గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో తెలుగు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు

Updated:17/03/2018 11:43 AM

top ranks at gate exam in graduate aptitude test

జాతీయస్థాయిలో నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో తెలుగు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. కొన్ని బ్రాంచీల్లో 10 లోపు ర్యాంకులను దక్కించుకొని సత్తా చాటారు. ఎయిరోస్పేస్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ మండలం తిప్పనగుంటకు చెందిన భువనచంద్ర మొదటి ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలకు చెంది ఎన్‌ఐటీ వరంగల్‌లో చదువుతున్న పలువురికి 100లోపు ర్యాంకులు దక్కాయి. వందలోపు ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాల వారు పదుల సంఖ్యలో ఉంటారని అంచనా. ఎన్‌ఐటీ వరంగల్‌లో విద్యనభ్యసిస్తున్న బిహార్‌కు చెందిన సౌరవ్‌ కుమార్‌ సింగ్‌ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చదివే తెలుగు విద్యార్థుల ర్యాంకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరిన్ని ర్యాంకులు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఐఐటీలు సంయుక్తంగా ఏటా గేట్‌ను నిర్వహిస్తున్నాయి. దీంట్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు ఓఎన్‌జీసీ, గెయిల్‌ తదితర దాదాపు 20 సంస్థలు నేరుగా మౌఖిక పరీక్షలకు ఆహ్వానించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈసారి ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహించగా, శుక్రవారం మధ్యాహ్నం ర్యాంకులను వెల్లడించారు. నిర్దేశించిన ప్రణాళికకంటే ఒకరోజు ముందుగానే ర్యాంకులను ప్రకటించడం గమనార్హం. దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది రాసి ఉంటారని అంచనా. ఈసారి పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించింది. పరీక్ష రాసినవారిలో మెకానికల్‌, ఈసీఈ, సివిల్‌, ఈఈఈ బ్రాంచీల నుంచే 80 శాతం మంది ఉన్నారు. దీంట్లో అర్హత సాధిస్తే ఆ స్కోర్‌కు మూడేళ్ల వరకు గుర్తింపు ఉంటుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో వందల సంఖ్యలో తెలుగు విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. గేట్‌ ర్యాంకుల ఆధారంగా తెలంగాణలో ఏటా 1,500 మంది, ఏపీలో సుమారు వెయ్యి మంది ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంటెక్‌లో చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి సుమారు 1.50 లక్షల మంది పరీక్ష రాసి ఉంటారని అంచనా. సగటున 15-16 శాతం మందే ఈ పరీక్షలో అర్హత సాధిస్తున్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా..
సివిల్‌ సర్వీసెస్‌ మాదిరిగానే గేట్‌ శిక్షణకు కూడా హైదరాబాద్‌ హబ్‌గా మారుతోంది. ఉత్తర భారత్‌కు చెందిన వందలాది మంది నగరానికి వచ్చి శిక్షణ పొంది మంచి ర్యాంకులు పొందుతున్నారు. యూపీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు 2, 3, 4, 8 ర్యాంకులను సాధించారని ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ ఛైర్మన్‌ వైవీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఈ పరీక్ష రాస్తున్న వారిలో 30 శాతం గత ఏడాది లేదా అంతకు ముందు సంవత్సరం బీటెక్‌ పూర్తిచేసి ఉంటారని చెబుతున్నారు. మిగిలిన వారు ప్రస్తుతం బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న వారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ చదివేందుకు సీట్లు దక్కని వారు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ పూర్తి చేసి గేట్‌ ర్యాంకులతో ఎంటెక్‌ను ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి సంస్థల్లో పూర్తి చేస్తున్నారు.