Featuredస్టేట్ న్యూస్

అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం..

  • బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు
  • ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తా..

హైదరాబాద్‌లోని తన ఇంట్లో నిరాహార దీక్ష చేపడుతున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వీయ గృహనిర్బంధంలో ఉండి వరుసగా రెండో రోజూ దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో పోలీసులు ఆదివారం సాయంత్రం ఆయన్ను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జేఏసీ కన్వీనర్‌ నివాసం ముందు ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అశ్వత్థామ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ.. ఆర్టీసీ కార్మికులు పోలీసులను నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికులు ప్రతిఘటించినప్పటికీ.. పోలీసులు బలవంతంగా అశ్వత్థామ రెడ్డిని వాహనంలో తరలించారు. హాస్పిటల్‌లోనూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. స్వీయ నిర్బంధంలో నిరాహార దీక్ష చేపట్టిన అశ్వత్థామ రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం ఉదయం బీజేపీ నేతలు వివేక్‌, జితేందర్‌ రెడ్డి తదితరులు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రెండు రోజుల దీక్ష భగ్నం కాగా ఉదయం నుండి ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు పలుసార్లు యత్నించారు… ఇందుకోసం ఇంటి తలుపులను మూసిన పోలీసులు మద్దతుదారులు ఎవ్వరు రాకుండా కట్టడి చేస్తూ వచ్చారు. దీక్షను భగ్నం చేసి… అరెస్ట్‌ చేస్తే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక అశ్వాత్థామా రెడ్డి ఆరోగ్యం కూడ క్షీణించడంతో బలవంతంగానైనా అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దీక్ష చేస్తున్న మరో కార్మిక నేత జేఏసీ కో కన్వినర్‌ రాజీరెడ్డిని దీక్షను కూడ భగ్నం చేసి ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఇక దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పలువురు నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన వారిలో మందక్రిష్ణ మాదిగతోపాటు, బీజేపీ నేతలు మాజీ ఎంపీ జితెందర్‌ రెడ్డిలను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్‌ చేసినా తమ డిమాండ్లు నెరవేరే వరకు దీక్షను కొనసాగిస్తామని కార్మిక నేతలు తెలిపారు. కార్మికులు ఎక్కడికక్కడ దీక్షలు చేస్తున్నారని తెలిపారు. కాగా అరెస్ట్‌ చేసిన నేతలను ఎక్కడి తీసుకువెళ్లారనేది సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆరా తీస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌ను కార్మికులు తాత్కాలికంగా పక్కనబెట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం చర్చల విషయంలో స్పందించకపోవడంతో.. నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.

సోమవారం సడక్‌ బంద్‌..

సమ్మె కార్యచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సడక్‌ బంద్‌ కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. దీంతో సడక్‌ బంద్‌కు తెలంగాణాలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మద్దతు తెలపడంతో పాటు స్యయంగా పాల్గోంటామని ప్రకటించారు. దీంతో అన్ని డిపోల్లో బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేయనున్నారు. అయితే నేతల అరెస్ట్‌ తో సడక్‌ బంద్‌పై ఏమేరకు ప్రభావం పడనుందో వేచి చూడాలి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close