రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై బీజేపీ నజర్..

రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై బీజేపీ నజర్..

- పట్టున్న నాయకుడికే పగ్గాలు.. 
- అగ్ర నాయకత్వం అభీష్టం.. 
- జోష్ పెంచిన విజయ సంకల్ప సభ.. 
- రేసులో ఐదుగురునేత‌లు..
- అధిష్టానం చూపు యువ‌త వైపే..


భాగ్యనగరం కేంద్రంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు అగ్ర నాయకులు, పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన్న విజయ సంకల్ప సభ విజయవంతం అవ్వడంతో రాష్ట్ర బీజేపీ క్యాడర్ లో జోష్ పెంచింది.. దీనితో అధికార పార్టీ టి.ఆర్.ఎస్.ను గద్దె దించి గోల్కొండ కోటపై కాషాయ జండాను ఎగురవేయాలనే కుతూహలంతో బీజేపీ క్యాడర్ ఉర్రూతలూగుతోంది.. అందులో భాగంగా ప్రజలతో మమేకమై వారి ఆదరాభిమానాలను చూరగొంటున్న యువత వైపు అగ్ర నాయకత్వం మొగ్గు చూపుతోంది.. ఇదే కోవలో ప్రజాధరణ పొందుతున్న యువనాయకునికి పగ్గాలిచ్చి, రాజేంద్ర నగర్ నియోజిక వర్గంలో టి.ఆర్.ఎస్. పార్టీ కంచుకోటను బద్దలుకొట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది..   

హైదరాబాద్, 10 జూలై (ఆదాబ్ హైదరాబాద్) :  
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజిక వర్గాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ దృష్టి సారించింది.. టిఆర్ఎస్ పార్టీకి రాజేంద్ర నగర్ నియోజికవర్గం కంచుకోట అయినప్పటికీ.. ప్రస్తుతం అధికార టి.ఆర్.ఎస్. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోందని  బహిరంగ చర్చ సాగుతోంది.. రాజేంద్ర‌న‌గ‌ర్ అసెంబ్లీ టికెట్ ను బీజేపీ నుంచి ఐదుగురునేత‌లు ఆశిస్తున్నారు. అందులో ఒక‌రు మైలార్ దేవ్‌ప‌ల్లి కార్పొరేట‌ర్ తోక‌ల శ్రీనివాస్ రెడ్డి, మ‌ణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మ‌న్ న‌రేంద‌ర్ రెడ్డి, మ‌రొక‌రు బీజేపీ రాష్ర్ట నాయ‌కులు బుక్క గోపాల్‌,  ప్రేమ్ రాజ్ యాద‌వ్‌, అంజ‌న్ కుమార్ గౌడ్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. 

శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకుంటూ ప్ర‌భుత్వ విధానాల‌ను ఎక్క‌డిక్క‌డ ఎండ‌గ‌డుతూ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే మ‌రోనేత గోపాల్ టికెట్ ఆశిసిస్తున్న‌ప్ప‌టికి అధిష్టానం న‌మ్మ‌లేక‌పోతుంది.. ఎందుకంటే ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్‌కు అనుచ‌రుడిగా ముద్ర ప‌డ‌టంతో కొంత మైన‌స్ అయ్యింది. ఇంకోనేత మ‌ణికొండ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ న‌రేంద‌ర్ రెడ్డికి కొంత బీజేపీలో సానుభూతి ఉన్న‌ప్ప‌టికి అధికార పార్టీ నేత‌లు, అధికారుల‌తో కుమ్మ‌క్కై మున్సిపాలిటీలో దందాలు సాగిస్తున్న‌ట్లు అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు స‌మాచారం. ఈ మేర‌కు బీజేపీ అధిష్టానం స్థానికంగా నియోజక వర్గంపై పట్టున్న బలమైన నాయకుడు, సమర్ధుడు మైలార్ దేవుపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిని రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికలలో ప్రతి పాదించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..


రాజకీయ నేపథ్యం :   
రాజేంద్రనగర్ నియోజక వర్గం, జీ.హెచ్.ఎం.సి.  మైలార్ దేవుపల్లి  డివిజన్ కేంద్రంగా తండ్రి తోకల శ్రీశైలం రెడ్డి వివిధ పార్టీలలో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం.. ఆ అనుభవాన్ని పుక్కిట పుచ్చుకున్న తోకల శ్రీనివాస్ రెడ్డి రాజేంద్ర నగర్ నియోజక వర్గం జి.హెచ్.ఎం.సి. లోనే అతిపెద్ద డివిజన్ గా మైలార్ దేవ్ పల్లి నిలుస్తోంది.. ఆ డివిజన్ కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సోదరుడు సిట్టింగ్ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్ పై శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.. మొదట టి.ఆర్.ఎస్.  పార్టీలోనే కొనసాగిన శ్రీనివాస్ రెడ్డి  టి.ఆర్.ఎస్.  కార్పొరేటర్ గా ఎన్నికై స్థానికంగా పార్టీలో అంతర్గత విభేదాలు చెలరేగటంతో.. స్దబ్దతగా ఉండిపోయారు.. 2020 లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో మైలార్ దేవ్ పల్లిలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసి, వందలాది మంది కార్యకర్తలు, అనుచర వర్గంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. విశేషం ఏమిటంటే బీజేపీలో చేరిన పది రోజులకే జి.హెచ్.ఎం.సి.  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది ..  స్థానికంగా పట్టున్న నాయకుడు కావడంతో ప్రజలు వెన్నంటే ఉండి బ్రహ్మరథం పట్టడంతో మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది రెండవ సారి బీజేపీ కార్పొరేటర్ గా సత్తా చాటారు.. బీజేపీలో చేరక ముందు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 14 వేల ఓట్లు సాధించడం విశేషం..       

ప్రేమే లక్ష్యం.. సేవే మార్గం : 
ప్రేమే లక్ష్యం.. సేవే మార్గం..  అనే నినాదంతో రాజేంద్ర నగర్ నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలలో  పాల్గొంటూ ఆ ప్రాంత ప్రజానీకానికి ఆదర్శంగా ఈ కుటుంబం నిలుస్తోంది.. కోవిడ్  మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని ఒక  కుదుపు కుదిపిన నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతోమంది  అభాగ్యులకు మేమున్నామంటూ భరోసా కల్పించడంతో పాటు నియోజక వర్గంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు, ఖరీదైన మందులు పంపిణీ చేయటం, భోజన వసతి కల్పించి వందలాది మందికి ఆకలి భాద నుండి విముక్తి కల్పించడం వారి సేవా నిరతికి నిదర్శనం.. ఆ సమయంలో కూడా ప్రత్యర్థులు సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం, అధికార పార్టీ దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.. ఇలాంటి యువ నాయకుడికి బీజేపీ అధిష్టానం రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లయితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రాజేంద్ర నగర్ నియోజక వర్గ ప్రజలు ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

Tags :