ప్ర‌థ‌మ పౌరుడెవ‌రు..?

ప్ర‌థ‌మ పౌరుడెవ‌రు..?


- జూన్ 29 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
- జులై 18న ఎన్నిక‌లు.. 

న్యూ ఢిల్లీ, 21 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 

దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక ఒక ప్రసహనంగా మారింది.. అధికార ఎన్ .డీ.ఏ. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చేయని ప్రయత్నం లేదు.. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడబలుక్కుని తమ తరఫున అభ్యర్థిని నిలపాలని విశ్వప్రయత్నాలు చేసి, చివరకు యస్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా ఎంపిక చేశాయి.. శరత్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీలను సంప్రదించి విఫలమయ్యారు.. ఎట్టకేలకు ఇప్పుడు యస్వంత్ సిన్హాను ఒప్పించగలిగారు.. దీంతో రాష్ట్రపతి ఎన్నికకు పోటీ అనివార్యం అయ్యింది.. కాగా ఎన్డీఏ నుంచి ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు.. ఆదిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ( ఇంట్రో ).. 

దేశ రాజధానిలో సందడి మొదలైంది. రాష్ట్రపతి ఎవరనేది హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలంతా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలైతే మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతలా ఎన్నడూ లేదంటే ఆశ్చర్యం అవసరం లేదు.  

అయితే తాజాగా ఓ సెంటిమెంటు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ 13 మంది ఉప రాష్ట్రపతులుగా చేస్తే.. వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతి అయ్యారు. మలి ముగ్గురూ కాలేదు. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురూ అయ్యారు. మళ్లీ ముగ్గురు కాలేదు. ఇలా గతంలో ఉప రాష్ట్రపతులుగా పనిచేసిన వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, జాకీర్ హుస్సేన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు. ఆ కోవలోనే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అవుతారా..? లేదా.. అనే ఉత్కంఠ అందరిలో.. ముఖ్యంగా తెలుగువారిలో నెలకొంది.

Tags :