శ్రీదేవి సినిమా ఫ్లాపైంది..క్షమించండి

Updated:16/04/2018 07:14 AM

sridevi movie flop.forgive me

దివంగత నటి శ్రీదేవి నటించిన అద్భుతమైన చిత్రాల్లో ‘రూప్‌ కీ రాణీ చోరోంకా రాజా’ చిత్రం ఒకటి. ఈ సినిమా వచ్చి నేటికి 25 ఏళ్లు కావొస్తోంది. 1993, ఏప్రిల్‌ 16న ఈ చిత్రం విడదలైంది. బాలీవుడ్‌ దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సతీశ్‌ కెరీర్‌లో ఇదే తొలి సినిమా. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అయింది. ఈ సినిమా వచ్చి నేటికి 25 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా సతీశ్‌..నిర్మాత బోనీ కపూర్‌కు ట్విటర్‌‌ ద్వారా క్షమాపణలు కోరారు.

‘25 ఏళ్ల క్రితం తీసిన ఈ చిత్రం ఫ్లాపైంది. కానీ ఇది నా తొలి సినిమా. నా బిడ్డలాంటిది. ఈ సినిమా ఎప్పటికీ నాకు చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోతుంది. కానీ సినిమా ఫ్లాపైన సందర్భంగా శ్రీదేవి మేడమ్‌ను గుర్తుచేసుకుంటూ బోనీకపూర్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన నాపై నమ్మకం ఉంచి సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ సినిమా ఫ్లాపవడంతో ఆయన చాలా బాధపడ్డారు.’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌ చూసిన కొందరు నెటిజన్లు సినిమా బాగానే ఉందని సాంకేతిక విలువలు కూడా బాగానే ఉన్నాయని ట్వీట్లు పెడుతున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ..‘సినిమా వచ్చిన 25 ఏళ్ల తర్వాత బాగుందా? లేదా? అన్నది ఆలోచించకూడదు. మన వైఫల్యాలను తల ఎత్తుకుని మరీ ఒప్పుకోవాలి. మనం ఎంతటి విజయవంతులమైనా..వైఫల్యాలను కూడా ఒప్పుకోవాలి. అప్పుడే మరింత విజయవంతం అవుతాం’ అని పేర్కొన్నారు.

అప్పట్లో ఈ సినిమాను బోనీ కపూర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇందులో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్‌, శ్రీదేవి, బోనీ కాంబినేషన్‌లో ‘మిస్టర్‌ ఇండియా’ సినిమా కూడా వచ్చింది. బాలీవుడ్‌లో దాదాపుగా శ్రీదేవి నటించిన చాలా సినిమాలకు భర్త బోనీ నిర్మాతగా వ్యవహరించారు.