అష్టలక్ష్మి అవతారం.. ఓటర్ల ఎదుట సాక్షాత్కారం

0

● ప్రచారంలో కారు జోరు
● ఇంకా వత్తి వెలిగించని కాంగ్రెస్
● చలి కాసుకుంటున్న కూటమి
● మతలబులు చెబుతూ… మతాబులు పేల్చుతున్న వైనం
● దీపావళి  పండుగ పూట ఓట్ల వేట
అండగా నిలుస్తామంటూ ప్రగల్బాలు

(రమ్యాచౌదరి, ఆదాబ్ హైదరాబాద్):

లక్ష్మీదేవి కోరిన వారికి కొంగుబంగారమై వరాలిచ్చే దేవత. లక్ష్మీదేవిని పూజిస్తే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు తీరి.. అష్ఠ, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. రానున్న దీపావళిని పురస్కరించుకొని ఆ లక్ష్మీదేవిని కొలవడానికి భక్తులు సంసిద్ధులవుతున్నారు. మరో వైపు ఓట్ల పండుగతో తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పంచాయతీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంగా వారంతా లక్ష్మీదేవిలా ఓటర్ల ఎదుట ప్రత్యక్షమవుతున్నారు..!

కేసిఆర్ జాబితా ప్రకటనతో తెరాసకు దీపావళి బాగానే ఉంటుంది. అయితే కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై పెద్ద వ్యతిరేకత లేకున్నా..స్థానిక నాయకులను మాత్రం లక్ష్మీ బాంబులు వెంటాడుతున్నాయి.

కూటమి కుంపట్లతో ఇంకా దీపావళిపై మనసుపెట్టని కాంగీదేశం, కమ్యునిస్టులు. భాజపా కమలం జెండా ఎగురనున్నదని చెపుతూ దీపావళి టపాసులు పేలుస్తోంది. జాబితా బయటకు వస్తే కానీ కాంగీయుల కంగాళి బయటపడదు.

ఎన్నికల్లో గెలిపిస్తే.. మేమూ అష్ఠ. ఐశ్వర్యాలను ప్రసాదిస్తామంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నెన్నో హామీల వరాలు కురిపిస్తున్నారు. తమ ప్రత్యర్థి అభ్యర్థులను రావణుడిలా పోల్చుతూ సమస్యలు పరిష్కరిస్తామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ… కష్టాల్ని తీరుస్తామంటూ ముసలికన్నీరు కారుస్తూ.. దీపావళి టపాసులను పేల్చుతున్నారు. ఇవిగో వారి మతాబుల మతలబులేమిటో చూద్దాం.

ఆదిలక్ష్మి:
భక్తులు మొదట నాలుగు హస్తాలు కలిగిన ఆది లక్ష్మిని కొలుస్తారు. ఆది దేవుడిని మొదట కొలిస్తేనే కోరిన కోరికలన్నీ తీరుతాయన్నది భక్తుల నమ్మకం. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు మొదటి సారి ఓటర్లను కొలుస్తూ వారి ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ఓ వైపు హామీలిస్తూ మరో వైపు డబ్బు, మద్యం పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. విందులు ఇవ్వడానికి వెనుకాడటంలేదు. ఇలా.. ఓటర్లకు అన్ని రకాల వసతులను కల్పిస్తూ అండగా ఉంటామని చెబుతున్నారు.

ధాన్యలక్ష్మి:
దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న పంటల సాగుకోసం రుణాల్ని తీసుకుంటూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. పంటల్ని సాగు చేసినా.. గిట్టుబాటు ధరలు దక్కక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటలకు రుణాలిస్తామని రైతులకు భరోసానిస్తున్నారు. ఓ పార్టీ నేతలు రూ. లక్ష రుణాల్ని మాఫీ చేస్తామంటే.. మరో పార్టీ నాయకులు రూ. 2 లక్షలలోపు రుణాల్ని మాఫీ చేస్తామని హామీలిస్తున్నారు. పెట్టుబడి సహాయం అందిస్తామని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలిస్తామని ఉదరగొడుతున్నారు. వ్యవసాయం అంటే దండగకాదు పండగలా చేస్తామంటూ వరాల జల్లు కురిపిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు రాయితీలు ఇస్తామంటూ అభయమిస్తున్నారు.

ధైర్యలక్ష్మి:
కష్టపడి చదివినా.. ఉద్యోగాలు, ఉపాధి లేక యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. అప్పులు పెరిగి, మద్దతు ధరలు లభించక రైతులు నైరాశ్యానికి లోనవుతున్నారు. ధైర్యం చాలని కొందరు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏ ఆధారంలేక జీవితాలను కష్టంగా నెట్టుకొస్తున్న పేదలు మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి పేదలు, నిరుద్యోగులు, రైతులకు నాయకులు ధైర్యం నూరిపోస్తున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి కల్పిస్తామని, రుణాల్ని మంజూరు చేస్తామంటూ భరోసానిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాల్ని వర్తింపజేస్తామని, రాయితీ రుణాల్ని మంజూరు చేస్తూ అండగా ఉంటామని ధైర్యలక్ష్మి రూపంలో స్థైర్యం నింపుతున్నారు.

