అప్పుల ఊబిలో శ్రీలంక దేశం..

అప్పుల ఊబిలో శ్రీలంక దేశం..

 

- దేశంలో గ‌డ్డు పరిస్థితులు నెలకొంటున్నాయి.. 
- దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనలేని స్థితి.. 
- దారుణంగా కుప్పకూలిన‌ ఆర్థిక వ్యవస్థ..  
- పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం..  
- పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన శ్రీలంక ప్రధాని.. 
- భారత్‌, చైనా, జపాన్‌లతో దాతల సమావేశం...
- సాయం కోసం శ్రీలంక ఎదురుచూపు.. 

కొలంబో, 22 జూన్ :
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో ఆ దేశం సతమతమవుతోంది. అయితే అంతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని పార్లమెంటు సాక్షిగా ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని అన్నారు. దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల్లో కూరుకుపోయిందని... దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందని అన్నారు. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అన్నారు. పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ప్రపంచంలోని ఏ దేశం కానీ, ఏ సంస్థ కానీ శ్రీలంకకు ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదని చెప్పారు. 

ఈ సందర్భంగా భారత్ అందించిన ఆపన్నహస్తం గురించి విక్రమసింఘే ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఇండియా 4 బిలియన్ డాలర్లు క్రెడిట్ లైన్ కింద ఇచ్చిందని పేర్కొన్నారు. మరింత సాయం చేయాలని కోరామన్నారు. భారత్ చేసిన ఆర్థిక సాయం దాతృత్వ విరాళాలు కాదని తెలిపారు. ఇంకా ఎంతకాలం భారత్ సాయం చేయగలదని నిర్వేదం వ్యక్తం చేశారు. వారి సాయానికి కూడా కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ రుణసాయాన్ని చెల్లించే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంద‌న్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారానే ఈ సంక్షోభం నుంచి బయటపడగలమని విక్రమసింఘే ప్రకటించారు. అందుకు తొలుత విదేశీ మారక నిల్వల కొరతను పరిష్కరించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం అంత సులభమైన అంశం మాత్రం కాదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరపడం ఒక్కటే తమ ముందున్న సురక్షితమైన ప్రత్యామ్నాయని తెలిపారు. అదనపు సాయాన్ని పొందేలా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఏప్రిల్లో 7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని ఎగవేస్తున్నట్లు ప్రకటించింది. 2026 నాటికి పలు దేశాలకు శ్రీలంక 25 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఆ దేశానికి మొత్తం 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు ఉన్నాయి. వచ్చే సోమవారం అమెరికా ఆర్థిక విభాగం నుంచి తమ దేశానికి ప్రతినిధులు రానున్నారని విక్రమసింఘే ప్రకటించారు. జులై చివరి నాటికి ఐఎంఎఫ్ అధికారిక ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విక్రమ సింఘే పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలోనే శ్రీలంకపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో హామిల్టర్ రిజర్వు బ్యాంకు కేసు నమోదు చేసింది. వచ్చే నెల కాలపరిమితి ముగియనున్న బిలియన్ డాలర్ల బాండ్లు చెల్లింపులను ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజపక్స కుటుంబమే ఈ ఎగవేతకు కారణమని ఆరోపించింది. బిలియన్ డాలర్ల సంపదను పోగుచేసుకున్న ఆ కుటుంబం దుబాయ్, సీషెల్స్, మార్టిన్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుందని తెలిపింది.

ఏవిధంగానైన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విదేశీ సహాయం కోరుతూ చైనా, భారత్‌, జపాన్‌లతో దాతాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే పేర్కొన్నారు. తమకు చారిత్రాత్మక మిత్రదేశాలుగా ఉ‍న్న ఈ దేశాల సాయంతోనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. అమెరికా నుంచి కూడా సాయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు న్యూఢిల్లీ నుంచి అదనపు మద్దతుపై చర్చల కోసం భారత్‌ నుంచి అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం వస్తుందని, అలాగే యూఎస్‌ ట్రెజరీ నుంచి ఒక బృందం వచ్చేవారం శ్రీలంక రానుందని వెల్లడించారు. అదీగాక భారత్‌ శ్రీలంకకి సుమారు రూ. 2 లక్షల కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే.

Tags :