రైతు బంధును వెంటనే విడుదల చేయాలి..

రైతు బంధును వెంటనే విడుదల చేయాలి..


- ధర్నా చేపట్టిన జగిత్యాల ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు.. 
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

రైతుల పక్షాన పోరాటంలో భాగంగా రైతు బంధును అర్హులైన రైతులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలో బుధవారం ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి తహసీల్దార్  చౌరస్తా వరకు భారీగా  ర్యాలీ నిర్వహించిన కాంగ్రేస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఆర్ డి ఓ మాధురికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..  పంట వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రైతుబంధు ఆలస్యం కావడంతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గరి నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు ధాన్యం డబ్బులను  ఇస్తూనే మరో పక్క బ్యాంకర్స్ ను ఉసుగోలిపి బ్యాంకు రుణం చెల్లించాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు చేస్తానన్న రుణమాఫీ లక్ష రూపాయలు వెంటనే మాఫీ చేయాలన్నారు.  రైతులకు పెట్టుబడి సాయం  రైతుబంధు ను రైతుల ఖాతాల్లో వెంటనే జమ వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Tags :