కరోనా వ్యాప్తికి కారణం వూహానే..

కరోనా వ్యాప్తికి కారణం వూహానే..


- సీఫుడ్‌ మార్కెట్‌ నుంచి మానవులకు సంక్రమణ
- తేల్చి చెప్పిన వైద్య పరిశోధనలు.. 
న్యూ ఢిల్లీ, 27 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) : 

కోవిడ్‌19 పుట్టుకకు సంబంధించిన కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ఆ వైరస్‌ చైనాలోని వుహాన్‌లో ఉన్న సీఫుడ్‌ మార్కెట్‌ నుంచే వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు ఒక నిర్దారణకు వచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలను వాళ్లు ప్రజెంట్‌ చేశారు. రెండు వేర్వేరు అధ్యయనాలకు సంబంధించిన నివేదికలను జర్నల్‌ సైన్స్‌లో పబ్లిష్‌ చేశారు. కోవిడ్‌ తొలుత వుహాన్‌లోని మార్కెట్‌ నుంచి వ్యాపించిందా లేక ల్యాబ్‌ నుంచి లీకైందా అన్న డౌట్స్‌ ఉండేవి. అయితే ఆ ప్రాణాంతక వైరస్‌ వుహాన్‌లోని సీఫుడ్‌ మార్కెట్‌లో ఉన్న జంతువుల నుంచి మానవులకు సంక్రమించినట్లు రెండు స్టడీలు తేల్చాయి. వుహాన్‌ మార్కెట్‌ ప్రాంతంలో చాలా కేసులు తొలుత నమోదు అయినట్లు ఓ స్టడీలో స్పష్టం చేశారు. ఇక జన్యు సమాచారం ద్వారా వ్యాధి వ్యాప్తి గురించి రెండో స్టడీ ద్వారా తేల్చారు. 2019 నవంబర్‌ లేదా డిసెంబర్‌లో మనుషుల్లోకి రెండు వేరియంట్లు ప్రవేశించినట్లు ఆ అధ్యయనాలు సూచించాయి. సార్స్‌ సీవోవీ 2 వైరస్‌ 2019లో హునన్‌ మార్కెట్‌లో అమ్మిన జంతువుల్లో ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. సెంటర్‌లో పనిచేస్తున్న వారికి తొలుత ఆ వైరస్‌ ట్రాన్స్‌మిట్‌ అయినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. జంతువుల నుంచి మనిషికి వైరస్‌ సోకిందని తేల్చారు. గ్లాస్‌గో యూనివర్సిటీలో పనిచేసే వైరాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ రాబర్ట్‌సన్‌ ఓ రిపోర్ట్‌ను తయారు చేశారు. వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీకైందన్న రికార్డులను ఇది సరిచేస్తుందని ఆయన అన్నారు. వైరస్‌ పుట్టుక గురించి రెండేళ్ల నుంచి శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త నివేదికల ద్వారా వాళ్లు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వుహాన్‌లో తొలుత ఆస్పత్రి పాలైన వారిలో 50 శాతం మంది మాత్రమే సీఫుడ్‌ మార్కెట్‌తో డైరెక్ట్‌ లింకు ఉన్నట్లు గుర్తించారు. వుహాన్‌లో నమోదు అయిన కేసులను మ్యాపింగ్‌ చేయడం ద్వారా కూడా కొన్ని స్పష్టమైన విషయాలు తెలిసాయని ఆరిజోనా యూనివర్సిటీలోని ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ శాఖ ప్రొఫెసర్‌ మైఖేల్‌ వోరోబే తెలిపారు. మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకున్న శ్యాంపిళ్ల ద్వారా శాస్త్రవేత్తలు కేసు మ్యాప్‌ను క్రియేట్‌ చేశారు. మార్కెట్‌కు దక్షిణదిశగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించామని ప్రొఫెసర్‌ రాబర్ట్‌సన్‌ తెలిపారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా రక్కూన్‌ డాగ్స్‌ను అమ్ముతున్నట్లు తేలిందన్నారు. సార్స్‌ సీవోవీ2 వైరస్‌ను మోసుకువెళ్లే జంతువుల్ని ఆ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.

Tags :