ఎవరిని వరించనుందో..? రాష్ట్రపతి పీఠం..

ఎవరిని వరించనుందో..? రాష్ట్రపతి పీఠం..

 
( ఎం.డీ.ఏ. అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము.. ) 

- ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా..
- ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన ముర్ము.. 
- ఆదివాసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ద్రౌప‌ది.. 
- సుదీర్ఘ కాలంగా బీజేపీలో సేవలు అందిస్తున్న వైనం..
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా.. 
- ఉమ్మడిగా పేరును చర్చించిన విపక్షనేతలు.. 
- వాజ్‌పేయీ హాయంలో మంత్రిగా విధులు.. 
- ఐఏఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి.
- అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌

న్యూ ఢిల్లీ, 21 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌప‌ది ముర్ము బ‌రిలోకి దిగనున్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో బీజేపీ అగ్ర‌నేత‌లు ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేశారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఝార్ఖండ్ గ‌వ‌ర్నర్ గా ప‌నిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించింది.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా :
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడిరది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 27వ తేదీన యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. పార్లమెంట్‌ హౌస్‌ ఎనెక్స్‌లో విపక్ష నేతలు మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. శరద్‌ పవార్‌, మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేష్‌, సీతారాం ఏచూరి, డి.రాజా, ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు, విపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, వామపక్షాలు చేసిన డిమాండ్‌ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌కు యశ్వత్‌ సిన్హా రాజీనామా చేశారు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిత్వానికి మార్గం సుగమం అయింది. బీజేపీ మాజీ నేత అయిన యశ్వంత్‌ సిన్హా గత ఏడాది మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా యశ్వంత్‌ సిన్హా పనిచేశారు. 2018లో యశ్వంత్‌ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో తృణమూల్‌లో చేరారు. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్‌ సిన్హా మంగళవారం ఉదయం టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. మోడీ ఆర్థిక విధానాలను ప్రశ్నిస్తూ ఆయన బిజెపికి రాజీనామా చేశారు.  తొలుత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పేరును ప్రస్తావించగా.. అందుకు ఆయన నో చెప్పారు. ఆ తర్వాత నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా పేరు వినిపించినా ఆయన కూడా పోటీ చేయనంటూ తప్పుకున్నారు. అనంతరం బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును టీఎంసీ చీఫ్‌ మమత ప్రతిపాదించగా, ఆయన కూడా పోటీ చేయబోనని కుండబద్దలు కొట్టారు. మొత్తం ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా యశ్వంత్‌ సిన్హా పేరు తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది. మరో వైపు అధికార బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని తేల్చనుంది. కాగా జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి..

Tags :