ర‌క్త‌హీనత స‌మ‌స్య ఉందా.. వీటిని తీసుకోండి..!

Updated:14/04/2018 10:55 AM

top effective tips to get rid to anemia

శరీరంలో చాలినంత ర‌క్తం లేకపోతే రక్తహీనత (ఎనీమియా) వ‌స్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. దేహంలో తగినంత ఐరన్‌ లేకపోవడం, విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణాలుగా చెప్ప‌వ‌చ్చు. మ‌న దేశంలో ప్రస్తుతం ఎనీమియా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. సరైన పోషకాహారం లేకపోవడమే రక్తహీనతకు దారితీస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువ‌వుతున్న‌ది.
నాలుక మీద‌, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, గోళ్లు పాలిపోయినట్లు ఉండటం, బలహీనంగా ఉండటం, చిన్నచిన్న పనులకే అలసిపోవడం, ఆయాసం రావడం, ఆసక్తి లేకపోవడం త‌దితరాల‌ను ర‌క్త‌హీన‌త ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.
ఐరన్ (ఇనుము) ఎక్కువగా ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర‌, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
ఇనుము పుష్కలంగా ఉండే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌ను నిత్యం తీసుకోవాలి.
మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. త‌ద్వారా ఐర‌న్ ఎక్కువ‌గా గ్ర‌హింప‌బ‌డి ర‌క్తం వృద్ధి చెందుతుంది.
బీట్‌రూట్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, ప్రొటీన్‌లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్-ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.
నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. బెల్లంతో ప‌ల్లీలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
తేనె కూడా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగాలి. మధుమేహం ఉన్నవారు తాగకపోవడం మంచిది.
అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. మార్కెట్‌లో లభించే సాధారణ ఉప్పుకు బదులుగా అయోడిన్ ఉప్పును వాడటం ద్వారా ఇనుము లోపం వల్ల వచ్చే రక్త హీనతను నివారించవచ్చు.