ధనలక్ష్మి:
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు ధనలక్ష్మిని పూజిస్తూ సంపదను ప్రాప్తించాలంటూ వేడుకుంటారు. ఓటర్ల ఎదుట ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు ధనలక్ష్మి రూపంలో ప్రత్యక్షమవుతూ హామీల బాంబులు పేల్చుతున్నారు. నిరుద్యోగులకు ఆర్థిక రుణాల్ని మంజూరు చేస్తూ ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. లక్షలాది రూపాయలను ఖర్చుచేసి ఉన్నత విద్యాభ్యాసం చేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎర వేస్తున్నారు. ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్న వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనందిస్తామని భరోసా కల్పిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యురాళ్లకు రాయితీ రుణాలు, స్త్రీనిధి రుణాల్ని అందజేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించడానికి తోడ్పడుతామని హామీలు గుప్పిస్తున్నారు. మొత్తానికి.. వీరు హామీలతో ఓటర్లకు.. నాయకులు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు.

గజలక్ష్మి:
ప్రజలకు సంపదను ఇవ్వడమే కాదు.. ఎన్నికల్లో గెలుపొందడానికి అండగా నిలిచే ద్వితీయ, ఆ కింది శ్రేణి నాయకులు, కార్యకర్తలకు గుర్తింపునిస్తూ బలాన్నిస్తామని గజలక్ష్మి రూపంలో కోతలు కోస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయించేలా చూస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు పదవులు కట్టబెడతామంటూ చోటామోటా నాయకులకు ఎర వేస్తున్నారు. కొంత స్థాయి ఉన్న నాయకుడైతే పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లుగా అవకాశమిస్తామని, నామినేటెడ్‌ పదవులను ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఓట్లు వేస్తే అన్నగా అండగా నిలుస్తామని హామీలిస్తున్నారు.

విద్యాలక్ష్మి:
పిల్లల భవిష్యత్తుకు చదువే ప్రధానం. కొన్ని ప్రాంతాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా.. పాఠశాలలు లేక నిరక్షరాస్యులగానే ఉంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కళాశాలలు లేవు. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల విద్యకే పరిమితమవుతూ ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదువులకు నోచుకోవడం లేదు. ఇలాంటి ప్రాంతాల్లో నేతలు పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తామని హామీలిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండటానికి పాఠశాలలు, కొత్తకోర్సులతో కళాశాలలను నెలకొల్పుతామని చెబుతున్నారు. అదేవిధంగా ప్రైవేటు కళాశాలల్లో చదివిస్తే రుసుంలను తగ్గిస్తామని భరోసానిస్తూ విద్యాలక్ష్మిగా అవతరిస్తున్నారు.

సంతానలక్ష్మి:
నేటి ప్రభుత్వాలు.. గర్భంలో ఉన్న శిశువు నుంచి పుట్టే వరకు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. శిశువు ఆరోగ్యవంతంగా జన్మించడానికి గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నారు. పుట్టిన శిశువు బలవర్ధకంగా ఉండాలన్న ఉద్దేశంతో బాలింతలకూ పోషకాహారం అందజేస్తున్నారు. పుట్టిన బిడ్డ, బాలింతల సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లను అందజేస్తోంది. తల్లీబిడ్డల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రవేశపెడుతూ పుట్టిన సంతానానికి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతున్నారు. ఆరోగ్యవంతంగా జన్మించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఔషధాలు అందిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. శిశువులు, బాలలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్ఠం చేస్తూ పోషకాహారం పంపిణీ చేస్తామని చెబుతున్నారు.

విజయలక్ష్మి:
ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే.. మీరు అన్ని రంగాల్లో విజేతలుగా నిలిచేలా చూస్తామంటున్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగ, రాజకీయ, వ్యవసాయ రంగాల్లో విజయం సాధించేలా అండగా ఉంటామని చెబుతున్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలను కల్పిస్తూ ఉద్యోగరంగంలో విజేతగా  నిలిచేలా చూస్తామని హామీలిస్తున్నారు. రాజకీయ రంగంలో వివిధ పదవులను కట్టబెట్టి గెలుపొందేలా చూస్తామని ద్వితీయ శ్రేణి నాయకులను ఊరిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరల్ని కల్పిస్తూ వ్యవసాయంలో  అధిక దిగుబడులు వచ్చేలా చూస్తామని ఊరడిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here