సెనేటర్లు ఇబ్బందిపెట్టరు జుకర్‌బర్గ్‌ను

Updated:12/04/2018 11:41 AM

senators has kept zuckerberg in trouble

వినియోగదారుల డేటీ లీకేజీ విషయంలో వివాదంలో చిక్కుకున్న ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ రెండో రోజు అమెరికా కాంగ్రెషనల్‌ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శాసనకర్తలు రెండో రోజు ఆయనను ప్రశ్నలతో తెగ ఇబ్బందిపెట్టేశారు. మొదటి రోజు చాలా ఆత్మవిశ్వాసంతో, తడబాటు లేకుండా కనిపించిన జుకర్‌బర్గ్‌ తర్వాత రోజు మాత్రం విసుగ్గా కనిపించారు. హౌస్‌ ఆఫ్‌ ఎనర్జీ, కామర్స్‌ కమిటీకి చెందిన రిపబ్లికన్‌, డెమోక్రాట్‌ శాసనకర్తలు జుకర్‌బర్గ్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. క్లిష్టమైన ప్రశ్నలు సంధించడంతో ఆయన సమాధానాలు చెప్పేందుకు తడబడ్డారు. అయిదు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. డేటా లీకేజీతో పాటు కంపెనీ ప్రైవసీ నిబంధనల గురించి, ఒపియాడ్‌ సంక్షోభం, ఎగ్జిక్యూటివ్‌ ర్యాంక్స్‌లో వైవిధ్యం లేదని పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
విచారణ సమయంలో ఓ సెనేటర్‌ జుకర్‌బర్గ్‌ను తన ప్రశ్నలకు ‘యస్’ లేదా ‘నో’ అనే సమాధానాలు చెప్పాలని అడిగారు. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఫేస్‌బుక్‌ సీఈఓ ఓ దశలో అసహనానికి గురైనట్లు కనిపించారు. బుధవారం కూడా ప్రశ్నల సమయంలో జుకర్‌బర్గ్‌ పలుమార్లు క్షమాపణలు చెప్పి తమ తప్పును అంగీకరించారు. ఇకపై డేటా దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఇంకా చాలా అంశాల్లో తాము మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి సమాచారాన్ని తీసుకుని దుర్వినియోగం చేసిందన్న వివాదం తెలిసిందే. అయితే కేంబ్రిడ్జి అనలిటికా తన సమాచారం కూడా తీసుకుందని బుధవారం నాటి విచారణలో జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జి అనలిటికా ఫేస్‌బుక్‌ నుంచి 8.7కోట్ల మంది వినియోగదారుల సమాచారం తీసుకుందని వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్‌ జుకర్‌బర్గ్‌పై జరిపిన విచారణ బుధవారం ముగిసింది.