వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకాలి అన్న ట్రంప్‌

Updated:09/04/2018 02:46 AM

trump says keep ends to share market

అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం రోజురోజుకీ ముదిరి తారాస్థాయికి చేరుతూ వచ్చినట్లు కనిపించింది. ఇరు దేశాలు పరస్పరం దిగుమతి చేసుకునే వస్తువులపై ఎడాపెడా సుంకాలు పెంచుకుంటూ పోయాయి. దీనిపై అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. చైనాతో రోజురోజుకీ పెరిగిపోతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన భావిస్తున్నారు.

‘చైనా వాణిజ్య పరంగా ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించుకుంటుంది. పన్నులు పెంచే విధానం సక్రమంగానే ఉంది. ఇరు దేశాలు పరస్పరం పన్నులను విధించుకుంటూ పోతున్నాయి. ఇరు దేశాలకు గొప్ప భవిష్యత్‌ ఉంది’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అనంతరం ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గురించి ప్రస్తావించారు. ‘మేం ఎప్పటికీ మంచి మిత్రులమే. వాణిజ్య వివాదంపై ఏం జరుగుతుందనేది తెలియదు’ అని ఆయన పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం చైనా నుంచి దిగుమతి చేసుకునే స్టీలు, అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు అమెరికా నిర్ణయం తీసుకోవడంతో ఈ వాణిజ్య యుద్ధం మొదలైంది. దీనికి దీటుగా చైనా 128 అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. అనంతరం 50 బిలియన్‌ డాలర్ల విలువ చేసే మరో 106 అమెరికా వస్తువులపైనా సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.