Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మంత్రి పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సంక్రాంతి తరవాత 17 నుంచి అసెంబ్లీ సమావేవాలు ప్రరాంభం కానుండగా 18ననే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. దీనికితోడు కెసిఆర్‌ తలపెట్టిన చండీయాగం లోపే అన్ని వ్యవహారాలు పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటూనే సమర్థులైన వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది జాబితాను సిద్ధం చేస్తున్న ట్లు తెలిసింది. పాతకొత్తల మేలుకలయికగా మంత్రివర్గం ఉంటుందని ఇప్పటికే సిఎం కెసిఆర్‌ తెలిపారు. దీంతో పాతవాళ్లలో ఎందరికి మళ్లీ బెర్తులు దక్కుతాయో తెలియదు. కొత్తవాళ్లలో తనను, పార్టీని వెన్నంటి ఉన్నవాళ్లను చూసుకో వాల్సి ఉంది. దీంతో 18న విస్తరణకు అవకాశం ఉన్నందున ఒకటి, రెండురోజుల్లో దీనిపై సీఎం స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక విస్తరణపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఆత్రుత నెలకొంది. తమకు చాన్స్‌ ఉంటుందా అన్న ల్కెల వేసుకుంటున్నారు. కెసిఆర్‌ పనితీరు ఆధారంగానే పదవులను పంపిణీ చేస్తారని గతంలోనే తేలినందున ఇప్పుడు మరింత ఖచ్చితంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆయన ఎవరికి పదవులు కట్టబెట్టాలన్నది తన ఇష్టానుసారమే నడుచుకుంటారు. దీంతో ఆశావహులంతా ముఖ్యమంత్రి

కేసీఆర్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, కొంత మంది ఎమ్మెల్సీలు అమాత్య పదవులపై సీఎం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సభాపతి అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో చర్చించారు. మంత్రిపదవుల ప్రస్తావన రాలేదు. మరో వారం రోజుల గడువు ఉన్నందున ఒకటి, రెండు రోజుల్లో ఎమ్మెల్యేలతోనూ సీఎం మాట్లాడతారని భావిస్తున్నారు.సంక్రాంతి అనంతరం విస్తరణ జరుగుతుందన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. 18వ తేదీ మంచి ముహూర్తాలు ఉండటంతో పాటు శాసనసభ సమావేశాలను పురస్కరించుకొని విస్తరణకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఎనిమిదిమంది సభ్యులు ఉంటారనే ప్రాథమికంగా భావిస్తున్నా.. అదృష్ట సంఖ్య ఆరు కనుక ఆరుగురితో తొలుత ప్రమాణ ఉంటుందని కూడా భావిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచనలు కూడా తీసుకుని కెసిఆర్‌ సకసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలు ఏమైనా ఉంటే తప్ప 18నే విస్తరణ ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనికి ముందే స్పీకర్‌ ఎవరన్నది ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో దీనిపై కూడా కెసిర్‌ కసరత్తు చేస్తున్నారు. స్పీకర్‌ ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఈనెల 15న నిర్ణయం తీసుకోనున్నట్లుత ఎలుస్తోంది. ఈ జాబితాలో మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, రెడ్యా నాయక్‌లతో పాటు మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరితో సీఎం మాట్లాడారు. మిగిలిన వారితో 2 రోజుల్లో మాట్లాడి ఖరారు చేసే వీలుంది. మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేసేందుకు అవసరమైన టీమ్‌ను రూపొందించే పనిలో కెటిఆర్‌ ఉన్నారు. ఇందుకు అనగుణంగా రాష్ట్ర కమిటీలో ఖాళీల భర్తీకి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కార్యవర్గంపై దృష్టి సారించారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకాలపై ఆయన దృష్టి సారించారు. గత ఏడాది అక్టోబరులో 65 మందితో తెరాస రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యదర్శులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నియమించారు. ఎన్నికల సమయంలో వారిలో 9 మంది రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి, కార్యదర్శులు కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల నుంచి, నరేందర్‌రెడ్డి కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎస్సీ విభాగం అధ్యక్షుడు సుంకె రవికుమార్‌ చొప్పదండి నుంచి, బీసీ విభాగం అధ్యక్షుడు ముఠా గోపాల్‌ ముషీరాబాద్‌ నుంచి గెలిచారు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ప్రజలతో మమేకం కావడానికి వీలుగా పార్టీ పదవుల నుంచి వైదొలగాలని చెప్పడంతో మైనంపల్లి, కృష్ణమోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గోపాల్‌, రవికుమార్‌లు రాజీనామాలు చేశారు. మొత్తం 12 ఖాళీలు ఏర్పడ్డాయి. పంచాయతీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటు పార్టీ అవసరాల నిమిత్తం పలువురు కొత్తవారిని కూడా తీసుకోవాలని కేటీఆర్‌ భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీలోని వారికి ఇటీవల నియమిత పదవులతో పాటు రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా కూడా అవకాశాలు వస్తుండడంతో పార్టీ పదవులపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఖాళీలను భర్తీ చేస్తామని కేటీఆర్‌ ప్రకటించిన తరువాత పలువురు నేతలు ఆయనను కలిసి వెళ్లారు. కొందరు ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర నేతలు పార్టీలో బాధ్యతలను ఆశిస్తున్నారు. సమర్థత, విధేయత, కష్టపడి పనిచేసే తత్వం, పార్టీ శ్రేణులతో సన్నిహిత సంబంధాల వంటి వాటి ఆధారంగా కేటీఆర్‌ ముందుకు వెళతారని అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, పార్టీ జోడుగుర్రాల్లా పటిష్టంగా ఉండాలని చూస్తున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close