లేఖాస్రాలు..

- లోక్ సభ స్పీకర్‌కు రేవంత్ రెడ్డి లేఖ..
- విపక్షాలు లేకుండానే పార్లమెంటులో కార్యక్రమాలా..?
- పార్లమెంటును అధికార పార్టీ కార్యాలయంగా మార్చకండి..
- రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత స్పీకర్‌దే..
- పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని
విపక్ష నేతలు లేకుండా మోడీ ఆవిష్కరించడం ఏమిటి..?
- వరద ప్రాంత రైతులను తక్షణమే ఆదుకోండి..
- పంట నష్టపోయిన వారికి రూ. 15వేలు పరిహారం ఇవ్వాలి
- సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ వ్రాసిన రేవంత్..
హైదరాబాద్, 12 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే విపక్షాలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా అక్కడ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఓ లేఖ రాశారు.
పార్లమెంటులో కార్యక్రమాలు విపక్షాలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా లేకుండా ఎలా నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తన లేఖలో ఓం బిర్లాను ప్రశ్నించారు. పార్లమెంటు భవనంలో ఏ కార్యక్రమం నిర్వహించినా విపక్షాలు, వాటి నేతలను తప్పనిసరిగా ఆహ్వానిస్తారు కదా? అని రేవంత్ అడిగారు. ఈ తరహా సంప్రదాయంతోనే పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడుతూ వస్తున్నామని కూడా ఆయన తెలిపారు. అధికార పార్టీకి చెందిన కార్యాలయంలాగా పార్లమెంటును మార్చడం ఎంతవరకు సబబని, అలా మార్చే హక్కు ఎవరికీ ఉండదని ఆయన తెలిపారు. అయినా రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరిదని ఆయన సూచించారు..
లోక్ సభలో అధికార పార్టీ నేతగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ సోమవారమే మస్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ చిహ్నం ఆవిష్కరణలో మోడీ వెనుక లోక్ సభ స్పీకర్ వున్న వైనాన్ని కూడా ప్రస్తావించిన ఓవైసీ... స్పీకర్ ప్రధానికి సబార్డినేట్ ఏమీ కాదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా మోడీ జాతీయ చిహ్నం ఆవిష్కరణను ప్రశ్నిస్తూ స్పీకర్‌కు లేఖ రాయడం ఇక్కడ గమనార్హం.
వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి..
సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖరాసిన రేవంత్ :
రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి ఎకరాకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నా వారిని ఆదుకునే పథకమేదీ ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్నదాతల పట్ల కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి తప్పుకున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పథకాల ద్వారా వారిని ఆదుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.