజరిగే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా ఈ దఫా బ్జడెట్‌ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం విదితమే. విద్యుత్తు కొనుగోళ్ళ ఒప్పందాల అంశం సభలో దుమారం రేపుతుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కాగా ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్న బీజేపీ… శాసనసభలో ఎలాంటి వ్యూహాన్ని పాటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. విద్యుత్తు కొనుగోళ్ళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తారస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విదితమే.

ఈ నెల 9న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం బ్జడెట్‌ను ప్రవేశపెట్టనుంది.

గవర్నర్‌ నరసింహన్‌తో కెసిఆర్‌ భేటీ

గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. నరసింహన్‌ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2009 డిసెంబర్‌ 29న ఆనాడు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి పంపించారు. జనవరి 23, 2010న ఆంధప్రదేశ్‌కు నరసింహన్‌ను పూర్తికాలపు గవర్నర్‌గా నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 జూన్‌ 2014 నుంచి ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఏపీకి నూతన గవర్నర్‌ను నియమించగా.. అప్పటినుంచి నరసింహన్‌ తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలావుంటే పది సంవత్సరాలుగా రాష్ట్రానికి సేవ చేసి, బదిలీపై వెళ్లనున్న గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్ని సమస్యలొచ్చినా పరిష్కరించగల సమర్థుడాయన అంటూ కేటీఆర్‌ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సలహాలు, సూచనలు ఎప్పటికీ మర్చిపోలేనివని, ఆయన ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close