Tuesday, March 19, 2024

ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు..

తప్పక చదవండి
  • తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం..
  • వచ్చే అసెంబ్లీలోనే బిల్లు ఆమోదం..
  • హైదరాబాద్‌ ప్రజారవాణాకు పెద్దపీట..
  • పలు రూట్లలో మెట్రో విస్తరణ..
  • 253 ఎకరాల భూమిని మామునూరు ఎయిర్ పోర్టుకి కేటాయింపు..
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,
    కుర్రా సత్యనారాయణ..
  • భారీ వర్షాలపై కేబినేట్‌ చర్చ..
  • సాయంగా 500 కోట్లు విడుదల
  • పంటనష్టాలపై సమగ్ర సమచారా సేకరణ
  • కేబినేట్‌ నిర్ణయాలను ప్రకటించిన కేటీఆర్..

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపోతే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించారు. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేలా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా.. వారి ప్రధాన డిమాండ్‌గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉండేది. అయితే, సంస్థను ఎట్టి పరిస్థితుల్లో నూ ప్రభుత్వంలో విలీనం చేయబోమని కేసీఆర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను అరచేతిలో పెట్టుకొని చూసుకుంటామని అప్పట్లో చెప్పారు. తాజాగా టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విలీనం పూర్తి అయితే ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను కూడా పరిగణిస్తారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్ట నున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృత పరిచేందుకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె చేయడం జరిగింది. వారి కోరికను మన్నిస్తూ.. అదేవిధంగా సామాజిక బాధ్యతగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా గుర్తిస్తూ.. అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే పక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నది. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని కేటీఆర్‌ తెలిపారు. ఇకపోతే హైదరాబాద్‌ భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సులువు చేయడానికి నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వివరించారు. కేబినేట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రులతో కలసి ఆయన విూడియాకు విరించారు.

హైదరాబాద్‌ మెట్రోను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు. కొన్ని మార్గాల్లో కింది నుంచి రోడ్డు, పై నుంచి మెట్రో రైలు వెళ్లేలా డబుల్‌ డెక్కర్‌ ఫ్లైవర్లను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. హైదరాబాద్‌ లో ప్రజా రవాణా దేశంలోనే అత్యంత మెరుగ్గా ఉండాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్‌ వివరించారు. మెట్రో విస్తరణలో భాగంగా మియాపూర్‌ ` ఎల్బీ నగర్‌ మార్గంలో ఇటు ఇస్నాపూర్‌ వరకూ, అటు పెద్ద అంబర్‌ పేట్‌ వరకూ (విజయవాడ మార్గంలో) మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిజామాబాద్‌ మార్గంలో జేబీఎస్‌ నుంచి కండ్లకోయ (ఓఆర్‌ఆర్‌) వరకూ విస్తరిస్తామని వివరించారు. ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకూ పనులకు శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి కొత్తూరు విూదుగా షాద్‌ నగర్‌ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి కందుకూరు వరకూ మెట్రోను పొడిగిస్తామని వివరించారు. ఇటు వరంగల్‌ మార్గంలో తార్నాక నుంచి యాదాద్రి జిల్లా బీబీ నగర్‌ వరకూ, ఉప్పల్‌ నుంచి ఈసీఐఎల్‌ వరకూ మెట్రో లైనును పొడిగిస్తామని వివరించారు. మొత్తం పొడిగింపులు అన్నీ రూ.60 వేల కోట్లతో చేపడతామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇంతకుముందు నిర్ణయించిన 101 కిలో విూటర్లకు అదనంగా ఈ కొత్త మెట్రో రైలు పొడిగింపులు ఉంటాయని చెప్పారు. రాబోయే మూడు లేదా నాలుగు ఏళ్లలో ఇవి పూర్తి చేయాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేయాలని మున్సిపల్‌ శాఖను కేసీఆర్‌ ఆదేశించినట్లుగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకూ ఒక డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ నిర్ణయించింది. పాతబస్తీలో మెట్రో కూడా పూర్తి చేస్తామని వివరించారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో వ్యవస్థను కూడా నిర్మిస్తామని వివరించారు. పాట్నీ నుంచి కండ్లకోయ వరకూ మరో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించాలని నిర్ణయించినట్లుగా కేటీఆర్‌ చెప్పారు. ఈ మార్గంలో కంటోన్మెంట్‌ ఏరియాలో భూములు కూడా సేకరించాల్సి ఉన్నందున ఆ పక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లుగా వివరించారు. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్లుగా కేటీఆర్‌ చెప్పారు. అన్ని నగరాల్లో మెట్రో పొడిగింపులకు కేంద్రం సహకరించినట్లుగానే తమకు సాయం చేస్తుందని అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఒకవేళ కేంద్రం సాయం చేయకపోయినా తాము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కాబట్టి, అందులో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడు రాష్టాన్రికి కావాల్సిన సహకారం అందుతుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా.. ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేస్తున్నట్లు కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మంగళవారం నాడు ఆర్టీసీ యూనియన్ల నేతలు కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు