రిజైన్ చేసేస్తా..

రిజైన్ చేసేస్తా..

- సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించడంతో షాక్ లో థాక్రే..
- అసోంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు.. 
- షిండేను తమ నేతగా పేర్కొంటూ గవర్నర్‌కు లేఖ.. 
- అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను.. 
- నమ్మక ద్రోహానికి గురయ్యాను వుద్వేగంలో ఉద్ధవ్ 

ముంబై, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రతరం అవుతున్న వేళ.. సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ రెబల్ వర్గాన్ని బుజ్జగించేలా ఆఫర్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటం ఒక్క ఎమ్మెల్యేకు ఇష్టం లేకపోయినా తాను తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్దవ్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు థాక్రే.. 

"హిందుత్వ మా ఊపిరి. హిందుత్వ మా గుర్తింపు. మా భావజాలం. హిందుత్వం కోసం ఎవరేం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు. బాలాసాహెబ్ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నేను ప్రయత్నిస్తున్నాను. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదు" అని స్పష్టం చేశారు. సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తించానని.. కరోనా సమయంలో తమ కృషికి మంచి గుర్తింపు లభించిందని చెప్పారు. మంత్రి ఏక్నాథ్ శిందేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని... తమను బలవంతంగా లాక్కెళ్లారని వారంతా వాపోతున్నారని ఉద్ధవ్ చెప్పారు.

బాల్ థాక్రే కుమారుడిని.. పదవికోసం వెంపర్లాడను :
"నన్ను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్నా.. నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకున్నా. నేను బాల్ థాక్రే కుమారుడిని.. పదవి కోసం వెంపర్లాడను. రాజీనామాకు సిద్ధమే. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తా. అనుకోకుండా నాకు సీఎం పదవి దక్కింది. సీఎం పదవి తీసుకోవాలని గతంలో శరద్ పవార్ నన్ను కోరారు. పవార్ కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. సీఎం పదవి కోసం పోరాటం చేయను. సీఎంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. కొందరు ప్రేమతో గెలుస్తారు.. ఇంకొందరు కుట్రలతో గెలుస్తారు. నాకు సీఎంగా కొనసాగాలని లేదు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటా" అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

సొంత ఎమ్మెల్యేలే వద్దునుకుంటే ఏం అనగలను?
"ఇదంతా నాకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీనో నన్ను సీఎంగా వద్దనుకుంటే అది వేరు. ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాధ్ కూడా నన్ను సీఎంగా ఉండాలని కోరారు. కానీ, నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే నన్ను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు నేనేం అనగలను?. శివసైనికులంతా నాతో ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు" అని తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తంచేశారు.

గవర్నర్ కు రెబల్ ఎమ్మెల్యేలు లేఖ :
మరోవైపు, మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఏక్నాథ్ శిందే జోరుగా పావులు కదుపుతున్నారు. తమదే అసలైన శివసేన అంటూ 30మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ రాశారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ శిందేను గుర్తించాలని కోరారు. శివసేన తన సిద్ధాంతంతో రెండేళ్ల క్రితమే రాజీపడిపోయిందని ఆరోపించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో అవినీతిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుతం జైలులో ఉన్న అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ పేర్లను ప్రస్తావించారు. ఈ తీర్మానంలో మొత్తం 34మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా.. వీరిలో నలుగురు స్వతంత్రులు ఉన్నారు. ప్రభుత్వంలో అవినీతిపై శివసేన సభ్యులు, పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉందని లేఖలో పేర్కొన్నారు.

Tags :