తెల్లవారుజామున.తెరాస నేత నందకిషోర్‌వ్యాస్‌ తనయుడిపై హత్యాయత్నం

0

★ మరో ముగ్గురిపై కత్తులతో దాడి
★ ఇద్దరి పరిస్థితి విషమం

(హైదరాబాద్, ఆదాబ్ హైదరాబాద్):
తెరాస రాష్ట్ర నేత, గోషామహల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పార్టీ టికెట్టును ఆశిస్తున్న నందకిషోర్‌ వ్యాస్‌ తనయుడిపై శుక్రవారం తెల్లవారు జామున హత్యాయత్నం జరిగింది. అతనితో పాటు మరో ముగ్గురిపై దుండగులు విచక్షణా రహితంగా కత్తిపోట్లు పొడిచి పరారయ్యారు. బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు తదనంతరం బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గోషామహల్‌ సబ్‌ డివిజన్‌లోని షాయినాయత్‌గంజ్‌ పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెరాస నేత నందకిషోర్‌వ్యాస్‌ తనయుడు ప్రేమ్‌వ్యాస్‌, అతని సోదరుడి తనయుడు అమిత్‌ వ్యాస్‌ కలిసి బషీర్‌బాగ్‌లోని తమ సొంత హోటల్‌లో ఉండగా.. అమిత్‌ వ్యాస్‌కు ఆకాష్‌ సోలంకి అనే మిత్రుడు ఫోన్‌ చేసి దుర్భాషలాడటంతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆకాష్‌ సోలంకి ఫోన్‌ చేసిన సందర్భంలో అమిత్‌ వ్యాస్‌ కాకుండా నందకిషోర్‌వ్యాస్‌ తనయుడు ప్రేమ్‌ వ్యాస్‌ ఫోన్‌ ఎత్తడంతో ఎదుడి వ్యక్తి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. దీంతో మాటా మాటా పెరిగింది. నీవెక్కడున్నావంటూ సదరు వ్యక్తి ప్రశ్నించడంతో… నేను బేగంబజార్‌కు వస్తునానంటూ బయలుదేరి షాయినాయత్‌గంజ్‌ ఠాణాకు అయిదు వందల మీటర్ల దూరంలో ఉన్న సంతోష్‌దాబా వద్దకు తెల్లవారు జామున రెండున్నర గంటలకు చేరుకున్నారు. ప్రేమ్‌ వ్యాస్‌, అమిత్‌ వ్యాస్‌తో పాటు ఆశిష్‌ యాదవ్‌, నవజోత్‌సింగ్‌ కలిసి సంతోష్‌దాబా వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆకాశ్‌ సోలంకి, దీపక్‌ వ్యాస్‌ కత్తులతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలకు గురై రక్తం మడుగులో పడి ఉన్న వారిని సమీపంలోని పోలీసులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే నందకిషోర్‌వ్యాస్‌ అనుచరులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని అక్కడి నుంచి బాధితులను బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ్‌ వ్యాస్‌కు పది చోట్ల కత్తిపోటు గాయాలు కాగా.. అమిత్‌ వ్యాస్‌కు పద్దెనిమిది చోట్ల కత్తిపోటు గాయాలైనట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆశిష్‌ యాదవ్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. నవజోత్‌సింగ్‌కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, భాజపా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌, తెరాస రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌ పరామర్శించారు. తెరాస నేత నందకిషోర్‌వ్యాస్‌ తనయుడు, అతని సోదరుడి కుమారుడిపై జరిగిన దాడిపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది రాజకీయ దాడినా? లేక యువకుల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here