పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జి

Updated:22/06/2018 06:27 AM

steel bridge in panjagutta

పంజాగుట్టలోని చట్నీస్ వద్ద ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అక్కడి శ్మశానవాటికపై రూ.5.95 కోట్లతో స్టీల్ బ్రిడ్జీని నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటం, విస్తరణకు అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా శ్మశానవాటికపై స్టీల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం సమావేశమైన బల్దియా స్థాయీసంఘం స్టీల్ బ్రిడ్జీతోపాటు పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పంజాగుట్టలోని చట్నీస్ వద్ద రోడ్డుకు రెండువైపులా శ్మశాన వాటికలు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ నుంచి పంజాగుట్టవైపు వచ్చే మార్గం ఇరుకుగా, సింగిల్ లేన్ మాత్రమే ఉండటంతో తరుచూ ట్రాఫిక్‌జామ్ అవుతున్నది. ముఖ్యంగా సాయంత్రం వేళ జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోతున్నది. రోడ్డు వెడల్పు చేసేందుకు శ్మశానవాటిక అడ్డుగా ఉన్న నేపథ్యంలో శ్మశానవాటికపైనుంచి స్టీల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. రెండు లేన్లుగా దీనిని నిర్మించనున్నారు.

 

 

స్థాయీసంఘం కీలక తీర్మానాలు..

-జీహెచ్‌ఎంసీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 50 సర్కిళ్లు, 10జోన్ల ఏర్పాటుతో పెరిగే అవసరాల కోసం 1,200 అదనపు పోస్టులు భర్తీ చేయనున్నారు. నియామక విధివిధానాలు, వారికి ఏడాది ఖర్చుకు రూ.98 కోట్లు విడుదలకు ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన. 
-ప్రతిజోన్‌లో 50 చొప్పున లగ్జరీ వాష్‌రూమ్(లూ-కేఫ్)ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఆమోదం. 
-చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా రూ.36 కోట్లతో లాడ్ బజార్‌లోని మహబూబ్ చౌక్(ముర్గీచౌక్)ను రెండు అంతస్తులు నిర్మించేందుకు అనుమతి. 
-ముర్గీచౌక్ పునర్నిర్మాణంలో అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచన. 
-పత్తర్‌గట్టి నుంచి చార్మినార్ మార్గంలోని పత్తర్‌గట్టి స్టోన్ ఆర్కెడ్ పునరుద్ధరణలో మిగిలిన పనులను రూ.5.97 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం. 
-ఎర్రమంజిల్‌లోని ప్రనవ్ లాడ్జి నుంచి హెరిటేజ్ ఫ్రెష్ వరకు 40 అడుగుల రోడ్డు విస్తరణ సందర్భంగా 15 ఆస్తుల సేకరణ ప్రతిపాదనకు ఆమోదం. 
-ప్రభుత్వ ఉద్యోగులకు 24.104శాతం నుంచి 25.676శాతం వరకు కరువుభత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన ఉత్తర్వులను జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపు. 
-గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల పునర్‌నిర్మాణం, అభివృద్ధిని పెద్ద ఎత్తున చేపడుతున్న దృష్ట్యా ఏర్పడే న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు లేక్స్ విభాగానికి ప్రత్యేకంగా స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించే ప్రతిపాదనకు ఆమోదం. 
-2018 స్థాయీసంఘం సమావేశాలను ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ప్రతిపాదనకు ఆమోదం. 
-మలక్‌పేట్ రైల్వేస్టేషన్ వద్ద తీవ్రంగా ఉండే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) వద్ద అదనపు మార్గం(వెంట్)ను ఏర్పాటుచేసేందుకు అడ్డుగా ఉన్న ఏడు ఆస్తుల సేకరణ ప్రతిపాదనకు ఆమోదం. 
-మూడు ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటుకు ఆమోదం. మేడ్చల్ జిల్లా బోరంపేట్, రామారం, సూరారం ఫారెస్ట్ క్లస్టర్‌లో 455.54హెక్టార్లలో రూ.12.18కోట్ల వ్యయంతో, రంగారెడ్డి జిల్లాలోని నాదర్‌గుల్‌లో 42.90హెక్టార్లలో రూ. 2.02కోట్లతో, మాదన్నగూడ క్లస్టర్‌లో 97.12హెక్టార్లలో రూ.3.55కోట్లతో ఫారెస్ట్ బ్లాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.