10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

Updated:13/03/2018 05:41 AM

ready for 10th class exams

మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌ కాపీయింగ్‌ వంటివి జరగకుండా ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులకు సమావేశాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సోమవారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పదో తరగతి పరీక్షలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులు పయ్యావుల పార్వతిని రాష్ట్ర పరిశీలకులుగా రానున్నారని తెలిపారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని డీఈవో కార్యాలయంలో 24 గంటలు పని చేసే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు, ఈనెల 14 నుంచి 29వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. కంట్రోల్‌ రూం నంబరు. 0863- 2229107కు పరీక్షల ఏర్పాట్లు గురించి గాని, ఇతర ఏ సమస్యలు ఉన్నా విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 57,842 మంది విద్యార్థులు హాజరు కానునన్నారని, వీరి కోసం 274 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు డీఈవో పేర్కొన్నారు. ఏ కేటగిరి 141, బీ కేటగిరి 75, సీ కేటగిరి 58 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా 274, డిపార్టుమెంటల్‌ అధికారులు 274 మందికి విధులు కేటాయించగా, అదనంగా 30 మందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా 14 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, సీ సెంటర్స్‌ 58 చోట్ల సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 8 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్షలు రాసేందుకు వీలుగా బెంచీల ఏర్పాటుతో పాటు నిరంతర విద్యుత్తు, ఫ్యాన్లు, చల్లని తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. స్కూల్‌ యూనిఫాంలతో విద్యార్థులు హాజరు కారాదని, సివిల్‌ డ్రస్‌లోనే పరీక్షలకు రావాల్సి ఉంటుందని సూచించారు. విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి స్మార్ట్‌ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఏవీ అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తరవుగా పరిశీలిస్తామన్నారు. మాల్‌పాక్ట్రిస్‌ జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈసారి పరీక్షల్లో ఇన్విజిలేటర్ల హాజరు బయోమెట్రిక్‌ ద్వారా ప్రయోగాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్‌కు స్థానచలనం ఉంటుందన్నారు.