రాయుడో..రాయుడు

Updated:15/05/2018 06:54 AM

rayudo rayudu

అతని పట్టుదల అమోఘం. అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ అద్భుతరీతిలో చెలరేగే వైనం. పరిస్థితులు పగపట్టినా ఆత్మవిశ్వాసం కోల్పోని నైజం. క్రికెట్‌ను శ్వాసగా భావిస్తూ యుక్తవయస్సులోనే సంచలనాలు సృష్టించిన అతని కెరీర్ ఆసాంతం ఒడిదొడుకుల పయనం. టోర్నీ ఏదైనా..ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా పట్టుదలతో కడదాకా పోరాడే ధీరత్వం. వెరసి తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయడంలో మన తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడికి మరెవరు సాటిరాని సందర్భం. ముంబై ఇండియన్స్ వద్దనుకున్న వేళ అక్కున చేర్చుకున్న చెన్నైకి రాయుడు ఆయువుపట్టుగా నిలిచిన సమయం. ప్రత్యర్థులను చీల్చిచెండాడుతూ ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్న రాయుడుపై ప్రత్యేక కథనం. 

టాప్ గేర్‌లో రాయుడు:

పెట్టిన ధరకు రెండింతలు న్యాయం చేస్తూ ఐపీఎల్‌లో రాయుడు బ్యాటింగ్ విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన ఈ డాషింగ్ క్రికెటర్ 48.63 సగటుతో 535 పరుగులతో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో తొలిసారి ఐదు వందల మార్క్ అందుకున్న రాయుడు ఖాతాలో ఓ సూపర్ సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. పరుగుల పండుగకు వేడుకైన ఐపీఎల్‌లో రాయుడు బ్యాటు నుంచి 48ఫోర్లు, 29 సిక్స్‌లు వచ్చాయి. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా అతని విధ్వంసం కొనసాగుతున్నది. లీగ్ తొలి అంచెలో కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా..ఏ స్థానంలో వచ్చినా తనశైలి ఇంతేనని చాటిచెబుతూ చెన్నైని ప్లేఆఫ్‌నకు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు. ముఖ్యంగా లీగ్‌లో ఎదుర్కొన్న ప్రత్యర్థులందరినీ తమ బౌలింగ్ బలగంతో దడదడలాడిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కూడా రాయుడు అలవోకగా ఎదుర్కొన్న తీరు ఆశ్యర్యపరిచింది. పుణెలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీలతో వీరవీహారం చేసిన రాయుడు ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.వాట్సన్ అండగా చెలరేగుతూ రాయుడు సాగించిన విధ్వంసరచనకు అభిమానులు ఫిదా అయిపోయారు. తన విలువేంటో గుర్తుచేస్తూ రెండేండ్ల నిషేధం తర్వాత లీగ్‌లోకి పునరాగమనం చేసిన చెన్నైకి రాయుడు ఆయువుపట్టుగా మారాడు. ఇదే జోరు కొనసాగిస్తే చెన్నైకి మూడో టైటిల్ ఖాయమైనట్లే. 

చాలా సంతోషంగా ఉంది

సీజన్ ప్రారంభానికి ముందు అసలు చెన్నై తుదిజట్టులో రాయుడికి చోటు దక్కుతుందా అనుకున్నారు. కానీ ఓపెనర్‌గా తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు తనదైన శైలిలో విజృంభిస్తూ పరుగుల హోరు సృష్టిస్తున్నాడు. కెప్టెన్ ధోనీ, మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చెన్నైకి ఒంటిచేత్తో విజయాలు కట్టబెడుతున్నాడు. ఐపీఎల్‌లో రాయుడు ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. మిడిలార్డర్‌లో రహానేను తప్పిస్తూ ఇతన్ని తీసుకుంది. తన ఎంపికపై స్పందిస్తూ తిరిగి భారత జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్ ఫామ్‌ను జాతీయజట్టు తరఫున కొనసాగిస్తానన్న నమ్మకం ఉంది అని రాయుడు అన్నాడు. నెల రోజులు మందు కనీసం సోదీలో లేని రాయుడు అనూహ్యంగా జాతీయజట్టుకు ఎంపిక అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిలకడైన ఫామ్‌తో టీమ్‌ఇండియాకు ఎంపికైన ఈ 32 ఏండ్ల తెలుగు క్రికెటర్ ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ బెర్తు కూడా దక్కించుకోవచ్చు.