రాకెట్ల వర్షం.. రష్యా సైనిక స్థావరంపై ఉక్రెయిన్ దాడి..

రాకెట్ల వర్షం.. రష్యా సైనిక స్థావరంపై ఉక్రెయిన్ దాడి..


 

- మెలిటొపోల్ పై 30 చిన్నస్థాయి క్షిపణులతో దాడి.. 
- స్థావరం దాదాపు పూర్తిగా ధ్వంసమైనట్టు నగర మేయర్ వెల్లడి.. 
- ప్రాణ నష్టం వివరాలను ప్రకటించని రష్యా.. 
- ఎదురుదాడులు ముమ్మరం చేసిన ఉక్రెయిన్.. 

మెలిటోపోల్, 03 జూలై :
రష్యా దాడులతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ ప్రతి దాడులను ముమ్మరం చేసింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు పంపుతున్న ఆయుధాలతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రష్యా స్వాధీనం చేసుకున్న మెలిటొపోల్ నగరంలో ఉన్న రష్యా సైనిక స్థావరంపై భారీ దాడికి దిగింది. 30కి పైగా స్వల్ప దూరశ్రేణి క్షిపణులను వరుసగా ప్రయోగించింది. మెలిటొపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడంతో అక్కడి నుంచి పారిపోయి ఉక్రెయిన్ పరిధిలోకి వచ్చేసిన ఆ నగర మేయర్ ఇవాన్ ఫెడరోవ్ ఈ వివరాలు వెల్లడించారు. రష్యా సైనిక స్థావరం దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఉక్రెయిన్ అనుకూల వాదులు మెలిటొపోల్ నగరం సమీపంలో రష్యా నుంచి ఆయుధాలతో వస్తున్న రైలును పట్టాలు తప్పేలా చేశారని వెల్లడించారు. రష్యా సైనిక స్థావరంపై దాడులు జరిగినట్టు ఆ దేశ వార్తా సంస్థ ఆర్ఐఏ కూడా నిర్ధారించింది. కానీ ఏ ప్రాంతంలో జరిగాయి, ప్రాణ నష్టం వివరాలేమీ వెల్లడించలేదు.

ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో కీలకమైన డోన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించామని రష్యా ప్రకటించింది. కీలకమైన లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ‘‘రష్యా దళాలు, లూహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ యూనిట్లు లిసిచాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శత్రువును పూర్తి స్థాయిలో తరిమి కొట్టి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి” అని తన ప్రకటనలో పేర్కొంది.

మరికొన్ని చోట్లా దాడులు..
లిసిచాన్స్క్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా మోహరించి మొత్తంగా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత నగరమైన ఖార్ఖీవ్ లో ఉక్రెయిన్ మిలటరీ స్థావరంపై దాడి చేశామని.. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని మైకోలేవ్ నగర శివార్లలో ఉన్న విదేశీ విమానాల స్థావరాన్నీ నేలమట్టం చేశామని ప్రకటించింది.

డోన్బాస్ పై పూర్తి పట్టు కోసం..
రష్యాకు సరిహద్దుగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతం డోన్బాస్ ను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. డోన్బాస్ లోని లూహాన్స్క్, డోనెట్స్స్ రీజియన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ ఇప్పటికే రష్యా మద్దతుతో వేర్పాటు వాదులు ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలపై పోరాడుతున్నారు. వారితోపాటు రష్యా కూడా పెద్ద సంఖ్యలో దళాలతో కలిసి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటోంది.

Tags :