విచార‌ణ వాయిదా వేయండి..

విచార‌ణ వాయిదా వేయండి..


- మాకు కొంత స‌మ‌య‌మివ్వండి.. 
- ఈడీకి లేఖ రాసిన సోనియా గాంధీ.. 
- కరోనా నుంచి కోలుకున్న సోనియా.. 
- ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి.. 
- ఇప్పట్లో విచారణకు రాలేనని ఈడీకి వెల్లడి.. 
- వివరాలు తెలియజేసిన జైరాం రమేశ్.. 

న్యూ ఢిల్లీ, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో నేడు  జరగనున్న విచారణకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నేడు సోనియా ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంది. అయితే, కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. కాగా కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్నిరోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. ఆమెకు ఇటీవల నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నుంచి సమన్లు అందాయి. ఈ నేపథ్యంలో, తాను ఇప్పట్లో విచారణకు రాలేనంటూ సోనియా ఈడీకి లేఖ రాశారు. ఈ వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారని జైరామ్ రమేశ్ తెలిపారు. అయితే, కొన్నిరోజుల పాటు ఇంటి నుంచి కదలొద్దని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో, తాను హాజరు కాలేనని, విచారణను మరికొన్ని వారాల పాటు వాయిదా వేయాలని సోనియా గాంధీ నేడు ఈడీకి లేఖ రాశారని జైరామ్ రమేశ్ వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టగా, కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

Tags :