మేం అర్థం చేసుకోలేకపోయాం: కోహ్లీ

Updated:16/04/2018 07:44 AM

we cannot understand said kohli

రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తమ సొంత మైదానం చిన్నస్వామిలో పిచ్‌ స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన చేసిన రహానె బృందం 217 పరుగులు చేయగా ఛేదనకు దిగిన కోహ్లీసేన 198 చేసింది. వికెట్‌ను తాము స్లోగా ఉంటుందని అంచనా వేసినట్టు విరాట్‌ మీడియాకు వెల్లడించాడు.

‘మ్యాచ్‌ జరిగేటప్పుడు పిచ్‌ మందకొడిగా ప్రవర్తిస్తుందని అంచనా వేశాం. కానీ తొలి ఇన్నింగ్స్‌లో బంతి చక్కగా బ్యాట్‌ మీదకు రావడంతో ఆశ్చర్యపోయాం. ఇది 200 పరుగులు చేయగల వికెట్‌ అనుకోలేదు. కానీ ఇది టీ20. అలాంటివి జరుగుతుంటాయి. మ్యాచ్‌లో మా బౌలర్లను తప్పుపట్టాల్సిందేమీ లేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. వికెట్‌పై 400 పరుగులు పారించారంటే బౌలర్లపై ఒత్తిడి అర్థం చేసుకోవచ్చు. జట్టుకు సమతూకం తేవాలని, మరొక బౌలింగ్‌ వనరు అందుబాటులో ఉంటుందని సర్ఫరాజ్‌ను కాదని పవన్‌నేగిని ఎంచుకున్నాం. చివర్లో మన్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా ఆడటం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌ ఆదుకోగలదన్న నమ్మకం కలిగింది. రాజస్థాన్‌ రాయల్స్‌లో సంజూ శాంసన్‌ ఆట అద్భుతం. కుర్రాళ్లను చూస్తుంటే జాతీయ జట్టుకు ప్రతిభా వనరులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.